Friday, 8 November 2013

తెలుగు వికీపీడియా వ్యాసాలలో లింకులు - విధానాలు

వ్యాసాలను చదువుతున్నప్పుడు గ్రంథాలలో లేని సదుపాయం అంతర్జాలంలో ( ఆఫ్ లైన్ కంప్యూటర్‌లో కూడా) చాలా ఉంటుంది. ఇందులో ఒకటి లింకులు. తెలుగు విజ్ఞానసర్వస్వపు వ్యాసాలు పఠిస్తున్నప్పుడు కూడా చాలా లింకులు కనిపిస్తాయి. సందేహం కొరకు ఆ లింకులపై నొక్కితే సంబంధిత వ్యాసాలను చేరుకుంటాము. మరి ఆ లింకులు ఎలా ఇవ్వాలి? దాని విధి-విధానాలేమిటి తెలుసుకుందాం.

లింకులు ఎలా ఇవ్వాలి?
తెవికీలో లింకులు ఇవ్వడం చాలా తేలిక. ఏదేని పదానికి [[  ]] బ్రాకెట్లు తగిలిస్తే చాలు ఆటోమేటిగ్గా లింకు ఏర్పడుతుంది. అయితే ఆ పదం (లేదా పదాలు) పై ఇదివరకే వ్యాసం ఉంటే లింకు నీలిరంగులోనూ, వ్యాసం లేకుంటే ఎర్రరంగులోనూ కనిపిస్తుంది. ఏదేని వ్యాసంలో సవరించి ట్యాబ్ నొక్కి మీరు ఈ విషయాన్ని గ్రహించవచ్చు.

పదానికి సరిపడ వ్యాసం లేనప్పుడు లింకు ఎలా ఇవ్వాలి?

వ్యాసంలో ఉన్న చాలాపదాలకు అదే పదాలతో వ్యాసాలుండవు. ఉదా:కు అశోకుని పాలనా కాలం.... వాక్యంలో "అశోకుని" పదానికి పైన తెలిపినట్లు లింకిస్తే ఎర్రలింకు ఏర్పడుతుంది. ఎందుకంటే "అశోకుని" అనే పేరుతో వ్యాసం ఉండదు. అలాంటప్పుడు దాన్ని అశోకుడు వ్యాసానికి లింకును ఎలా ఇవ్వాలి? అనే సందేహం రావచ్చు. ఇది కూడా చాలా తేలికే. అయితే బ్రాకెట్లో మధ్యలో పైపు (|) ఉంచి పైపుకు ఎడమ వైపున మాత్రం అసలైన వ్యాసం పేరు ఇవ్వాలి. ఉదా:కు [[అశోకుడు|అశోకుని]] లింకు ఇస్తే వాక్యంలో అశోకుని అనే కనిపించిననూ లింకుమాత్రం అశోకుడు వ్యాసానికి దారితీస్తుంది.

వ్యాసంలో ఒక విభాగానికి లింకు ఇవ్వడం:
వ్యాసాలు పెద్దవిగా ఉన్నప్పుడు సౌలభ్యం దృష్ట్యా వ్యాసానికి కాకుండా వ్యాసంలోని ఒక విభాగానికి కూడా లింకు ఇవ్వవచ్చు. అలా ఇవ్వాలంటే వ్యాసం పేరు తర్వాత # పెట్టి విభాగం పేరు వ్రాయాలి. ఉదా:కు తెలంగాణ వ్యాసం పెద్దది కాబట్టి ఆ వ్యాసంలో తెలంగాణ సాహిత్యం విభాగానికి లింకుని ఇవ్వాలంటే [[తెలంగాణ#తెలంగాణ సాహిత్యం]] అని పెడితే ఆ విభాగానికి దారిఏర్పరుస్తుంది.

వ్యాసంలో లింకులు - పరిమితులు:
  • వ్యాసంలో లింకులు ఇవ్వడం వల్ల పాఠకులకు సౌలభ్యం ఉన్ననూ పరిమితి దాటితే వాటివల్ల ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఇటీవల కాలంలో చాలామంది టచ్‌స్క్రీన్ వాడుతున్నారు. లింకుపై కొద్దిగా టచ్ అయినా కొత్తవ్యాసం వస్తుంది. మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అధిక లింకుల వల్ల దిద్దుబాటు చేసే సభ్యులకు కూడా (ముఖ్యంగా కొత్త సభ్యులకు) గందరగోళంగా మారుతుంది.
  • అలాగే ఒకే పదం వ్యాసంలో పలుమార్లు వచ్చియుంటే ప్రతీసారి ఆ పదానికి లింకు ఇచ్చే అవసరం ఉండదు. మరీ పొడవైన వ్యాసాలలో మాత్రం దీనికి కొంత మినహాయింపు ఇవ్వవచ్చు.
  • తేదీలకు మాసంతో కలిపి లింకులు ఇవ్వాలి. ఉదా:కు "ఆగస్టు 15" ను రెండు పదాలు విడివిడిగా కాకుండా [[ఆగస్టు 15]]గా లింకిస్తే  ఆ తేదీకి సంబంధించిన వ్యాసాన్ని చేరుకోవచ్చు, లేనిచో ఆగస్టు మాసపు వ్యాసం, 15 అంకె వ్యాసంలకు లింకులు దారితీస్తాయి. అయితే సంవత్సరంకు మాత్రం విడిగా లింకులివ్వాలి.
  • లింకులు ఇచ్చేముందు వ్యాసం ఏ పేరుతో ఉన్నదో గ్రహించండి. వ్యాసం పేరు ఇవ్వడంలో కొద్దిగా తేడా వచ్చినా ఎర్రలింకు ఏర్పడుతుంది. దీనిపై వ్యాసం లేదని భావించి ఎవరైనా మరో కొత్త వ్యాసం సృష్టించవచ్చు కూడా. వారి శ్రమ వృధాకావచ్చు.


ఇలాగే వర్గాలకూ, బొమ్మలకూ, ఇతర భాషావికీలలోని వ్యాసాలకు కూడా లింకులివ్వవచ్చు. వికీకి సంబంధంలేని ఇతర వెబ్‌సైట్లకు లింకులివ్వడంలో మాత్రం కొంత తేడా ఉంటుంది. వీటన్నింటినీ మరోపాఠంలో నేర్చుకుందాం.

No comments:

Post a Comment