Sunday 18 October 2020

అరుణిమ సిన్హా సంక్షిప్త వ్యాసం - ఒక పరిశీలన

 (జూలై 2018 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

తెవికీ అనగానే సామాన్య పాఠకుల దృష్టిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కాపీపేస్టుల రూపంలో అతికించినదేననే భావన విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. అసలు ఉన్న సమాచారాన్నే మనం ఇక్కడ చేర్చాలనేది నిజమే, లేని సమాచారాన్ని మనం చేర్చడానికి అవకాశమే లేదు. అయినా తెవికీ వ్యాసాలనేవి "కాపీపేస్టు"ల రూపంలో కాకుండా లభ్యమయ్యే సమాచారాన్ని విశ్లేషించి క్రమరూపంలో వాక్యాలను చేరుస్తూ ఆధారాలు జతచేస్తూ ఉంటే బాగుంటుంది. సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం ఈ విధంగానే వ్యాసాలు చూడముచ్చటగా (చదవముచ్చటగా) తయారయ్యేవి. అప్పుడు తెవికీకి పాఠకులు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అప్పట్లో సమాచారాన్ని చేర్చే సభ్యులు కూడా కేవలం పాఠకుల దృష్టితో ఆలోచించి చదవముచ్చటైన వ్యాసాలు తయారుచేసేవారు. సభ్యులలో ప్రతిఒక్కరికీ అన్ని విషయాలలో విషయపరిజ్ఞానం ఉండకపోవచ్చు కాబట్టి ఒకరు రచించిన వ్యాసాలను విషయపరిజ్ఞానమున్న సభ్యులు మార్పులుచేర్పులు చేసి తెవికీ ప్రమాణాలకనుగుణంగా తయారుచేసేవారు. క్రమక్రమంగా సభ్యులలో మార్పువచ్చి (ముఖ్యంగా కొత్త సభ్యులు) తాము రచించిన వ్యాసాలలో ఇతర సభ్యుల మార్పులను సహించని స్థాయికి రావడం, పొరపాట్లు లేవదీసిన సభ్యులను పట్టించకపోవడం, సూచనలు చేసే సభ్యులను ఖాతరుచేయకపోవడం, తామురాసిందే వేదంగా భావించి నిర్వాహకులు సూచించే నిబంధనలే కాకుండా తెవికీ మూలనిబంధనలకే ఉల్లంఘనలు జరపడం, చివరికి తెవికీ నాణ్యత దారుణంగా పడిపోవడం, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చే సభ్యులు తెవికీకి దూరంకావడం జరిగింది. మొదటిపేజీలో ప్రదర్శనకు ఉంచిన వ్యాసాలు, మీకుతెలుసా? విషయాలలోనే పలు తప్పులున్నట్లు అప్పుడప్పుడు చూసిననూ చేయలేని మరియు చెప్పలేని పరిస్థితి రావడం బాధాకరం. నేను ఇప్పుడే చూసిన మొదటిపేజీ ప్రదర్శనలోని అరుణిమసిన్హా సంక్షిప్త వ్యాసం చదివిన తర్వాత అందులోని 12 వాక్యాలలో 6 పొరపాట్లు ఉండటం బాధకలిగించింది.
1) సంక్షిప్త వ్యాసం 3వ వాక్యంలో "మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగా కీర్తి పతాకాన్ని ఎగురవేశారు" అని ఉంది (వ్యాసంలో ఈ వాక్యానికి ఆధారం కూడా జతచేశారు - నేను ఇప్పుడే సరిచేశాను). కాని ఈమె ఎవరెస్టును అధిరోహించిన మొదటి భారతీయ వ్యక్తి కాదు (ఈ ఘనత బచేంద్రీపాల్‌కు దక్కింది). అంతేకాకుండా వ్యాసం 1వ వాక్యానికి, 3వ వాక్యం భిన్నంగా ఉంది.
2) "ఇరవై ఐదు సంవత్సరాల సిన్హా ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు చేరుకున్నారు" అని బదులు 25 సం.ల వయసులో అని రావాలి. (ఎందుకంటే వ్యాసంలోని ఇన్ఫోబాక్సులో ఈమె వయసు ఇప్పటికే 30 అని సూచిస్తోంది). ఆ వాక్యం ఐదేళ్ల క్రితం పత్రికలో వచ్చింది కాని తెవికీలో ఇప్పటికీ అలానే ఉండటం (ఉంచేయడం) బాగుండదు.
3) "గత ఏడాదిలో ఉత్తరకాశీలోని టాటా స్టీల్‌ అడ్వంచెర్‌ ఫౌండేషన్‌ (టీఎస్‌ఏఎఫ్ ) లో అరుణిమా సిన్హా చేరారు" అని ఉంది. గతఏడాది అంటే? సాధారణంగా పత్రికలు, మేగజైన్లు ఇలా వ్రాస్తాయి కాని శాశ్వత ప్రాతిపదికన ఉండే తెవికీలో ఈ విధానం బాగుండదు. ఖచ్చితంగా సం. సూచించాలి.
4) "నా కలలు ఇక ఎప్పుడూ నెరవేరవు అని ఆమె గురువారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు" వాక్యంలో గురువారం అంటే ఏ గురువారం? అసలు ఇలాంటి వాక్యాలు తెవికీలో చేర్చకపోవడం ఉత్తమం.
5) మొదటినుంచి రెండో వాక్యంలో కుడికాలు పోగొట్టుకున్నట్లు, చివరి నుంచి రెండో వాక్యంలో ఎడమకాలు దెబ్బతిన్నట్లుగా ఉంది. అసలు ఏ కాలు పోయిందో పాఠకులకు తికమక కలిగించేదిగా ఉంది.
6) "ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటున్నారు" వాక్యం మరీ బాధాకరంగా ఉంది. నాలుగేళ్ల క్రితమే ఆమె కోలుకొని పర్వతాలు అధిరోహించి చరిత్ర సృష్టించింది. కాని మనం ఆమెను ఇంకా ఆసుపత్రిలోనే ఉంచేశాం!!
ప్రధాన వ్యాసాన్ని పరిశీలిస్తే మరో 3 పొరపాట్లు కూడా ఉన్నట్లు గమనించాను (కొన్నింటిని నేనిప్పుడే సవరించాను). చిన్న వ్యాసంలోనే ఇన్ని పొరపాట్లు ఉన్నాయంటే పెద్ద వ్యాసాలలో ఎన్ని పొరపాట్లు ఉండాలి ? గతంలో ఒక దేశానికి చెందిన అనువాద వ్యాసంలో వంద తప్పులు తీశాను (అక్షరదోషాలు లాంటివి కావు, ఖచ్చితమైన తప్పులే). ఒంటిచేతితో మొదటిపేజీ శీర్షికను నిర్వహిస్తున్న నిర్వాహకుడిని తప్పుపట్టడం నా ఉద్దేశ్యం కాదు కాని తెవికీ వ్యాసాలలో తప్పులు దొర్లకుండా చురుకుగా ఉన్న నిర్వాహకులు కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:34, 21 జూలై 2018 (UTC)

చంద్రకాంతరావు గారూ మీరు ప్రస్తావిస్తున్న తెవికీ స్వర్ణయుగం (మీ వర్ణనను బట్టి అలా పిలవవచ్చునేమో అని సాహసించాను) కాలంలో నేను లేనందుకు కించిత్ బాధగా ఉన్నా, మరో స్వర్ణయుగాన్ని సృష్టించుకోగలమన్న నమ్మకం దృఢతరమవుతూండగా నా ఉత్సాహంలో పడి ఆ బాధ కొట్టుకుపోతోంది. అటువంటి స్వర్ణయుగాన్ని సృష్టించుకోవాలంటే అందుకు తగ్గ సంస్కృతిని నిర్మించాలన్నది నిర్వివాదాంశం. దిద్దుబాట్ల సంఖ్యకు బదులు ఎన్ని వ్యాసాలను మంచి వ్యాసాలుగా అభివృద్ధి చేయగలిగామన్న మెట్రిక్ ఉండడం తొలి మెట్టు అని భావించి, మంచి వ్యాసం ప్రమాణాలు అభివృద్ధి చేస్తున్నాం. ప్రయోగాత్మకంగా మంచుమనిషి వ్యాసాన్ని వ్యాసకర్త చదువరి ప్రతిపాదించగా, నేను సమీక్షక బాధ్యత స్వీకరించి ఈ సమీక్ష చేస్తున్నాను. (రెండవ అభిప్రాయం కోరుతున్నందున ఆసక్తి కల సభ్యులు తమ అభిప్రాయం రాయవచ్చు) ఇది పూర్తైతే, నాణ్యతపై దృష్టి ఉన్నవారందరం ఇంతవరకూ రాసిన వ్యాసాల్లో ఉత్తమమైనవి ఎంచుకుని, తగు మార్పుచేర్పులు చేసి ప్రతిపాదించి కనీసం ఓ పది మంచి వ్యాసాల సమీక్ష పూర్తిచేసుకోవచ్చనీ, తర్వాత సభ్యులందరినీ క్రమేపీ ఈ ప్రయత్నం వైపుకు ప్రోత్సహించడం, వారికి నేర్పించడం చేయాలనీ ఆశిస్తున్నాం. --పవన్ సంతోష్ (చర్చ) 07:03, 22 జూలై 2018 (UTC)
చంద్రకాంత రావు గారు చెప్పినవి మనమందరం దృష్టిలో పెట్టుకోవాలి. నిర్వహకులు అందరూ దీనిని గమనిస్తూ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. సాధ్యమైనంతలో ఇలాంటి విషయాలు సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను. రవిచంద్ర (చర్చ) 13:25, 23 జూలై 2018 (UTC)

 

No comments:

Post a Comment