Sunday 18 October 2020

ఆనంద్ మార్పులు - తెవికీకి గుణపాఠాలు

 (22 జూలై 2016 నాటి చర్చ కాపి)

ఆనంద్ కొత్త సభ్యుడా, పాత సభ్యుడా అనే విషయం ప్రక్కన పెడితే ఆ సభ్యుడి దిద్దుబాట్లు ముఖ్యంగా రెండు విషయాలను తెలుపుతాయి. గ్రామవ్యాసాలలో ఇద్దరు సభ్యుల దిద్దుబాట్ల అసహనత మరియు తెవికీకే ఆశ కల్పించి డబ్బు ఆశించడం. పరిశీలించిన దిద్దుబాట్ల ఆధారంగా చెప్పాలంటే గ్రామవ్యాసాలలో చేర్చుతున్న సమాచారం చాలా ఘోరంగా ఉంది. సమాచారం లభ్యమౌతుంది కదాని తప్పులతడక వెబ్‌సైట్ల నుంచి అధికమొత్తంలో తప్పుడు సమాచారం కాపీ చేయడం నిబంధనలను అతిక్రమించడమే. సంవత్సరాల క్రితమే ఈ తప్పులతడక వెబ్‌సైట్ సమాచారం ఏ మాత్రం ప్రామాణికం కాదని చర్చలలో వ్యక్తమైంది. అప్పుడు తాత్కాలికంగా ఆపివేయబడిననూ చాలాకాలంగా అప్పటి చురుకైన సభ్యులు ఇప్పుడు చురుకుగా లేరని మళ్ళీ త.త.వెబ్‌సైట్ నుంచి గంపగుత్త సమాచారం చేర్చడం, ఇప్పుడు చురుకైన సభ్యులు, చురుకుగా ఉన్న నిర్వాహకులు కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రామవ్యాసాలలో సమాచారం చేర్చాలంటే ప్రామాణిక వెబ్‌సైట్ల సమాచారం అంతర్జాలంలో లభ్యమౌతున్ననూ అప్రామాణికమైన, వ్యాపారధోరణితో నడిచే త.త.వెబ్‌సైట్ నుంచి సమాచారం తెవికీలో చేర్చే ఉద్దేశ్యం స్పష్టంగానే కనిపిస్తోంది. నేను పరిశీలించిన కొన్ని మండలాల గ్రామాలు ముఖ్యంగా నా స్వంతమండలం తాండూరు మండలానికి చెందిన గ్రామాలలో చేర్చిన సమాచారం ఆధారంగా చెప్పాలంటే తాండూరు సమీపంలోని గ్రామాలకు కూడా సమీప రైల్వేస్టేషన్ తాండూరు కాకుండా దూరాన ఉన్న రైల్వేస్టేషన్ పేర్లు ఇవ్వబడ్డాయి. సమీప గ్రామాలు అని చెబుతూ ఎక్కడో 100 కిమీ పైబడి దూరాన ఉన్న పట్టణాల పేర్లు ఇవ్వబడ్డాయి. తాండూరు పట్టణంలో భాగంగా ఉన్న ప్రాంతాలు కూడా కొత్తగా గ్రామవ్యాసాలుగా సృష్టించబడ్డాయి. ఈ ప్రాంతాలకు బస్సులు కూడా తిరుగుతున్నాయని తప్పుడు సమాచారం చేర్చబడింది. ఉదా:కు పురపాలక సంఘంలో తొలివార్డు అయిన మాల్ రెడ్డిపల్లి(తాండూరు) ప్రాంతానికి అసలు బస్సులే లేవు. పాత తాండూర్ వ్యాసంకూడా కొత్తగా సృష్టించి సమీప మండలాలు అని విభాగం పెట్టి పట్టణంలోని ప్రాంతాలనే చేర్చారు. సమీప రైల్వేస్టేషన్ అంటూ దూరాన ఉన్న నవాండ్గి, ఆ తర్వాత తాండూరు ఉంచారు. అసలు తాండూరు రైల్వేస్టేషన్ ఉన్నదే పాతతాండురు ప్రాంతంలో. బస్సులే నడవని ఈ ప్రాంతానికి కూడా బస్సులు కూడా నడుస్తున్నాయి అని వ్రాయబడింది. చిన్న వ్యాసాలలో కూడా ఇన్ని తప్పులు ఉండడానికి కారణం సభ్యులు త.త.వెబ్‌సైట్ పైనే ఆధారపడి సమాచారం చేర్చడం. ఇలాంటి తప్పుడు సమాచారం చదివిన పాఠకులు తెవికీని ఎలా ఆదరిస్తారు, అభిమానిస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుమస్తా నగర్ గ్రామవ్యాసం కూడా తాండూరు పట్టణంలోని ఒక ప్రాంత వ్యాసమే. ఇందులో జనాభా విభాగం పెట్టి ఏవో గణాంకాలు రాశారు కాని అవి ఏ మాత్రం సరైనవి కావు, అసలు అవి ఎక్కడ లభ్యమైనాయి ? పట్టణంలో భాగంగా ఉన్న ఖాన్ కాలని వ్యాసాన్ని ఒక గ్రామవ్యాసంగా సృష్టించి "ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషనులు నావాంద్గి, మంతట్టి రైల్వే స్టేషనులు" అనీ, "బస్సులు కూడ నడుస్తున్నవి" అనీ వ్రాశారు కాని తాండూరు పట్టణంలోని ఒక ప్రాంతానికి తాండూరు రైల్వేస్టేషన్ మాత్రం దగ్గర కాదట! బస్సులు నడవని ప్రాంతానికి తప్పు సమాచారం చేర్చబడింది. మార్వాడి బజార్ వ్యాసం సమాచారం కూడా తప్పులతడకే. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇక రెండో విషయానికి వస్తే ఏడెనిమిది సంవత్సరాల క్రితం తెవికీలో అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తూ కష్టాన్ని, నష్టాన్ని భరిస్తూ తెవికీకి తోడ్పడేవాళ్ళము. సమాచారం చేర్చే కష్టమే కాదు స్వయంగా పలుప్రాంతాలను స్వంతఖర్చుతో భరిస్తూ ఫోటోలు తీస్తూ తెవికీలో ఇష్టాపూర్వకంగా చేర్చేవాళ్లము. దీన్ని కష్టం, నష్టంగా భావించకుండా పాఠకుల ప్రయోజనాలకోసం సంతోషంగా పనిచేసేవాళ్ళము. క్రమక్రమంగా పరిస్థితులు మారి వికీలలో డబ్బు పాత్ర పెరుగుతూ సభ్యులమధ్య వాదోపవాదాలు కూడా జరిగాయని చర్చాపేజీల ద్వారా తెలుస్తోంది. ఎప్పుడైతే డబ్బు రంగప్రవేశం చేసిందో అప్పుడే తెవికీ దిగజారడం మొదలైంది. స్వచ్ఛందంగా పనిచేసేవారు దాదాపు అందరూ దూరమయ్యారు. ఇప్పుడు సభ్యులు మరింతగా ముందుకు వెళ్ళి ఏవో కొన్ని ఫోటోలు అప్‌లోడ్ చేసి, తెవికీకి ఆశకల్పించి, కారు ఖర్చులిస్తే ఇలాంటివి మరిన్ని అప్‌లోడ్ చేస్తామనడం ఆశ్చర్యానికి గురిచేసే విషయమే ! తెవికీ అనేది ఎవరి నుంచి ఏమీ ఆశించదు, కేవలం స్వచ్ఛందంగా పనిచేసేవారే తెవికీకి సంపద లాంటివారు. అలాంటి తెవికీకే ఆశకల్పించడం, కొందరు సభ్యులు కూడా మద్దతు పలకడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ ప్రశ్నలకు బదులేది?

1) మండలంలోని అన్ని గ్రామాలు ఒకే ఎత్తులో ఉంటాయా ? ఒక మండలం సరిహద్దు పూర్తికాగానే ఆ గ్రామానికి, సరిహద్దు మండలంలోని మరో గ్రామానికి ఒకేసారి 30 నుంచి 200 మీటర్ల ఎత్తు తగ్గితే అమాంతం పడిపోవాల్సిందేనా ? (ఉదా: నారాయణఖేడ్, కంగ్టి మండల గ్రామాలన్నీ 600 మీటర్ల ఎత్తులో ఉంటే దానికి సరిహద్దు మండలంలోని కల్హేర్ మండల గ్రామాలన్నీ 375 మీటర్ల ఎత్తులో ఉన్నాయట !)
2) మండలం ఒక జిల్లా సరిహద్దులో ఉన్నంత మాత్రానా మండలంలోని అన్ని గ్రామాలు జిల్లా సరిహద్దులో ఉన్నట్లేనా ?
3) మండలంలోని ఒక గ్రామానికి కాని, కొన్ని గ్రామాలకు కాని, ఒక పట్టణం నుంచి రవాణా సౌకర్యం ఉన్నంత మాత్రానా మండలంలోని అన్ని గ్రామాలకు ఫలానా పట్టణం నుంచి రవాణా సౌకర్యం ఉన్నట్లేనా ?
4) సమీప గ్రామాలు అని విభాగం పేరుపెట్టి అందులో ఎక్కడెక్కడో సుదూరాన ఉన్న పట్టణాల పేర్లు ఉంఛడం భావ్యమేనా ?
5) మండల వ్యాసంలో సరిహద్దు మండలాలు పెట్టవచ్చు కాని గ్రామ వ్యాసాలలో కూడా సరిహద్దు మండలాలు పెట్టే అవసరం ఉన్నదా ?
6) భారతదేశంలో ఒకే టైం జోన్ అమలులో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రతి గ్రామవ్యాసంలో Time zone: IST (UTC+5:30) వ్రాసే అవసరం ఉన్నదా ?
7) కేవలం వాణిజ్య ప్రయోజనాలకై నిర్వహిస్తున్న తప్పులతడక వెబ్‌సైట్ నుంచి పెద్దమొత్తంలో తప్పుడు సమాచారం తీసుకొని తెవికీలో చేర్చడం న్యాయమేనా ?
8) సీనియర్ సభ్యులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు మిగితా నిర్వాహకులు, సభ్యులు చురుకుగా ఉండి కూడా పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి ?
9) కేవలం యాంత్రికంగా మాత్రమే లెక్కవేసి దూరాలు తెలిపే తప్పులతడక వెబ్‌సైట్ నుంచి సమాచారం తీసుకోవడం ఎంతవరకు ప్రామాణికం ?
10) ప్రామాణిక గ్రంథాలు, వెబ్‌సైట్ల నుంచి కాపీహక్కుల నిబంధనలను అనుసరిస్తూ కొన్ని కొన్ని పాయింట్లు మాత్రమే తీసుకుంటూ వ్యాసాలు తయారుచేయాలనే స్పష్టమైన మూలనిబంధనలున్న వికీలలో అప్రామాణికమైన వెబ్‌సైటు నుంచి, తప్పుల తడక వెబ్‌సైట్ నుంచి అధికమొత్తంలో సమాచారం తీసుకుంటూ తెవికిని తప్పుదారిపట్టించడం ఎంతవరకు సమంజసం ?
11) గ్రామవ్యాసాలలో సమాచారం పూర్తిచేయడానికి పలు ప్రామాణిక వెబ్‌సైట్లు అంతర్జాలంలో అందుబాటులో ఉన్ననూ, వాటిని విస్మరించి కేవలం సునాయాస దిద్దుబాట్లు చేయవచ్చనే లక్ష్యంతో తప్పుల తడక వెబ్‌సైటుపై ఆధారపడటం నిబంధనలను అతిక్రమించడం కాదా ?
12) కేవలం "లేవు" అనే పదం పెట్టడానికి ఒక విభాగం సృష్టించే అవసరం ఉన్నదా ?
13) పట్టణంలో భాగంగా ఉన్న ప్రాంతాలను కూడా గ్రామాలుగా కొత్త వ్యాసాలు సృష్టించడమే తప్పు అయితే అందులో మరింత తప్పు సమాచారం చేర్చి పాఠకులను తప్పుదోవ పట్టించడం న్యాయమేనా ?
14) మండలంలోని అన్ని గ్రామవ్యాసాలలో ఒకే సమాచారాన్ని కాపీచేస్తున్నట్లుగా ఎవరైనా గమనించవచ్చు. అక్షరదోషాలు కూడా మండలం మొత్తం వ్యాపిస్తున్నాయనేందుకు నారాయణ్‌ఖేడ్ మండలపు అన్ని గ్రామాలలోని "బీదర్ నుండి తోడ్డురవాణా సౌకర్యం కలదు" వాక్యమే ఉదాహరణ.
15) సభ్యులు సభ్యులు కలిసి ఊర్లు పంచుకొని తప్పులతడక వెబ్‌సైట్ నుంచి తప్పు సమాచారం పెడుతూ తెవికీని తప్పుడ్వికీగా మార్చడం ఏ మాత్రం సమంజసం ?
16) సభ్యులు తమకు ఇష్టమైన రంగాలలో పని చేసుకోవచ్చు అంటే ఇష్టమైనట్టు పని చేసుకోవచ్చు అనికాని, ఇష్టమైన విధంగా పనిచేసుకోవచ్చు అని అర్థం చేసుకోవచ్చా? నిబంధనలను త్రుంగలోతుక్కి ప్రవర్తించడం తగునా ?
17) ఏదో ఆధారం దొరికిందనీ, మూలం చేర్చుతున్నాం కదా అనీ ఇక్కడ సమాచారం చేర్చడమే ప్రధానమా? సమాచారం ప్రామాణికమా, కాదా అని విశ్లేషించకుండా పెద్ద ఎత్తున సమాచారం చేర్చడం సమంజసమేనా ?
(చర్చను విడదీయకండి) సి. చంద్ర కాంత రావు- చర్చ 19:37, 22 జూలై 2016 (UTC)

No comments:

Post a Comment