Sunday 18 October 2020

నిర్వాహకత్వానికి గణాంకాలెందుకు ?

 (ఫిబ్రవరి 2019 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

తెవికీలో చురుకైన నిర్వాహకుల కొరత చాలా కాలం నుంచి ఉన్నదే. దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ పనులు చేయకపోవడం ఒకరకమైతే, ఇతర (స్వంత) పనులవల్ల తెవికీ సెలవులో ఉండటం మరొకటి. నిర్వాహణ పనులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, నిర్వహణకై సభ్యుల నుంచి విమర్శలు, చివాట్లు ఎదుర్కోవడం, నిర్వాహణ చేసిన వారిపైనే తోటి నిర్వాహకులు దాడిచేయడం ముఖ్యమైన మరొక్కరకం. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం తెవికీలో నిర్వాహకులు పలువులు ఉన్ననూ నేను చురుకైన నిర్వహణ నిర్వహించాను. అదే సమయంలో సభ్యుల నుంచి చీవాట్లు కూడా ఎదుర్కొన్నాను. నిర్వహణ ఇబ్బందులు నిర్వహణ చేసేవారికే తెలుస్తుంది. తోటి నిర్వాహకుల నుంచి ఎలాంటి సరైన సహకారం లేకపోవడం, పైగా పొరపాట్లు చేసిన వారికే మద్దతు తెల్పడం తదితర కారణాలతో నా నుంచి నిర్వహణ పనులు తగ్గిపోయాయి. నేను నిర్వహణ మానివేయుటకు కొంతముందు కూడా సరైన ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్ళి ఒక సభ్యుడిని పలుమార్లు హెచ్చిరించి తన ధోరణి ఎంతకూ మార్చుకోనందున ఒకరోజు, ఆ తర్వాత 3 రోజులు, ఆ తర్వాత వారం రోజులు నిరోధం విధించాను. వారం రోజుల నిరోధం రెండుమూడు రోజుల్లో పూర్తి అవుతుందనగా తోటి నిర్వాహకులే ఆ సభ్యునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ నిరోధం తొలగించాలని ప్రతిపాదించడం నా నిర్వహణ పనులకు అడ్డంకిగా మారింది. ఎవరో ఒక తప్పు చేయగానే నేనేమీ చర్యలు తీసుకోలేను. చాలా కాలం నుంచి మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేస్తూ, ఎంత చెప్పిననూ ధోరణి మార్చుకొనక నిర్వాహణకు ఇబ్బందిగా మారినప్పుడు కూడా తోటి నిర్వాహకులు సహకరించకపోవడం ఇంతగా కాకున్నా కొంతైనా మునుపటి నుంచే కొనసాగుతోంది. రచ్చబండలో, నిర్వాహకుల నోటీసుబోర్డులో వివరించినప్పుడు వ్యాఖ్యానించని నిర్వాహకులు నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు భిన్నంగా వ్యాఖ్యానించడం సమంజసం అనిపించలేదు. ఒకానొకప్పుడు నేను ఒంటిచేత్తో నిర్వాహక పనులు కూడా చేసిన సంగతి అప్పటి సభ్యులకు బాగా తెలుసు. కేవలం నిర్వహణ కోసమే ఎంతో కాలం నా సమయం వెచ్చించాను. తెవికీకి ఒకప్పుడు పాఠకులు బ్రహ్మరథం పట్టారంటే నా వంతు కృషి కూడా ఉందని నమ్ముతున్నాను. వ్యాస నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ తెవికీని నాణ్యమైన విజ్ఞానసర్వస్వంగా మార్చడానికి అహరహం కృషిచేశాను. చివరికి తోటి నిర్వాహకులు అడ్డుతగిలి నన్ను నిర్వహణ పనుల నుంచి దూరం చేశారు. అయిననూ నేనేమీ తెవికీకి శాశ్వతంగా దూరం కాలేను. తోటి నిర్వాహకుల ధోరణి నచ్చనందుకు తాత్కాలికంగా మాత్రమే పక్కకు జరిగాను. తెవికీలో మళ్ళీ చురుకుగా ఉండాలనీ, రోజూ నిర్వహణ పనులు చేయాలనీ, తెవికీని చక్కదిద్దాలనీ, తెవికీకి పూర్వవైభవం తీసుకురావాలనీ నా మనసు ఉబలాటపడుతోంది. కాని ఇప్పుడు నిర్వహణ పనులు చేయడం లేదనీ ఏకంగా నిర్వహకత్వానికే ఎసరు తీసుకురావడం వింతగా తోస్తోంది. అసలు దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారికే ఈ నిబంధన వర్తింపజేస్తే బాగుంటుందేమో ! రెండేళ్ళవరకు దిద్దుబాట్లు చేయనివారిని ఎలాగూ స్టీవార్డులు తొలగిస్తారు (వారు కూడా ఏకపక్షంగా తొలగించరు. చర్చద్వారా, మెయిల్ ద్వారా సంప్రదిస్తారు). మరి ఈ కొత్త నిబంధనల ఉద్దేశ్యం ఎందుకో తెలియడం లేదు. తెవికీలో నిర్వాహకుల కొరత అంటూనే నిర్వాహకులను తొలగించడం ఎందుకో అర్థం కావడం లేదు. నిర్వహణ పనులు చేసే వారికి ఇబ్బంది కల్గజేయకుండా ఉంటే నిర్వాహకులు స్వచ్ఛందంగా మరియు సంతోషంగా పనిచేస్తారు. నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చు. కొంతకాలం క్రితమే ఇలాంటి సంఘటన కూడా జరిగింది. విజ్ఞానసర్వస్వం అంటే ఆషామాషీ కాదు. ఇందులో పనిచేయడం అంటే అనుకున్నంత సులభం కాదు. కాని ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చనే నిబంధనతో ఎవరికి వారు తమ ఇష్టమైనట్లు దిద్దుబాట్లు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేముకదా ! ఆ సమయంలో దానికి తగ్గట్టు బలమైన నిర్వహణ తప్పనిసరి. అదే ఇప్పుడు కొరవడింది. ఒకానొకప్పుడు దిద్దుబాట్ల సంఖ్య ఆధారంగా సభ్యులను అభినందించడం, పతకాలు ప్రధానం చేయడం ఉండేది. తెవికీ ప్రగతికి కావలసింది సంఖ్య కాదు నాణ్యత మాత్రమే అనీ, గణాంకాలకు ప్రాధాన్యత ఇస్తే తెవికీ నాణ్యత కుంటుపడుతుందనీ నేను పదేపదే చెప్పి చివరికి ఆ పద్దతిని మాన్పించాను. ఇప్పుడు నిర్వాహక పనులకు కూడా గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. గణాంకాలు పెంచుకోవడానికి నిర్వాహకుల మధ్య పోటీ ఏర్పడి చివరికి అసలైన నిర్వహణ కుంటుపడుతుంది లేదా సభ్యుల మధ్యన పోటీతో పాటు ఘర్షణ వాతావరణం ఏర్పడి నిర్వాహకుల మధ్య మనస్పర్థలు తలెత్తి చివరికి తెవికీకే నష్టం కలగవచ్చు. గతంలో దిద్దుబాట్లు పెంచుకోవడానికి సభ్యులు ఎలా పోటీపడ్డారో నాకు బాగా తెలుసు. చివరికి ఈ దిద్దుబాట్ల మోజులో పడి సభ్యులు హీనమైన దిద్దుబాట్లు చేసి వ్యాస నాణ్యతను తీవ్రంగా దిగజార్చారు. నిర్వహణ పనులకు కూడా గణాంకాలు వర్తింపజేస్తే నిర్వాహకులు నిర్వాహక పనులు చేయడం కంటే తమ గణాంకాలు చూసుకోవడానికే సమయం సరిపోతుందేమో! ఇప్పుడు చురుకైన నిర్వాహకులే కొద్దిమంది. వారిలో నిర్వహణ పనులు చేసేవారిని లెక్కించడానికి అరచేయి కూడా అవసరం లేదు. ఉన్న నిర్వాహకులను కాపాడుకోవాలి, వారి నిర్వాహక పనులకు సహకారం అందించాలి, అంతేకాని గణాంకాల ప్రకారం మీరు చురుకుగా లేరు కాబట్టి మీ నిర్వాహకత్వం పోతుందంటే ఇన్నేళ్ళు తెవికీకై అహరహం కృషిచేసిన వారిని అవమానపర్చడమే అవుతుంది. అంతేకాదు ఇప్పుడు చురుకైన నిర్వాహకులలో కూడా అభద్రతాభావం ఏర్పడుతుంది. అసలీ ఆలోచన ఎందుకు ? ఏవో కొన్ని వికీలలో ఉన్నంత మాత్రానా అలాంటి నిబంధన మనకెందుకు ? ఈ నిబంధనకు ప్రాతిపాదిక ఏమిటి? తెవికీని చక్కదిద్దడానికి ఉన్న అవకాశాలు వదిలి ఈ నిబంధనపై సభ్యుల దృష్టి మళ్ళించడమెందుకు? పోనీ ఈ నిబంధనే చేశామనుకుందాం, అప్పుడు తెవికీ నిర్వహణ బాగుపడుతుందనే నమ్మకం ఉందా ? నిర్వహణ బాగుపడాలంటే నిర్వహణకు సంబంధించిన నిబంధనలు మెరుగుపర్చాలి. తెవికీని ప్రగతిపథంలో నడిపించడానికి ఇతర వికీలలో మెరుగైన నిబంధనలు గమనించి అలాంటి పద్దతులు పాటించడానికి ప్రయత్నిస్తే నైనా తెవికీ బాగుపడవచ్చు. నిర్వాహకుడిగా కొనసాగాలంటే ఆ గణాంకాలను ఒక్క రోజులో సాధించవచ్చేమో కాని అది పిల్లచేష్టలా ఉంటుంది. అలాంటి అవసరం ఉండరాదు. నిర్వాహకత్వం అనేది హుందాగా కొనసాగాలి. అది స్వచ్ఛందంగా చేయాల్సిన ఒక విధినే కాని బాధ్యతగా మారరాదు. నిర్వాహకత్వం అనేది ఉత్సాహంగా చేసేటట్లుగా ఉండాలి కాని గణాంకాలను చేరుకోవడానికి ఆయాసపడేటట్లుగా కారాదు. నిర్వాహకత్వం అనేది శాశ్వతం కాదు, కాని ఏదో కొంతకాలం చురుకుగా ఉండనంత మాత్రాన (గణాంకాలు చూపనంతమాత్రాన) దూరం చేయడం భావ్యమూకాదు. ఇప్పుడు చురుకుగా ఉన్న సభ్యులు ఏవైనా నిబంధనలు రూపొందించుకోవచ్చు. పాలసీలు తయారుచేయడం కష్టమేమీ కాదు. కాని ఆ నిబంధనలు ఒకప్పుడు తెవికీ ప్రగతికి తోడ్పడినవారికి బాధ కలిగించకుండా ఉంటేచాలు. నిర్వాహకుల సంఖ్యకు పరిమితి ఉండి, ఆ పరిమితి వల్ల కొత్తగా నిర్వాహకులను తీసుకోవడం ఇబ్బందిగా ఉండి, ఇప్పుడున్న నిర్వాహకులు తెవికీకీ భారం అయితే చురుకుగా లేని నిర్వాహకులను తప్పకుండా తొలగించవచ్చు. కాని ఇప్పుడు తెవికీలో ఈ సమస్య ఏ మాత్రంలేదు. కాదుకాదు, ఇవేమీ కాదు, గణాంకాలే ముఖ్యం, నిర్వహణకు గణాంకాలే ప్రాతిపదిక, వ్యక్తిగతంగా ఎన్ని పనులున్నా సరే తెవికీలో నిర్వహణ గణాంకాలు చూపాల్సిందే అంటే మాత్రం మొదటగా నన్నే తొలగించండి. ఎందుకంటే నేను గణాంకాలను పూర్తి వ్యతిరేకిని. ఒకవేళ గణాంకాలకే మొగ్గుచూపుతూ నిబంధన చేస్తే నిర్వాహకత్వానికి రాజీనామా చేసేవారిలో నేనే ముందుంటాను. నిర్వాహణ అనేది సాధారణంగా సభ్యులు పొరపాట్లు చేసినప్పుడే తలెత్తుతుంది. సభ్యులు పొరపాట్లు చేయనప్పుడు నిర్వాహకులు తమ నిర్వాహణ గణాంకాలకై తామే కొత్త సభ్యుల లేదా అనామకుల (ఐపి అడ్రస్) అవతారమెత్తి పొరపాట్లు సృష్టించే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. అలాచేసే అవకాశాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేము. తెవికీ అనేది ఇంకనూ చిన్న వికీనే. రోజూవారీ దిద్దుబాట్ల సంఖ్య చూసిననూ పరిమితమే. అందులో నిర్వహణ గణాంకాలకు సరిపడా పొరపాట్లు ఉండాయనుకోవడం అనుమాస్పదమే. నిర్వహణ దిద్దుబాట్ల సంఖ్యకై నిర్వాహకులు అతిగా ప్రవర్తిస్తే చివరికి కొత్త సభ్యుల పాలిట శాపంగామారి తెవికీ ప్రగతి మరింత కుంటుపడవచ్చు. నిర్వాహకులు కేవలం గణాంకాలపైనే దృష్టిపెడితే తెవికీ శుద్ధి, వ్యాసనాణ్యత తదితర గణాంకేతర నిర్వహణ పనులు కుంటుపడటం ఖాయం. అసలే చురుకైన నిర్వహకుల కొరత ఉన్న తరుణంలో కొత్తగా నిర్వాహకుల గణాంకాలు చూడటానికి ఒకరిద్దరిని కేటాయిస్తే అది వృధాప్రయాసగానే మారేపరిస్థితి తలెత్తవచ్చు. మొదటిపేజీ నిర్వహణ అనేది చాలా ముఖ్యమైన కార్యము. దీన్ని నిర్వహణ గణాంకాలలో చేర్చినప్పుడు పలువులు నిర్వాహకుల మధ్య ఈ శీర్షిక నిర్వహణకు పోటీ పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. దేనికైనా సరే పోటీ ముఖ్యమే కాని అది స్నేహపూర్వకంగా ఉండాలి కాని ఘర్షణ లేదా ఉద్రిక్తతగా ఉండరాదు. మొత్తంగా చూస్తే ఈ నిబంధనలు సభ్యులు పొరపాట్లు చేయాలని ప్రోత్సహించేటట్లుగా ఉన్నాయి. సభ్యులు చేసే పొరపాట్లకై నిర్వాహకులు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి తెచ్చుకోవడం శోచనీయమైన విషయం. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:18, 9 ఫిబ్రవరి 2019 (UTC) 

No comments:

Post a Comment