Sunday 18 October 2020

ఎనిమిది నియమాలు - పద్దెనిమిది అనుమానాలు

 (ఫిబ్రవరి 2019 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

నిర్వాహకత్వానికి గణాంకాలను ఆపాదించడానికి క్రింది కారణాల వల్ల నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.
1) నిర్వాహకులను గణాంకాలతో పోల్చలేము. నిర్వహణ అంటే నిర్వహణే. వారు చేసే పనులకు ఏ గణాంకమూ సాటిరాదు. నిర్వాహకులకు గణాంకాలను ఆపాదించడమంటే నిర్వాహకుల హోదాను దిగజార్చడమే అవుతుంది. అసలు కొన్ని నిర్వాహక పనులు గణాంకాలకు ఏ మాత్రం అందవు. కాని అలాంటి పనులే చాలా ముఖ్యమైనవి.
2) నిర్వాహకత్వానికి గణాంకాలు చూపెట్టడమంటే పరోక్షంగా బలవంతం చేయడంగా భావించవల్సి ఉంటుంది. ఇది స్వచ్ఛంధంగా పని చేయాల్సిన వికీ నియమానికి విరుద్ధం. సభ్యులైనా, నిర్వాహకులైనా ఇక్కడ చేసేది స్వచ్ఛంద పనే అనేది అందరికీ తెలిసిందే. స్వచ్ఛందంగా చేసే పనిలో గణాంకాలను అందుకోవాలనీ, లేనిచో మీ నిర్వాహక హోదా పోతుందనీ చెప్పడం సమంజసమేనా?
3) మెరుగైన నిర్వాహకుడు గణాంకాలను చూపడానికి ఇష్టపడడు. అలాంటివారిని నిర్వాహకులుగా తొలగించడం భావ్యమేనా! ఏ నిర్వాహకుడు ఏ సమయంలో ఉపయోగపడతాడో ఊహించలేము. సెలవులో ఉన్న నిర్వాహకుడు కూడా హఠాత్తుగా తెవికీలో వచ్చి ఒక పెద్ద సమస్యను తన నిర్వాహకత్వంతో పరిష్కరించవచ్చు. ఇవన్నీ గణాంకాలకు అందనివి.
4) గణాంకాల వల్ల పోటీ ఏర్పడవచ్చు. నిర్వాహకుల మధ్యన మనస్పర్థలు, వాదోపవాదాలు జరిగే అవకాశాలూ ఉన్నాయి. ఇదివరకు సాధారణ దిద్దుబాట్ల మధ్యనే పోటీ ఏర్పడిన సంగతి కూడా చూశాము. సాఫీగా నడవాల్సిన ప్రక్రియను మనకు మనమే అవాంతరాలు తెచ్చిపెట్టుకునే ఇలాంటి నిబంధనలు చేయకపోవడమే మంచిది.
5) గణాంకాలను చేరుకోజాలనని భావించిన నిర్వాహకుడు స్వచ్ఛంద ఉపసంహరణ చేసి కొంత కాలానికి మళ్ళీ నిర్వాహకుడు అయ్యే అవకాశముంది. మళ్ళీ మళ్ళీ ఉపసంహరణలు చేయడం, నిర్వాహకునిగా చేరడం వల్ల ఇతర నిర్వాహకులకు చికాకుగా అనిపించవచ్చు. తెవికీ సముదాయానికి ఇలాంటి పని భారంగా మారవచ్చు. స్వచ్ఛంద ఉపసంహరణ చేసిన నిర్వాహకుడు మళ్ళీ ఎంతకాలానికి నిర్వాహకుడు కావాలనే కాలం కూడా నిర్దేశించబడలేదు. ఈ అవకాశంతో గణాంకాలను చేరుకోలేని నిర్వాహకుడు ఉద్దేశ్యపూర్వకంగా స్వచ్ఛంద రాజీనామా చేసి కొంతకాలానికే మళ్ళీ సరాసరిగా నిర్వాహకుడౌతాడు. మరో 6 నెలలకు గణాంకాలు సరిపోనప్పుడు మళ్ళీ ఇదేవిధంగా చేస్తూ ఆయారాం గయారాంల మాదిరిగా తయారయ్యే అవకాశాలున్నాయి. (నిర్వాహకులను శంకించడం కాదు కాని ఈ అవకాశం మాత్రం ఉంది అని భావించండి)
6) నిర్వాహకుల గణాంకాల పని చూడటం తెవికీకి అదనపు భారంగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి తెవికీలో నిర్వహణ చేసే చురుకైన సభ్యుల కొరత ఉంది. అలాంటప్పుడు నిర్వాహక గణాంకాలను చూడడమనేది సభ్యులపై మరింత భారం వేయడమే అవుతుంది. దీనితో ఆ మేరకు ఇతర పనులు కుంటుపడటం ఖాయం.
7) గణాంకాల వల్ల చురుకైన సభ్యుల పని వృధా కావడం జరుగుతుంది. గణాంకాలు పరిశీలించడం, ప్రతిపాదనలు చేయడం, సమీక్షలు చేయడం, అభిప్రాయాలు రాయడం ... ఇదంతా వృధాపని కిందనే పరిగణించవచ్చు. చురుకైన సభ్యుల విలువైన కాలాన్ని వృధాచేయడంగానే భావించవల్సి వస్తుంది.
8) గణాంకాలపై మోజుతో ఉండే సభ్యుల వల్ల తెవికీ నాణ్యత ఎప్పుడో తగ్గిపోయింది. ఇప్పుడు గణాంకాల మోజులో పడే నిర్వాహకుల వల్ల నిర్వహణ నాణ్యత తగ్గిపోదనే నమ్మకం ఏమిటి? నిర్వాహకులందరూ గణాంకాలపై మోజుతో ఉన్నవారనీ దీని అర్థం కాదు, కాని ఈ విధంగా చేయరనే నమ్మకం ఏమిటి?
9) నిర్వాహకులు గణాంకాలు చేరుకోవడానికి ఉరుకులు వేయడం, గణాంకాలను చేరుకోలేని నిర్వాహకులను తొలగింపు ప్రతిపాదనలు చేయడం, ఓటింగులు, నిర్ణయాలు ... ఇవన్నీ గమనించే వారికి తమాషాగా, పూర్తి వినోదాత్మకంగా కనిపించడం ఖాయం. దీనికి అదనంగా ప్రక్రియలో దొర్లే పొరపాట్లపై వాదవివాదాలు షరామామూలే. తమాషా చూసేవారికి తెవికీ ఒక సర్కస్‌గా మారినా ఆశ్చర్యం లేదు. పలు చర్చలలో ఇప్పటికే కొందరు వ్యక్తులు కొత్త సభ్యుల అవతారమెత్తి సీనియర్ సభ్యులను సతాయించి తమాషా చూస్తున్నారు, మనకూ చూపిస్తున్నారు కూడా. తెవికీని బాగా పరిశీలించే వారికి ఇవన్నీ అనుభవమే.
10) నిర్వహణకు సరిపడా దిద్దుబాట్లు లేనప్పుడు నిర్వాహకులే కొత్తసభ్యుల అవతారమెత్తవచ్చు లేదా అనామకులు (ఐపీ అడ్రస్‌తో) వ్రాయవచ్చు కూడా. ఇలా చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేము. నిర్వాహకులను శంకించడం కాదు కాని ఈ అవకాశం కూడా ఉన్నదనే విషయాన్ని మాత్రం గుర్తించాలి. ఒక నియమం లేదా పాలసీ చేసేటప్పుడు ఇప్పటి పరిస్థితే కాకుండా భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కూడా ఊహించాల్సి ఉంటుంది. రేపు కొత్తగా వచ్చే నిర్వాహకులు ఎవరు, ఎలాంటివారు అనేది కూడా ఊహించాల్సి ఉంటుంది. ఎందుకంటే పదేళ్ళ క్రితం ఉన్న సభ్యులకు ఇప్పటి సభ్యులకు చాలా తేడా ఉంది. ఇలాంటి వారు రేపు నిర్వాహకులుగా మారరని గ్యారంటీ ఏమిటి? కొత్త సభ్యుల అవతారమెత్తిననూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే స్టీవార్డులకు చిక్కకుండా ఉండటం పెద్దపనేమీ కాదు. ఈ విషయాలన్నీ మనం ముందస్తుగానే పరిశీలించాలి.
11) పోలీసులే దొంగతనాలు చేయించి, దొంగలను పట్టుకొన్నట్లు చూపించి టార్గెట్లను చేరుకున్నట్టు చూపి ప్రమోషన్లు పొందే కథలను నవలలలో చూస్తుంటాము. అదే ప్రక్రియ ఇక్కడ జరగదని నమ్మడం ఏమిటి? దేనికైనా సరే మనం అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి. అలా జరగదు అని అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీలులేదు.
12) అసలు నిర్వాహక ఎడిట్లను ఖచ్చితంగా విభజించలేము. నిర్వాహక ఎడిట్లకు, నిర్వాహకేతర ఎడిట్లకు మధ్య తేడా చూపడానికి ఎలాంటి సరైన కొలమానం చాలా వాటికి లేదు. అలాంటప్పుడు నిర్వాహక ఎడిట్ల సంఖ్య ఆధారంగా చర్యలు తీసుకోవడం ఇబ్బందికర పరిణామాలకు దారితీయవచ్చు. వికీపీడియా పేరుబడితో (రచ్చబండ మినహా) చేసే మార్పులు, మూసలలో మార్పులు, మొదటిపేజీ నిర్వహణ మార్పులు నిర్వాహకులు కాని ఎవరైనా సభ్యులు చేయవచ్చు. ఆ పని సభ్యులే చేస్తే నిర్వాహకులు ఏమి చేయాలి?
13) నిర్వహణ దిద్దుబాట్ల సంఖ్యకు సరిపడా దిద్దుబాట్లు చేయకున్ననూ ఓటింగ్ ద్వారా సముదాయం కొనసాగించవచ్చనే దానికి అర్థం ఏమిటి? ఒకవైపు గణాంకాలు చేరుకోవాలనీ, మరోవైపు గణాంకాలు చేరుకోలేని నిర్వాహకులను ఓటింగ్ ద్వారా కొనసాగించవచ్చనీ భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అంటే తెవికీ సముదాయానికి "నచ్చిన" నిర్వాహకుడు గణాంకాలను చేరుకోవల్సిన అవసరం లేదన్నమాట ! అలాంటప్పుడు గణాంకాలెందుకు? "నచ్చని" నిర్వాహకులను ఎలాగూ ఓటింగ్ ద్వారా తొలగించే అవకాశం ఇప్పటికే ఉంది (కాకుంటే ప్రస్తుతానికి వారు చేసే పొరపాట్లకై ఎదురుచూడాల్సి ఉంటుంది !)
14) సమీక్ష అనంతరం నోటీసు ఇవ్వాలనీ, నోటీసు తర్వాత స్టీవార్డులను తెల్పి తొలగింపు అమలుచేయాలనీ ఉంది. తొలగింపుకే నిర్ణయం అన్నప్పుడు నోటీసు ఎందుకు? నోటీసు ఇస్తున్నామంటే సదసు సభ్యుడి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. మరి అతనిచ్చే వివరణ ఆధారంగా ఏమైనా మినహాయింపులు ఉన్నాయా ? ఉంటే ఎలాంటి మినహాయింపులు ? వివరణ సంతృప్తికరంగా లేనప్పుడు మాత్రమే తొలగింపుకై స్టీవార్డులను సంప్రదించాలి. కాని అభిప్రాయాలలో ఈ విషయం స్పష్టంగా లేదు. ఒకవేళ మినహాయింపులే లేనప్పుడు నోటీసులు ఎందుకు?
15) ఒక నిర్వాహకుడు గణాంకాలను చేరుకోకున్ననూ ఓటింగులో సభ్యుల "సహకారం"తో గట్టెక్కవచ్చు. మరో నిర్వాహకుడు తొలగింపునకు గురికావచ్చు. అంటే ఇక్కడ గణాంకాలు ముఖ్యమా? ఓటింగ్ ముఖ్యమా? ఓటింగే ముఖ్యమైతే గణాంకాలెందుకు? గణాంకాలే ముఖ్యమైతే ఆ తర్వాత మళ్ళీ ఓటింగ్ ఎందుకు? ఓటింగులో సంఖ్యకు కాకుండా అభిప్రాయాలకు విలువ ఉంటుంది, ఉండాలి కూడా. అలాంటప్పుడు ఏ ఒక్క సభ్యుడైనా బలమైన వాదన వినిపిస్తే మొత్తం ఓటింగుపై ప్రభావం తప్పకుండా పడుతుంది. మరి ఇంత చేసినా సమస్య మొదటికే వచ్చినట్లు కాదా?
16) గణాంకాలు చేరుకోలేని నిర్వాహకునిపై ముందుగా తొలగింపు చర్చ ప్రారంభించాలి, ఆ తర్వాత ఓటింగు, ఓటింగులో ప్రతిపాదన నెగ్గిన పిదప సదరు నిర్వాహకునికి నోటీసు, తర్వాత నోటీసు పరిశీలన .. చిన్న విషయానికి సుధీర్ఘమైన ప్రక్రియ జరిపిననూ చివరికి సాధించేది అనుమానమే. అలాంటప్పుడు ఈ ప్రక్రియ మొత్తం సభ్యులకు పనిభారమే తప్ప తెవికీకి లభించే నికర ప్రయోజనమేమీ ఉండకపోవచ్చు. నిర్వాహకుడు స్వచ్ఛందంగా వదులుకుంటే ఏమీకాదు, కనీసం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 2 సం.లలో దిద్దుబాట్లు ఏమీ చేయకున్ననూ స్వచ్ఛందంగా వదులుకున్నట్లే, కాని కొత్త నిబంధనల ద్వారా బలవంతంగా నిర్వాహకహోదా తొలగిస్తే మాత్రం నియమాలు బాగా తెలిసిన ఆ తొలగింపు నిర్వాహకుడు తెవికీలో జరిగే నిర్వాహణ లోపాలను కడిగిపారేస్తే అప్పుడున్న నిర్వాహకులు నోరెళ్ళబెట్టాల్సి వచ్చే పరిస్థితిని కూడా మనం ముందుగా ఊహించాలి. లేదంటే కోరి కొరవితో తల గోక్కున్నట్లే అవుతుంది.
17) స్వచ్ఛందంగా చేసే పని కాబట్టి సాధారణంగా తీరిక సమయంలోనే నిర్వాహక పనులు చేస్తుంటారు. కొందరు ఉదయం, కొందరు మధ్యాహ్నం, కొందరు సాయంత్రం, కొందరు అర్థరాత్రి సమయంలో తెవికీకి సమయం వెచ్చిస్తుంటారు. కొత్త సభ్యులు సాధారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే దిద్దుబాట్లు చేస్తుంటారు. పొరపాటు చేసేది ఎక్కువగా కొత్త సభ్యులే కనుక ఆ పొరపాట్లను చక్కదిద్దడానికి ఆ సమయంలోనే నిర్వహణ పనులు చేసేవారికి గణాంకాలు అందుతాయి. అర్థరాత్రి సమయంలో తెవికీకి సందర్శించే నిర్వాహకులకు చేయడానికి ఏమీ ఉండకపోవచ్చు. అలాంటివారు నిర్వాహక హోదాలను త్యజించాల్సిందేనా?
18) గణాంకాలను చేరుకోలేని ఒక నిర్వాహకుడిని తొలగించకుండా ఉండేందుకు ఓటింగ్ ద్వారా అవకాశం ఉంది. అంటే నిర్వహణ గణాంకాలు లేకున్ననూ కొనసాగవచ్చన్న మాట (అదీ ఎవరైనా ప్రతిపాదన చేసినప్పుడే, తొలగింపు ప్రతిపాదన చేయనప్పుడు అదీ ఉండదు). మరి ఎవరిని బలి చేయడానికి ఈ నిబంధనలు. ఇదివరకే చెప్పినట్లు రెండేళ్ళవరకు తెవికీలో చురుకుగా లేనివారు ఎలాగూ తొలగింపునకు గురౌతారు. అంతకాలం కూడా ఆగడానికి మనకు ఓపిక లేనట్లయితే ఒక సంవత్సరంగా మార్చుకోవచ్చు. అంతేకాని ఈ గణాంకాల గారడీలెందుకు? గణాంకాలు చూపని నిర్వాహకులు తెవికీకి భారమేమీ కాదు. నిబంధన పెట్టి గణాంకాలు చూపాలన్ననూ అలాంటి నిర్వాహకులు గణాంకాలు చూపెడతారనే నమ్మకమూ ఉండదు. మొత్తానికి ఈ పాలసీ ప్రతిపాదన ఉద్దేశ్యమేమిటి?
గమనిక: చర్చలో ఏ సభ్యుడైనా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించవచ్చు. ఇది ప్రజాస్వామ్య పద్దతి. తెవికీకి కూడా ప్రజాస్వామ్య పద్దతులే పునాది అని గమనించగలరు. పై అభిప్రాయాలను తేలిగ్గా కొట్టిపారేయకుండా బాగా ఆలోచించండి. ఈ అభిప్రాయాలన్నీ తెవికీ సంస్కరణలకేనని భావించండి. వ్యతిరేక అభిప్రాయాలు ఇచ్చానని కాకుండా ఎందుకు ఇచ్చాననే విషయం కూడా ఆలోచించండి. సమర్థన అభిప్రాయాలకన్నా, విమర్శనాభిప్రాయాలే పాలసీల రూపకల్పనకు, భవిష్యత్తులో జరగబోతే విపత్పరిణామాలకు బాగా దోహదపడతాయని గ్రహించండి. కొన్ని అభిప్రాయాలలో నిర్వాహకులను శంకించడం కాదు కాని అలాంటి అవకాశాలూ ఉన్నాయనీ అర్థం చేసుకోండి. తెవికీ ప్రగతే ముఖ్యం కాబట్టి రేపు నిర్వాహకుల మధ్య వాదోపవాదాలు జరగకుండా, నిర్వాహకుల విలువైన సమయం వృధాకాకుండా, నిర్వహణ గణాంకాలపై గందరగోళం తలెత్తకుండా, నిర్వాహకుల మధ్య దిద్దుబాట్ల పోటీలు ఏర్పడకుండా, గణాంకాలను చేరుకోలేని నిర్వాహకులకు బాధ కలుగకుండా ... తదితర కారణాలతో ఈ పాలసీ రూపకల్పనకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:20, 17 ఫిబ్రవరి 2019 (UTC) 

No comments:

Post a Comment