Sunday, 16 February 2014

తెవికీ కృషి ఎందరిది ?

తెలుగు వికీపీడీయా ఒక స్వేచ్ఛా విజ్ఞానసర్వస్వము. అంటే ఎవరైనా ఉపయోగించుకోవడమే కాకుండా ఎవరైనా సమాచారం కూడా చేర్చగలిగేది అన్నమాట. అలాంటప్పుడు ఇంతవరకు జరిగిన తెవికీ కృషి అందరిది అనే భావన తప్పకుండా వస్తుంది. మరి అది సరైనాదేనా? అనే సందేహమూ రావచ్చు! ఒక్కో అంశాన్ని పరిశీలిద్దాం-

దిద్దుబాట్లు:
వ్యాస సమాచారంలో జరిగిన దిద్దుబాట్లను పరిశీలిస్తే డిసెంబరు అంతానికి 3.36 లక్షల దిద్దుబాట్లు జరిగాయి (బాటులు కాకుండా). వీటిలో 61% దిద్దుబాలు కేవలం 10 సభ్యులచే మాత్రమే జరిగింది. తెవికీలో సభ్యత్వం తీసుకున్న వారు 34000+ కాగా, కనీసం ఒక్క దిద్దుబాటైనా చేసిన వారు 3664, కనీసం 5 దిద్దుబాట్లు చేసినవారు 642 సభ్యులు మాత్రమే. 100+ దిద్దుబాట్లు చేస్నవారు 130 మాత్రమే. అంటే తెవికీలో చేరిన సభ్యులలో కృషిపరంగా చూస్తే అందులో చాలా కొద్దిమంది మాత్రమే దిద్దుబాట్లలో పాల్గొంటున్నారన్నమాట! అయితే కేవలం దిద్దుబాట్ల సంఖ్య ప్రకారమే ఈ కృషిని మనం బేరీజు వేయలేము. ఒక్క దిద్దుబాట్లు చేసే చోట పదుల సంఖ్యలో దిద్దుబాట్లు చేసిన వారున్నారు, అలాగే ఒక్క దిద్దుబాటుతో కూడా పెద్ద సమాచారం పెట్టినవారునారు. అలాగే దిద్దుబాట్ల ద్వారా వ్యాసానికి సంబంధం లేని సమాచారం, బాటుద్వారా చేర్చగలిగే సమాచారం పెట్టిన సభ్యుల దిదుబాట్లు కూడా గణాంకాలలో చేరాయి.

వ్యాస నాణ్యత:
తెవికీకి అతి ప్రధానమైనది వ్యాస నాణ్యత. చాలా సభ్యులు వ్యాస సమాచారానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి నాణ్యతను గుర్తించడం లేదు. గత కొద్ది సంవత్సరాలలో తెవికీ వ్యాసాల నాణ్యత తగ్గడం వల్ల పాఠకుల ఆదరణ తగ్గిపోయింది! నాణ్యత అంటే వ్యాసంలోని వాక్యాల కూర్పు మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైనది వ్యాసానికి సంబంధించి పనికి వచ్చే సమాచారం, దానికి మూలాలు, పలు వనరుల నుంచి సేకరించిన సమాచారం మరియు ఎప్పటికప్పుడు తాజాకరణ. కాని చాలా వ్యాసాలు ఎప్పుడో వ్రాసినవి మళ్ళీ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనితో వ్యాసాలలో తాజాకరణ ఉండటం లేదు. పాఠకులకు సమాచారం ఇవ్వకపోవడం కంటే తాజాకరణ లేని సమాచారం అందుబాటులోఉంచడమే పొరపాటు!

ఆ వ్యాసాలను ఎందరు చూస్తున్నారు?
కొందరు వ్రాసిన కొన్ని వ్యాసాలు చూస్తే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి వ్యాసాలు అవసరమేనా? అనే సందేహమూ వస్తుంది. ఇక్కడ ఎవరైనా, ఏ వ్యాసమైనా, తమకు నచ్చిన వ్యాసాన్ని వ్రాసుకోవచ్చు (నిబంధనలు ఉల్లంఘించనంతవరకు) కాని సంవత్సరాలైననూ ఒక్క వీక్షణ కూడా అలాంటి వ్యాసాలను సృష్టించడం వృధాగానే పరిగణించవలసి వస్తుంది! విశేషమేమంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వీక్షణలు లేని వ్యాసాలనే మళ్ళీమళీ కొందరిచేత సృష్టించడం జరుగుతోంది. గణాంకాల పరంగా దిద్దుబాట్లు సంఖ్య పెరగవచ్చు కాని ఇలాంటి వ్యాసాలవల్ల తెవికీ నాణ్యత మాత్రం పెరగదు.

దారిమార్పులు:
తెవికీలో దారిమార్పులే సుమారు 18000 వేలున్నాయి. అంటే ఆ సంఖ్య దిద్దుబాట్లు కూడా గణాంకాలలో చేరియున్నాయి. అందులో చాలా వరకు అనవసరమైనవే. కొన్ని వ్యాసాలకు పదుల సంఖ్యలో దారిమార్పులున్నాయి. విశేషవ్యాసమైతే ఫర్వాలేదు కాని వీక్షణలు లేని వ్యాసాలకు కూడా దారిమార్పులు ఉండటం వృధానే!

కాపి సమాచారం:
సాధారణంగా కాపి సమాచారం పరిమాణం పెద్దదిగానే ఉంటుంది. అది పత్రికల నుంచి కాపీ చేసినది కావచ్చు, అంతర్జాలంలో లభ్యమైన ఇతర వనరుల నుంచి కావచ్చు, చివరకు బ్లాగుల నుంచీ కావచ్చు కూడా. విశేషమేమంటే తెవికీ వ్యాసాల నుంచే కాపీచేసి సృష్టించిన అతిపెద్ద వ్యాసాలూ మనవద్ద ఉన్నాయి! (దీన్ని వ్యాసాల సంకలనం అనాలేమో!) కొందరు సీనియర్ సభ్యులకు కూడా ఇలాంతి విషయాలపై అవగాహన లేదు!


No comments:

Post a Comment