Wednesday 6 November 2013

తెలుగు వికీపీడియాను ఎందరు చూస్తున్నారు?

వందలాది సభ్యుల కృషితో రూపుదిద్దుకుంటున్న తెలుగువికీపీడియాను ఎందరు వీక్షకులు చూస్తున్నారు? ఈవిషయంలో దేశ భాషా వికీలలో తెవికీ స్థానం ఏది? తదితర విషయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెవికీలో సభ్యులు కృషిచేసేది తమకోసం కాదు, పాఠకులకోసమే అన్నది తెలిసిందే. అలాంటప్పుడు పాఠకులు ఏయే వ్యాసాలను ఆదరిస్తున్నారో తెలుసుకొని సభ్యులు అలాంటి వ్యాసాలపై అధికకృషి చేసినప్పుడే సభ్యుల కృషికి సార్థకత లభిస్తుంది.

తెవికీని ఎందరు చూస్తున్నారు?
సెప్టెంబరు 2013 నాటి తాజా గణాంకాల ప్రకారం చెప్పాలంటే తెలుగు వికీపీడీయాను ప్రపంచం మొత్తంపై ప్రతి గంటకు సరాసరిన 3635 వీక్షణలు వస్తున్నాయి. అంటే నిమిషానికి 60, సెకనుకు ఒక వీక్షణ జరుగుందన్నమాట. అయితే ఈ వీక్షణలు తెవికీలో వ్యాసాలు రచించే సభ్యులు, ఇతర భాషా వికీ సభ్యులు లింకుల ద్వారా ఇక్కడికి వచ్చే సందర్శనలు కూడా ఇందులో కలుస్తాయి. అయితే ఈ వీక్షణ సంఖ్య చాలా తక్కువేనని చెప్పవచ్చు.

ఇతర భాషా వికీలతో తారతమ్యం:
మనతో దాదాపు సమానంగా 8 కోట్ల ప్రజలున్న వియత్నామీస్ భాషా వికీకి మనకంటె 38 రెట్లకు పైగా అంటే గంటకు 13021 (సెకనుకు 38) వీక్షణలు వస్తున్నాయి. భారతీయ భాషలలో హిందీవికీకి గంటకు 15369 వీక్షణలు జరుగుతున్ననూ (మనకంటే 4.2 రెట్లు) ఆ భాష మాట్లాడేవారు కూడా మనకంటే 6.8 రెట్లు అధికంగా ఉన్నారు. బెంగాలీ వికీ పరిస్థితి కూడా ఇదే. మరాఠి మాష మాట్లాడే వారు మనకంటె కొద్దిగా అధిక సంఖ్యలో ఉన్ననూ వీక్షకులు మనకంటే 1.7 రెట్లు అధికంగా ఉన్నారు. తమిళభాష మాట్లాడేవారు మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్ననూ వీక్షకుల సంఖ్య  గంటకు10216 (మనకంటె 2.8 రెట్లు) వీక్షణలు వస్తున్నాయి. కన్నడ, గుజరాతి వికీల కంటే మాత్రం మన వీక్షకులు ఎక్కువే. కేవలం 10 లక్షల ప్రజలుమాత్రమే మాట్లాడే ఎస్పరాంటో భాషావికీకి గంటకు 14,339 వీక్షకులు ఉన్నారంటే ఆశ్చర్యకరం కాదు కాని మనం ఇంకనూ కృషిచేయాల్సింది, పాఠకులను ఆకట్టుకోవాల్సింది చాలా ఉంది అని గ్రహించాల్సిన విషయం.

మాసాల వారీగా వీక్షణల పరిస్థితి:
దాదాపు ప్రతి మాసంలో 2-3 మిలియన్లు ఉండే వీక్షకుల సంఖ్య అక్టోబరు మాసంలో 3 దాటడం శుభసూచకం. సరిగ్గా రెండేళ్ళ తర్వాత 3 మిలియన్లు దాటిననూ అప్పటి 3.5 మిలియన్ల రికార్డును అధికమించలేదు. ఫిబ్రవరి 2010లో ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో తెలుగు వికీపీడీయాపై కవర్ పేజీ కథనం రావడంతో ఆ నెలలో జరిగిన 4.5 మిలియన్ల ఆల్‌టైం వీక్షకుల సంఖ్య రికార్డు మాత్రం పదిలంగానే ఉంది.

పాఠకులు ఎలాంటి వ్యాసాలు చూస్తునారు?
ఏప్రిల్ 2013 నాటి గణాంకాల ప్రకారం పరిశీలిస్తే మొదటి పేజీకి 33638 వీక్షణలు జరిగాయి. ఆ తర్వాతి స్థానాలలో ఇటీవలి మార్పులు, ఉగాది ఉన్నాయి. నిర్వహణ పేజీలు వదిలిపెట్టి చూస్తే తెలుగు (7వస్థానం), బీ.ఆర్.అంబేడ్కర్ (11వ స్థానం), మహాత్మాగాంధీ (12వ స్థానం), శ్రీశైలం (14వస్థాన), తెలుగు భాష చరిత్ర (21వ స్థానం), నన్నయ్య (22వ స్థానం), భారత దేశము (23వ స్థానం), ఆంధ్ర ప్రదేశ్ (24వ స్థానం), శ్రీశ్రీ (28వ స్థానం), గురజాడ అప్పారావు (31వ స్థానం), శ్రీ కృష్ణదేవ రాయలు (32వ స్థానం), నందమూరి తారక రామారావు (33), శ్రీరామనవమి (35), జగ్జీవన్ రాం (36), సంక్రాంతి (37), రావూరి భరద్వాజ (38), తిక్కన (39), స్వామీ వివేకానంద (40), మహా భారతము (42), భారత రాజ్యాంగం (43), చిరంజీవి (45), భారతదేశ చరిత్ర (46), భగవద్గీత (47), సుభాష్ చంద్రబోస్ (48) స్థానాలలో ఉన్నాయి. దీని బట్టి చూస్తే వ్యక్తుల వ్యాసాలను పాఠకులు అధికంగా వీక్షుస్తున్నారని విశదమౌతోంది. ఇలాంటి వ్యాసాలపై మరింత కృషిచేసి ఉన్న వ్యాసాలను పొడగించడం, తాజాకరణ చేయడం, నాణ్యత పెంచడం మరియు కొత్తగా పేరుపొందిన వ్యక్తుల వ్యాసాలు చేరిస్తే పాఠకులు తెవికీని మరింతగా ఆదరిస్తారని అనుకోవచ్చు.

2 comments:

  1. చక్కటి విశ్లేషణ. వ్యాసా వీక్షణల విశ్లేషణ కు మూలాలను తెలుపగలరా? ఎందుకంటే నాకు తెలిసిన http://stats.grok.se లో ఇప్పుడు Top 100 కనబడుటలేదు. మరియు వాటిపై కొన్ని అనుమానాలు ఆంగ్లవికీలో వ్యక్తమైనాయి.

    ReplyDelete
    Replies
    1. అర్జునరావు గారు, తెవికీలో టాప్-100 వీక్షణ పేజీ సమాచారాన్ని http://stats.grok.se/te/top నుంచి తీసుకున్నాను.ఆ సమాచారం ఏప్రిల్ 2013 మాసానిది. గత 6 మాసాల తాజాకరణ లేదు.

      Delete