Wednesday 30 October 2013

సెప్టెంబరు 2013 గణాంకాల విశ్లేషణ

తెలుగు వికీపీడియాకు సంబంధించి సెప్టెంబరు 2013 గణాంకాలు విడుదలైనాయి. ఈ గణాంకాల ప్రకారం పరిశీలీస్తే తెవికీ గణాంకాలు మెరుగుపడినట్లు తెలుస్తోంది. కారణం ఏమైనా సరే ముఖ్యంగా దిద్దుబాట్లు మాత్రం ఈ మాసంలో బాగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టపరుస్తున్నాయి.

  • సభ్యుల సంఖ్య 7 పెరిగి మొత్తం సభ్యుల సంఖ్య 599కి పెరిగింది (5+ దిద్దుబాట్లు చేసినవారు).
  • ఈ మాసంలో 5కు పైగా దిద్దుబాట్లు చేసిన వారి సంఖ్య 48గా నమోదైనది. ఇది తెవికీ గణాంక చరిత్రలోనే రెండో అత్యధికం. ఫిబ్రవరి 2008లో ("ఈనాడు" వల్ల) నమోదైన 102 సంఖ్య తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది.
  • 9/2013 మాసంలో 100కు పైగా దిదుబాట్లు చేసినవారి సంఖ్య 12 ఉంది. 16 మరియు 13 తర్వాత ఈ సంఖ్య కూడా మూడో అత్యధికంగా చెప్పవచ్చు.
  • ఈ మాసంలో రోజుకు సరాసరిన 18 కొత్త వ్యాసాలు తెవికీలో సృష్టించబడ్డాయి. 11/2011 తర్వాత మళ్ళీ ఈ సంఖ్య రావడం జరిగింది.
  • సెప్టెంబరు 2013 మాసంలో 12వేల దిద్దుబాట్లు జరిగాయి. గత మాసంతో పోలిస్తే ఇది 55% వృద్ధిరేటు నమోదైంది.
  • ఈ మాసంలో 100+ దిద్దుబాట్లు చేసిన వారు 12, 250+ దిద్దుబాట్లు చేసినవారు 7 సభ్యులుండగా, 1000+ దిద్దుబాట్లు చేసినవారు ముగ్గురున్నారు. ఇంతవరకు తెవికీలో నమోదవ్వని ఒకే సభ్యునిచే 2500+ దిద్దుబాట్లు ఈ మాసంలో కనిపించింది. (ఇవి వ్యాసంలోని దిద్దుబాట్లు మాత్రమే).


250+ దిదుబాట్లు చేసినవారు
(వ్యాసంపేజీలలో)
YVSREDDY 2647
Kvr.lohith2216
Bhaskaranaidu1448
Rajasekhar19611179
శ్రీరామమూర్తి 722
C.Chandra Kanth Rao291
Pranayraj1985251
ఇతరులు    3246



ఏ సభ్యుడు ఏమి చేశాడు? (వ్యాసంపేజీలలో 100+ దిద్దుబాటు చేసినవారు)
  • YVSREDDY= పైపింగ్ పనులు, మండల వ్యాసాలలో మూసలు, మూసలలో అక్షరక్రమం,
  • Kvr.lohith= కొత్త సభ్యులకు ఆహ్వానం, కొత్త వ్యాసాల సృష్టి మరియు విస్తరణ, వ్యాసాలకు వర్గాలు చేర్చుట, బొమ్మల అప్లోడ్, దారిమార్పులు,
  • Bhaskaranaidu= బ్లాగులింకులు, బ్లాగుల నుంచి సమాచారం కాపీ, సంఖ్యానుగుణ వ్యాసాల సృష్టి (కాపి), బొమ్మల అప్లోడ్,
  • Rajasekhar1961= కొత్త వ్యాసాల సృష్టి మరియు విస్తరణ, సభ్యపేజీలలో వర్గాల చేర్పు, ప్రాజెక్టు పనులు,
  • శ్రీరామమూర్తి= గ్రామవ్యాసాలలో గణాంకాలు చేర్చుట
  • C.Chandra Kanth Rao= బ్లాగులింకుల తొలగింపు, వర్గాల మార్పులు,
  • Pranayraj1985= సినిమా పేజీల విస్తరణ, దారిమార్పులు,
  • సుల్తాన్ ఖాదర్= జీవశాస్త్ర పేజీల విస్తరణ, కొత్త సభ్యులకు స్వాగతం,
  • అహ్మద్ నిసార్= ఇస్లాం వ్యాసాలు, ప్రయోగశాల వినియోగం,
  • Nrahamthulla= కొత్త వ్యాసాల సృష్టి, వ్యాసాల పొడగింపు,
  • విశ్వనాధ్.బి.కె.= వ్యాసాల పొడగింపు, 5 కొత్త వ్యాసాల సృష్టి,
  • Palagiri= నూనె సంబంధిత వ్యాసాల వృద్ధి, కొత్త సభ్యులకు ఆహ్వానం, అనవసర లింకుల తొలగింపు,
  • T.sujatha= ఆస్టిన్, శ్రీలంక, మనీల వ్యాసాల పొడగింపు,
  • Veera.sj= వర్గాల చేర్పులు, ప్రయోగశాల వినియోగం, ఫోటోగ్రఫి వ్యాసాలు,
గమనిక: గణాంకాలకు తెవికీ నాణ్యతకు ఎలాంటి సంబంధం ఉండదు. దిద్దుబాట్లు అధికసంఖ్యలో చేసిననూ వారు ఎలాంటి దిద్దుబాట్లు చేశారనేది ముఖ్యము. దిద్దుబాట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా నాణ్యమైన వ్యాసాన్ని రచించిన వారికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి సభ్యులు గణాంకాలపై కాకుండా తెవికీ నాణ్యతను దృష్టిలో ఉంచుకొని కృషిచేయడం మంచిది.


Tuesday 29 October 2013

సభ్యపేజీలలో ఏమి వ్రాసుకోవచ్చు?

వికీపీడియాలో సభ్యత్వం పొందిన వారందరికీ ఒక సభ్యపేజీ కేటాయించబడుతుంది. సభ్యపేజీకి అనుబంధంగా చర్చాపేజీ కూడా ఉంటుంది. తోటి సభ్యులు మనల్ని సంప్రదించడానికి లేదా మనకు ఏదేని విషయం చెప్పడానికి చర్చాపేజీ ఉపయోగపడితే సభ్యపేజీలో మన యొక్క సంక్షిప్త పరిచయం తోటి సభ్యులకు తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. మన అసలుపేరు (సభ్యనామం అసలునామం ఉండనప్పుడు), మన ప్రాంతం, మన విద్యాభ్యాసం, మన హోదా తదితర వ్యక్తిగత విసయాలే కాకుండా తెవికీకి సంబంధించి మనం చేసిన, చేస్తున్న, చేయబోయే పనుల గురించి కూడా వ్రాసుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

సభ్యపేజీలో ఏమి వ్రాసుకోవచ్చు:
  • మీ వ్యక్తిగత వివరాలు అనగా అసలునామం ఏమిటి, మీరు ఎక్కడివారు, మీ విద్యాస్థాయి, మీ ఈ-మెయిల్, మీరు చేస్తున్న వృత్తి, మీ అభిరుచులు-ఆసక్తులు లాంటివి వ్రాసుకోవచ్చు.
  • మీ ఫోటో లేదా మీ అభిమాని ఫోటో పెట్టుకోవచ్చు కాని ఇవి లైసెన్సుకు అనుగుణంగా ఉండాలి.
  • కొతకాలం సెలవులో వెళ్లదలిస్తే ఆ విషయం సభ్యపేజీలో వ్రాసుకోవచ్చు.
  • మీరు తరుచుగావాడే లింకులు,మూసలు తదితరాలు కూడా సభ్యపేజీలో ఉంచుకోవచ్చు.
  • తోటి సభ్యులు బహుకరించిన పతకాలు, వ్యాఖ్యలు ఉంచుకోవచ్చు.
  • మీరు పనిచేసే ప్రాజెక్టు మూసలు ఉంచుకోవచ్చు.
  • సభ్యపేజీకి అనుబంధంగా ఉపపేజీలు ప్రారంభించి మీ ప్రయోగాలు చేసుకోవచ్చు.

సభ్యపేజీ - పరిమితులు:
  • సభ్యపేజీలో ప్రకటనలు ఉంచుకోరాదు.
  • వికీపీడియాకు సంబంధం లేని ఇతర విషయాలు వ్రాయరాదు.
  • తోటి సభ్యులకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు వ్రాయరాదు.
  • మితిమీరిన వ్యక్తిగత సమాచారం చేర్చరాదు.
  • వ్యక్తిగత బ్లాగుల లింకులు ఉంచరాదు, (ఈ మధ్య చాలా సభ్యులు బ్లాగులింకులు ఇస్తున్నారు. అయితే తెవికీకి సంబంధించిన లేదా తెవికీ వలె విజ్ఞానానికి సంబంధించిన బ్లాగులైతే ఫర్వాలేదు కాని ఇతర బ్లాగులైతే ఆలోచించండి).

సభ్యపేజీలలో ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చా?
సాధ్యమైనంత వరకు ఇతరుల సభ్యపేజీలలో దిద్దుబాట్లు చేయకపోవడం ఉత్తమం. ఆ సభ్యపేజీ గురించి చెప్పాలంటే చర్చాపేజీలో వ్రాయండి. పతకాలు అందించాలన్ననూ ఆ సభ్యుడి చర్చాపేజీలోనే చేర్చండి.

సభ్యపేజీలు తొలగించవచ్చా?
సభ్యుడు కోరితే తప్ప సభ్యపేజీలు తొలగించరాదు. ఒకసభ్యుడు ఇక ముందు తెవికీలో రచనలు చేయక విరమణ ప్రకటించి మునుముందు దుశ్చర్యకు గురౌతుందని భావించి స్వచ్ఛందంగా సభ్యపేజీని తొలగించమని కోరితే ఎవరైనా నిర్వాహకులు తొలగిస్తారు.

సభ్యపేజీకి తాళం:
తరుచుగా దుశ్చర్యలకు గురయ్యే సభ్యపేజీకి సంరక్షణ విధించుకొనే అవకాశం ఉంది. నిర్వాహకులు కానివారైతే ఎవరైనా నిర్వాహకులను సంప్రదించి తమ సభ్యపేజి రక్షణ కొరకు సంరక్షణ కల్పించమని కోరవచ్చు. ఇలాంటి సందర్భాలలో తాము స్వయంగా కూడా సభ్యపేజీలో మార్పులు చేయడం కుదరదు. కాబట్టి సభ్యపేజీలకు పరిమిత కాలపు సంరక్షణ కల్పించడం/కల్పించుకోవడం ఉత్తమం.



కొందరి సభ్యపేజీలు
వైజాసత్య
సి.చంద్రకాంతరావు

కాసుబాబు
అహ్మద్ నిసార్

రాజశేఖర్అర్జున్ రావు
పాలగిరి
వెంకటరమణ

Friday 25 October 2013

తెలుగు వికీపీడియాలో ఏమి వ్రాయవచ్చు?

కొత్తవారు తెలుగు వికీపీడియాలో ప్రవేశించిన పిదప ఏమి వ్రాయాలి అనే విషయంలో సందేహపడుతుంటారు. ఏ విషయంపై వ్రాయాలి, అందులో ఎలాంటి సమాచారం ఉంచాలి అని తర్జనభర్జన పడుతుంటారు. అయితే తెవికీలో ఏమి వ్రాయాలనే విషయంలో ఎలాంటి నిర్భందాలు లేవు. మీరు ఏ విషయంపై నైనా వ్రాయవచ్చు, ఎలాంటి సమాచారంనైనా చేర్చవచ్చు అయితే దీనికి కొద్దిగా నియమాలు మాత్రం పాటించాల్సి ఉంటుంది. మరి ఆ నియమాలేమిటి, సమాచారం చేర్చడానికి పరిమితులేమిటి తెలుసుకుందాం.

గుండుసూది నుంచి టైటానిక్ వరకు, నీటిబొట్టు నుంచి మహాసముద్రం వరకు, నింగి నుంచి నేల వరకు ఉన్న ఏ సమాచారమైనా, ఏ వ్యక్తి గురించి నైనా, ఏ పదార్థం గురించి నైనా ఇలా మీకు తోచిన, కంటికి కనిపించిన, కనిపించని వస్తువుల గురించి కూడా నిర్భయంగా వ్రాయవచ్చు. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, జీవ, జంతు, భౌతిల, రసాయన శాస్త్రాల గురించి, క్రీడలు, వర్తమాన అంశాలు గురించే కాకుండా మీరు భుజించే ఆహరపదార్థాలు, కూరగాయల గురించి, మీరు రోజూ ఉపయోగించే వస్తువుల గురించి, మీ గ్రామం గురించి, మీకు తెలిసిన ప్రదేశాల గురించి... ఇలా ఏ అంశంపైనైనా, ఏ రంగంపై నైనా, ఏ వ్యక్తిపై నైనా వ్యాసాలు వ్రాయవచ్చు, ఉన్న వ్యాసాలను పొడగించవచ్చు.

పరిమితులు:
తెవికీలో సమాచారాన్నిచేర్చేటప్పుడు వ్రాయడానికి ఎంతస్వేచ్ఛ ఉన్ననూ దానికీ కొన్నిపరిమితులున్నాయి. ఈ పరిమితులను దృష్టిలో ఉంచుకొని సమాచారం చేరిస్తే మీరు చేర్చిన సమాచారం పదిలంగా ఉండటమే కాకుండా ఎందరో పాఠకులకు అది ప్రయోజనకారిగా నిలుస్తుంది.
  • వ్యాసాన్ని రచించేటప్పుడు ముఖ్యంగా గుర్తించుకోవాల్సినది సమాచారం ఎక్కడి నుంచి కాపీ చేయరాదనేది. వ్యాసంలో అక్కడక్కడా బయటి నుంచి తీసుకున్న వాక్యాలను చేర్చవచ్చు (దీనికి మూలాలు ఇవ్వాలి) కాని మక్కికిమక్కిగా ఎక్కడో లభ్యమైన సమాచారాన్ని తెవికీలో చేర్చరాదు. అలాచేరిస్తే ఎవరైనా నిర్వాహకులు కాపిహక్కులు ఉల్లంఘించినట్లు గమనించిన వెంటనే సమాచారం తొలిగిస్తారు కాబట్టి బయటి సమాచారాన్ని యధాతథంగా చేర్చకండి.
  • వ్యాసంలో స్వంత అభిప్రాయాలు ఉండనట్లు చూసుకోండి. తెవికీలో రచించే ఏ వ్యాసమైననూ, వ్యాస సమాచారమైననూ మన అభిప్రాయాలుగా ఉండరాదు. కాబట్టి మనకు తోచిన విధంగా,మన అభిప్రాయాలు జోడిస్తూ రచించడం జరుగరాదు.
  • తెవికీలో వ్యాసం తెలుగులోనే వ్రాయాలి. తెలుగు కాకుండా ఇతరభాషలలో రచించిన సమాచారాన్ని తొలగించడం జరుగుతుంది. అలాగే ఇతర భాషావికీలలో ఉన్న సమాచారం కూడా కాపీపేస్ట్ చేయకండి, వీలయితే దాన్ని అనువాదం చేసి చేర్చండి.
  • ఏ వ్యక్తిపైనైనా వ్యాసం ఉండవచ్చని భావించి మీ వ్యక్తిగత సమాచారంతో వ్యాసం సృష్టించకండి. స్వయంగా తమగురించి చేర్చబడిన సమాచారం వెంటనే తొలగించబడుతుంది. మీ గురించి సంక్షిప్తంగా మీ సభ్యపేజీలో (అక్కౌంటు సృష్టించుకుంటేనే) వ్రాసుకోవచ్చు.
  • మీరు వ్రాసే వ్యాసాలలో ప్రధాన వాక్యాలకు మూలాలను పేర్కొనండి. మూలాలు లేని వ్యాసాలు తొలగింపునకు గురికావచ్చు.
  • మీరు సృష్టించే వ్యాసం అతిచిన్నగా ఉన్ననూ తొలిగించబడుతుంది. దాన్ని కనీసం 2 కిలోబైట్ల పరిమాణం వరకు పెంచడానికి వీలవుతుందేమో చూడండి. అలా వీలుకాకుంటే ప్రత్యేక వ్యాసంగా కాకుండా ఏదో సంబంధిత సమాచారం ఉన్న వ్యాసంలో ఒక విభాగంగా చేర్చడానికి ప్రయత్నించండి.