Sunday 18 October 2020

తెవికీ గ్రామవ్యాసాలు - ఒక పరిశీలన

 (ఏప్రిల్ 2019 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

తెవికీలో గ్రామవ్యాసాలనేవి మొత్తం వ్యాసాలలో సుమారు 30% వరకు ఉంటాయి. పదేళ్ళ క్రితం నేను తెవికీలో ప్రవేశించే నాటికి గ్రామవ్యాసాలన్నీ ఏక వాక్య వ్యాసాలే. వాటిని కూడా బాటుద్వారా చేర్చారు. గ్రామవ్యాసాలకు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా నేను వాటిని అభివృద్ధిపర్చాలని ముందుగా మండలాల మూసలు తయారుచేసి వ్యాసాలలో పెట్టే పనిని ప్రారంభించాను. తర్వాత బాటుద్వారా అన్ని గ్రామవ్యాసాలలో చేర్చబడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలోని చాలా గ్రామవ్యాసాలను కొంతవరకు అభివృద్ధి చేశాను. కొంతకాలానికి మరికొందరు సభ్యులు తెవికీలో ప్రవేశించారు. అసలుకథ అప్పుడే మొదలైంది. గ్రామవ్యాసాలలో ఇన్ఫోబాక్సులు, జనగణన తదితర చేర్చాలని నిర్ణయం తీసుకున్నాకా వైజాసత్యగారు బాటుద్వారా వాటిని చేర్చగలనని చెప్పిన పిదప కూడా కొందరు సభ్యులు ఎంత వారించిననూ వినకుండా ఏకపక్షంగా ప్రతిపేజీలో ఖాళీ విభాగాలు చేర్చడం, అసంపూర్తి ఇన్ఫోబాక్సులు చేర్చడం లాంటివి మానవీయ్ంగా పెట్టారు. వారి అత్యుత్సాహం వల్ల ఆ సమయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. అది మొదలు, ఆ తర్వాత గ్రామవ్యాసాలపై దిద్దుబాట్ల దాడి మొదలై అప్రతిహితంగా కొనసాగుతూనే వస్తోంది. అప్పుడు నాణ్యత గురించి చెప్పిన సూచనలు ఎవరూ పట్టించుకోలేరు. సంవత్సరాల తరబడి గ్రామవ్యాసాలపై దిద్దుబాట్ల దాడి జరిగి గ్రామవ్యాసాలనేవి కేవలం వ్యాస పరిమాణం పెరగడానికీ మరియు సభ్యుల దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవడానికే తప్ప ఎలాంటి ఉపయోగం లేనట్లుగా తయారయ్యాయి. వ్యాసాలనేవి పరిమాణంలో కాకుండా నాణ్యతలో మెరుగుపడాలని చేసిన సూచనలన్నీ వృధాప్రయత్నాలుగానే మిలిగిపోయాయి. గ్రామవ్యాసాలలో కొందరు సభ్యులు ఇచ్చిన లింకులు కూడా అనవసర లింకులే. గ్రామవ్యాసాలను నాణ్యమైనవిగా తయారుచేయడానికి నేను స్వయంగా జిల్లాస్థాయి అధికారుల నుంచి సమాచారం తీసుకొని, ప్రతిగ్రామవ్యాసంలో గ్రామస్థానపు చిత్రాన్ని తయారుచేసి కొన్ని మండలాలలో చేర్చినపిదప కూడా గ్రామవ్యాసాలపై అనవసర దిద్దుబాట్ల దాడులవల్ల ప్రక్కకు జరగాల్సి వచ్చింది. ఒకానొకదశలో అర్జునరావుగారు కూడా గ్రామవ్యాసాలను తొలగించాలని చేసిన ప్రతిపాదనను ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక పేజీ ఉండటానికి అభ్యంతరపర్చిన సమయంలో నేను తీవ్రంగా వ్యతిరేకించాను కాని చివరకు గ్రామవ్యాసాలు చూడలేకపోయే ఈ స్థితికి వస్తాయని మాత్రం ఊహించలేకపోయాను. ప్రస్తుత స్థితిలో గ్రామవ్యాసాలు కేవలం పరిమాణంలోనే పెద్దవిగా ఉన్నట్లుగా, పట్టికలలోని సమాచారమే వ్యాసాలలో చేర్చబడినట్లుగా, నాణ్యత లేనట్లుగా అర్జునగారు వెలిబుచ్చిన అభిప్రాయాలకు నేను పూర్తిగా మద్దతు తెల్పుతున్నాను. గ్రామవ్యాసాల లోపాలపై సభ్యుడు:పవన్ సంతోష్ చేసిన సవాలు ఆధారంగా ఆయనే ఇచ్చిన మేడపల్లి (నల్లబెల్లి) వ్యాసాన్నే (23-04-2019 నాటి స్థితి) పరిగణలోకి తీసుకుని సమీక్ష జరిపాను. దాదాపు అన్ని గ్రామ వ్యాసాలు ఇదేరకమైన లేదా ఇంతకంటే అధ్వానస్థితిలో ఉన్నాయన్న సంగతి కూడా గ్రామవ్యాసాలు పరిశీలించినవారికి తెలుస్తుంది. (కొందరికీ ఇలాంటి వ్యాసాలే నచ్చుతుంటే అది వారి అభిప్రాయం) కేవలం ఏదో ఒకటి రెండు వ్యాసాలని కాకుండా వేలాది వ్యాసాలలో అప్రయోజకరమైన మరియు అసమగ్రమైన సమాచారం ఉండుట అనేది ఏ మాత్రం మెచ్చుకోదగిన లేదా సమర్థించుకోగల్గిన పరిస్థితి కాదు.

పట్టికలలో ఉన్న సమాచారమే వాక్యాలుగా పేరాలలో చేర్చబడింది కాని ఈ సమాచారం విజ్ఞానసర్వస్వానికి యోగ్యమైన సమాచారం కాదు. సాధారణంగా ప్రభుత్వం తరఫున ముద్రించే లేదా విడుదల చేసే పట్టికల సమాచారం ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినదై ఉంటుంది. అలాంటి ఏదో ఒక కాలానికి మాత్రమే వర్తించే సమాచారం ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వానికి తగునా అని పరిశీలించడం అత్యావశక్యం. ప్రస్తుత కాలంలో రోజురోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. మారిన పరిస్థితులకనుగుణంగా సమాచారం కూడా మార్చాల్సి ఉంటుంది కాని ఎప్పటిదో పాతబడిన సమాచారం, అదీ అసమగ్రమైన అంటే ఖచ్చితమైన సమాచారం ఇవ్వని వాక్యాలు చేర్చడం ఎంతవరకు అవసరం, ఎంతవరకు సమంజసం అనేది నిర్ణయించుకోవాలి. తెలంగాణ అవరతణ అనంతరం జాతీయ రహదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు తెవికీ గ్రామవ్యాసాలలో 10 కిమీ పైబడి దూరంలో జాతీయ రహదారులున్నాయని చెప్పే గ్రామాలు కూడా జాతీయ రహదారులపైనే ఉన్నాయి. అలాగే విద్యుత్ సరఫరా, పారిశుద్ద్యం, నీటి సరఫరా తదితర విషయాలలో కూడా చాలా మార్పులు జరిగాయి. ఇప్పటి వాస్తవ సమాచారానికి తెవికీ సమాచారానికి గ్రామవ్యాసాలలో విపరీతమైన తేడాలున్నాయి. అయితే ఇప్పుడు కేవలం ఒక్క మేడపల్లి (నల్లబెల్లి) వ్యాస సమాచారం ఆధారంగానే సమీక్ష జరిపాను. కాని ఈ లోపాలు ఇలాంటి పొరపాట్లు ఉన్న వేలాది గ్రామవ్యాసాలకు వర్తిస్తుంది. కేవలం ఏదో ఒకట్రెండు వ్యాసాలలో పొరపాట్లు ఉన్నాయని కాకుండా వేలాది గ్రామవ్యాసాలలో ప్రక్షాళన కోసమే ఈ సమీక్ష. సమీక్షలో తెలిపిన అభ్యంతరకర వాక్యాలు, అస్పష్టమైన మరియు అసమగ్రమైన సమాచారం తొలగిస్తే ఇక మిగిలేది ఎంత అనేది కూడా సభ్యులు గ్రహించాలి. అసలు గ్రామ వ్యాసంలో నాణ్యమైన సమాచారం ఉన్న వాక్యాలెన్ని అనేవి కూడా లెక్కపెట్టండి. అవసరమైతే ఇదే గ్రామవ్యాసం ఎలా ఉండాలో (ఎలా వ్రాయాలో) నేను వ్రాసి చూపించగలను. (గ్రామవ్యాసంలోని అభ్యంతర వాక్యాలు, దానికి ముందు బ్రాకెట్లలో నా అభ్యంతరం కూడా వ్రాశాను. చర్చను కొనసాగించేవారు ఈ చర్చను విడదీయకుండా నా సంతకం క్రిందుగా మాత్రమే వ్రాయండి)

1) గ్రామంలో నాలుగుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. (ఇది ఎప్పటి సమాచారం, ప్రస్తుతానికి ఇది సరైనదేనా? ఏటా పుట్టగొడుగుల్లా గల్లీకొకటి పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల సంఖ్యకు కొలమానం ఏమిటి? అసలు బాలబడులంటే ఏమిటి ? నర్సరీలా, ప్రాథమిక పాఠశాలలా?)
2) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. (గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయా? ప్రాథమికోన్నత అంటే ఏమిటి ? మాధ్యమిక అంటే ఏమిటి ?)
3) ... ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వరంగల్లోనూ ఉన్నాయి. (50 కిమీ దూరం వరకు డిగ్రీ కళాశాల ఇప్పటికీ లేదా? మరి 15 కిమీ దూరంలో ఉన్న నర్సంపేట గ్రామవ్యాసంలో డిగ్రీకళాశాల ఉన్నట్లుగా వ్రాయబడింది కదా! నల్లబెల్లి మండలంలోని శనిగరం (నల్లబెల్లి), ముచింపుల వ్యాసాలలో సమీప డిగ్రీ కళాశాల నర్సంపేట అని కూడా వ్రాయబడింది.)
4) మేడపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. (ఎప్పటికీ 5గురు సిబ్బందే ఉంటారా ? ఇది నమ్మశక్యంగా లేదు)
5) ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. (డాక్టర్లు ఎప్పుడూ ఉండరా? పారామెడికల్ సిబ్బంది ఎప్పుడూ ఒకరే ఉంటారా?)
6) ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు (సర్వకాలం ఒక డాక్టరే, ఒక పారామెడికల్ సిబ్బందే ఉంటారా?)
7) సంచార వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. (సంచార వైద్యశాల అంటేనే స్థిరంగా లేనిది. అది ఒకచోటు నుంచి మరో చోటుకు వెళుతూ సేవలను అందిస్తుంది. మరి ఆ సంచార వైద్యశాల ఈ గ్రామంలోకి ఎందుకు ప్రవేశించదు? ఈ గ్రామంలో ఎందుకు సేవలందించదు? ఈ గ్రామానికి 5 కిమీ లోపు ఎప్పుడూ రాదా? 10 కిమీ దూరం వదిలి వెళ్ళదా?)
8) గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. (ఇది ఎప్పటి సమాచారం ? ఇప్పటికీ మూడే ఉన్నాయా? ముగ్గురికీ ఇప్పటికీ డిగ్రీ లేదా?)
9) రెండు మందుల దుకాణాలు ఉన్నాయి. (ఇదెప్పటి సమాచారం ? చిన్న గ్రామంలో 2 మెడికల్ షాపులున్నాయంటేనే గ్రేట్ ! సాధారణంగా చిన్న గ్రామాలలో ప్రత్యేకంగా మెడికల్ షాపులుండవు, కిరాణా షాపులలోనే కొన్ని ముఖ్యమైన మందులను మాత్రం అమ్ముతారు. లేదా అక్కడి వైద్యులే మందులను కూడా ఉంచుకుంటారు. దీనికి తాజా ఆధారం కావాలంటే ఎలా చూపించాలి?)
10) గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. (వేసవిలో కూడానా? )
11) బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. (పై వాక్యానికి దీనికి తేడా స్వల్పం, చేతిపంపులైనా, పవర్ బోర్లైనా బోరింగులే కాని దీనికి తాజా పరిస్థితి ఆధారం ఎలా చూపించాలి?)
12) గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. (పెద్ద పట్టణాలలోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేనప్పుడు గ్రామాలలో ఉన్నదనుకోవడం అనుమాస్పదమే ! దీనికి తాజా ఆధారం ఎలా అందించాలి?)
13) మేడపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. (పోస్టాఫీసు సౌకర్యం గ్రామంలోనే ఉన్నప్పుడు సబ్-పోస్టాఫీసు దూరం గురించి వ్రాసే అవసరం ఉన్నదా?)
14) పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (పోస్టాఫీసు సౌకర్యం గ్రామంలోనే ఉంది అనే వాక్యం ఉన్న తర్వాత మళ్ళీ 10 కిమీ పైబడి దూరంలో ఎందుకు? ఇక టెలిగ్రాఫ్ విషయానికి వస్తే అసలు భారతదేశంలో ఎక్కడైనా టెలిగ్రాఫ్ సౌకర్యం ఉన్నదా? ఈ ఒక్క పాయింటు చాలు సమాచారం ఎంత పాతదో తెలుసుకోవడానికి !)
15) గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. (ప్రధాన రహదారి అయితే తప్ప అన్ని గ్రామాలకు ఆర్టీసి సౌకర్యం ఉండదు, ఈ గ్రామం గురించి నాకు తెలియదు కాని ఇలాంటి సమాచారమే ఉన్న నాకు తెలిసిన మల్ రెడ్డిపల్లి (తాండూరు మండలం) గ్రామవ్యాసంలోని సమాచారం చూస్తే పూర్తిగా తప్పు అని చెప్పగలను)
16) వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. (ఇలాంటి వాక్యాల తాజాకరణకు ఆధారం లభ్యమౌతుందా? ఎలా నిరూపించాలి ?)
17) రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (10 కిమీ పైబడి అని కాకుండా సమీప రైల్వేస్టేషన్ పేరు ఇస్తే వ్యాసానికి బలం చేకూరుతుంది, కేవలం పట్టికలలోని సమాచారం మాత్రమే వాక్యాలుగా పేరాలలో చేర్చడం వల్ల వ్యాస నాణ్యత దిగజారింది. రైలురవాణా గురించి భూత్పూర్ గ్రామవ్యాసంలో నేను వ్రాశాను చూడండి)
18) గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. (ఇది సాధారణ సమాచారం మాత్రమే, విజ్ఞానసర్వస్వానికి ఇలాంటి సమాచారం తగదు. కనీసం ఏయే రకం రోడ్లు ఎంత పొడవు కలిగిఉన్నాయో వ్రాసినా బాగుండేది.)
19) రోజువారీ మార్కెట్, వారంవారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. (దూరం కాదు అది ఎక్కడనేది ముఖ్యం, అది తెలిస్తేనే సమాచారం చేర్చబడాలి కాని పట్టికలలోని సమాచారం చేర్చడం సరైనది కాదు)
20) ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. (ఒక గ్రామానికి సమీప ఏటీఎం, సమీప బ్యాంకు ఎక్కడనేది ముఖ్యమైన సమాచారమే కాని కేవలం దూరం మాత్రం తెలపడం అనవసరం. 10 కిమీ పైబడి అంటే అది ఖచ్చితమైన దూరం కూడా కాదు. అది ఎక్కడైనా ఉండవచ్చు. ఇలాంటి సమాచారం కూడా సాధారణ సమాచారంగానే పరిగణించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాక్యాలనేవి అనవసర సమాచారం కిందికే వస్తాయి)
21) వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (గ్రామంలో పండిన పంటలను అమ్ముకోవడానికి సమీప వ్యవసాయ మార్కెట్ కమిటి ఎక్కడుంది అనేది ముఖ్యమైన సమాచారమే కాని ఇక్కడ కూడా 10 కిమీ దూరంలో ఉంది అని ఇవ్వడం ఏ మాత్రం ఉపయోగకరమైన సమాచారం కాదు. 10 కిమీ పైబడి దూరంలో ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఇది సాధారణ సమాచారం కిందికే పరిగణించడం జరుగుతుంది)
22) అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. (అసెంబ్లీ పోలింగ్ స్టేషన్ అనేది ఒక కార్యాలయం కాదు. అసెంబ్లీ అయినా, లోక్‌సభ అయినా, గ్రామపంచాయతీ / ఎంపీటీసి/ జడ్పీటీసి ఇలా ఏ ఎన్నికలైనా గ్రామంలో ఉండే ఒక పాఠశాలనో మరేదో అందుబాటులో ఉన్న భవనాన్నో తాత్కాలికంగా పోలింగ్ బూత్‌గా చేస్తారు అంతేకాని శాశ్వతంగా ఏ గ్రామంలోనూ పోలింగ్ స్టేషన్లు ఉండవు. అలాగే జనన మరణాల నమోదు కార్యాలయం కూడా ఎక్కడా ప్రత్యేకంగా ఉండదు. సాధారణంగా ఈ పని గ్రామపంచాయతీలే నిర్వహిస్తాయి)
23) ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (గ్రామాలలో ఆటలాడటానికి మైదానాలకు కొదువేమీ ఉండదు కాని స్టేడియం అన్నప్పుడు మాత్రం ఎక్కడుందో చెప్పాలి)
24) సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. (10 కిమీ పైబడి ఎలాగూ ఉంటుంది. అది ఎక్కడ అనేదే ముఖ్యం) గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. (ఈ కాలంలో గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉంటే అది ప్రత్యేకత కాదు, ఏదేని గ్రామంలో విద్యుత్ సరఫరా ఇప్పటికీ లేనట్లయితేనే అది ప్రత్యేకత కిందికి వస్తుంది. విద్యుత్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది. సమీప విద్యుత్ సబ్‌స్టేషన్ ఎక్కడ లాంటి సమాచారం ఇస్తేనైనా ఉపయోగకరం.)
25) రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. (తెలంగాణలో వ్యసాయానికి, వాణిజ్య అవసరాలకు 24 గంటల సరఫరా ఉంది, తెలంగాణలో ప్రస్తుతం విద్యుత్ కొరత ఏమీ లేదు కాబట్టి ఈ సమాచారం ప్రస్తుతానికి వర్తించదు మరియు తప్పుడు సమాచారంగా పరిగణించవచ్చు)
26) విజ్ఞానసర్వస్వం అందులోనూ ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వం అన్నప్పుడు తాజాకరించిన నాణ్యమైన సమాచారం ఉండాలి కాని అస్పష్టమైన, నిరుపయోగమైన, తాజాకరణ లేని సమాచారం ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
27) తెవికీలోని వ్యాసాలు తాజాకరించిన సమాచారంతో ఆధారం చూపగలిగేలా ఉండాలి కాని గ్రామవ్యాసాలు ఇటు తాజాకరణ లేవు అటు తాజా ఆధారమూ లేదు
28) తెవికీలోని వ్యాసాలలోని వాక్యాలపై అనుమానం ఉంటే ఎవరైనా ఆధారం కోరబడినది మూస పెట్టవచ్చు. కొంతకాలం వరకు సరైన ఆధారం చూపబడినచో ఆ వాక్యాలను తొలగించవచ్చు. అలాంటప్పుడూ గ్రామవ్యాసాలలోని అధికభాగం తొలగింపునకు గురికావడం ఖాయం. అధిక సంఖ్యలో ఇలాంటి వాక్యాలు చేర్చడం సరైనది కాదు.
29) అసలు మేడపల్లి గ్రామచరిత్ర ఏమిటి ? ఆ గ్రామంలోని పురాతన దేవాలయాలు ఏవి ? ఏమైనా ప్రాచీన శాసనాలు లభించాయా ? గ్రామప్రముఖులెవరు ? ఇటీవల జరిగిన సంఘటన ముఖ్యాంశాలు, చెరువులు, కాలువలు, నదులు (ఏవైనా ఉంటే) తదితరాలు చేరిస్తే వ్యాసం నాణ్యత మెరుగుపడుతుంది. అంతేకాని అక్కడి ప్రజలకు కాని పాఠకులకు కాని గ్రామ సమాచారం తెలుసుకోగోరే ఔత్సాహికులకు గానీ ఏ మాత్రం ఉపయోగపడని సమాచారం చేర్చడం వల్ల ప్రయోజనం ఏమిటి? (వ్యాస పరిమాణం పెరగడం తప్ప, వ్యాసాలు రచించేది పాఠకుల కొరకే కాని మన దిద్దుబాట్ల సంఖ్యకోసం కాదు, ఇన్నిబైట్ల సమాచారం చేర్చామని చెప్పుకోవడం కోసం కాదు)
30) పట్టికలలోని సమాచారమే వ్యాసాలలో చేర్చబడింది అనేదానికి మరో మంచి ఉదా: దుగ్గొండి గ్రామవ్యాసంలో ఉన్న "ఇది మండల కేంద్రమైన దుగ్గొండి నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది." అనే వాక్యం. (అంటే అదే గ్రామం అదే గ్రామం నుంచి సున్నా కిమీ దూరంలో ఉంది!! ఇదీ ఒక సమాచారమేనా?)
31) వికీపీడియా లాంటి ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వాలలో సమాచారం లేకుండుట కంటే తప్పుడు లేదా అసమగ్ర సమాచారం ఉండుట పొరపాటు. గ్రామస్థులు కాని ఆ గ్రామ సమాచారం తెలుసుకోగోరే ఔత్సాహికులు కాని ఆశించేది, వారికి మనం అందించేది సమగ్రమైన మరియు వాస్తవ సమాచారమే కాని ఎప్పటిదో పాత సమాచారం కాదు, స్పష్టంగా వివరించని అసమగ్ర సమాచారమూ కాదు. వ్యాసాలలో పాఠకులు చూసేది, ఆశించేది, కోరుకొనేది, మెచ్చుకొనేది సమగ్రమైన సమాచారమే కాని వ్యాస పరిమాణం కానేకాదు. ఇలా ఏ రకంగా చూసిననూ వ్యాసాలకు రాశి కంటే వాసియే ముఖ్యమని ప్రతి ఒక్కరు గ్రహించినప్పుడే తెవికీ బాగుపడుతుంది.
గమనిక: పై పాయింట్లన్నీ అభ్యంతరాలు కావు. అందులో కొన్ని అనుమానాలు, సందేహాలు కూడా ఉన్నాయి. గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:51, 24 ఏప్రిల్ 2019 (UTC)

 

No comments:

Post a Comment