Sunday, 18 October 2020

చంద్ర కాంత రావు నిర్వాహక హోదా విరమణ

 (జూలై 2020 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

చంద్ర కాంత రావు గారు నిన్న నిర్వాహక హోదానుండి విరమించారు (చూడండి వికీపీడియా:నిర్వాహకుల_జాబితా). 12 ఏళ్లకు పైగా నిర్వాహకహోదాలో తెవికీ కి సేవచేశారు. వారి సేవలకు నా ధన్యవాదాలు. నా వికీ ప్రయాణంలో ఇప్పటివరకు నా పనిపై ప్రముఖంగా ముద్ర వేసిన బహు కొద్ది మందిలో చంద్రకాంత రావు గారు ఒకరు. తెవికీ లో చర్చలలో చురుకుగా పాల్గొని నిర్మొహమాటంగా ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. నేను తలపెట్టే పనులకు అవి కొంత అడ్డంకిగా మారి లక్ష్యం చేరటానికి కొంత ఎక్కువకాలంతీసుకున్నా, చేపట్టిన పనులు నాణ్యతగా చేయటానికి అవి సహకరించాయి. వికీ నియమాల గురించి తెలుసుకోవటంలో ఆయన చర్యలు సహాయపడేవి. చాలా కొద్దిమంది చురుకైన వికీపీడియన్లు గల తెవికీలో ఏకరూప సమూహఆలోచన (Groupthink) గా మారకుండా వుండటంలో వారి పాత్ర ప్రముఖమైనది. ఇకముందుకూడా నిర్వాహకహోదానుండి తప్పుకున్నా వారు క్రియాశీలంగా తెవికీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 10:12, 29 జూలై 2020 (UTC)

చంద్ర కాంత రావు గారు నిన్న నిర్వాహక హోదానుండి విరమించడం నాకు చాలా బాధనిపించింది. అతను తెవికీలో విశేష సేవలందించారు. నేను తెవికీలో చేరినపుడు తెలియని విషయాలలో, విధానాలలో అవగాహన కల్పించారు. ఒక విధంగా వికీ గురువు లాంటి వారు. ఈ రోజు చురుకుగా పనిచేస్తున్నానంటే అతని ప్రేరణ ఎంతో ఉందని చెప్పవచ్చు. మొదటి పేజీలో శీర్షికల నిర్వహణ నుండి, మూలాలు, లింకులు, కాపీహక్కుల వంటి విషయాలలో నాకు చాలా సందర్భాలలో మార్గనిర్దేశం చేసారు. ఏదో ఒక రోజు వికీలో క్రియాశీలక నిర్వాహకులుగా వస్తారని, వికీని సుసంపన్నం చేస్తారని అనుకున్నాను. స్వచ్ఛందంగా విరమించుకోవడం బాధ కలిగించింది. నిర్వాహకహోదానుండి తప్పుకున్నా సభ్యునిగా వారు క్రియాశీలంగా తెవికీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. K.Venkataramana(talk) 15:56, 29 జూలై 2020 (UTC)
వికీపీడియాలో చంద్రకాంతరావు గారికి ప్రత్యేక శైలి, నాది వెంకటరమణ గారి అభిప్రాయంతో సరిపోతుంది, వికీపీడియాలో నియమాలు అసలుకే తెలియక నిర్వాహకులను చాలా ఇబ్బందులకు గురి చేసే వాడిని అలాంటి సమయంలో నియమాలు ఇలా ఉంటాయని నన్ను ప్రోత్సహించిన పవన సంతోష్, అర్జున, వైజాసత్య,పాలగిరి, చంద్ర కాంత రావు గారు, వెంకటరమణ గార్లు మార్గనిర్దేశం చేశారు, అందులో చంద్ర కాంత రావు గారు నా గాడ్ ఫాదర్ వికీపీడియాలో తప్పు చేయని వాడుకరి ఎవరూ లేరు ప్రారంభంలో అందరూ చేసేదే అని నా చర్చా పేజీలో ప్రోత్సహించి ఒక్క వాడుకరిల చేసింది, ఆ నాలుగు పదాలు నన్ను ముందుకు నడిపించాయి, వారి మంచి మనసు చంద్ర కాంత రావు గారి బ్లాగులో నా గురించి ఒక వ్యాసం కూడా రాశారు, వికీపీడియాలో నిర్వాహకులుగా 100% న్యాయం చేశారు, వాడుకరిగా మీ నుండి ఇంకా... చాలా వ్యాసాలు నేను ఆశిస్తున్నాను... మంచి వ్యాసాలు రాయగలరు, నేను మీ అభిమాని... నమస్తే... ప్రభాకర్ గౌడ్ నోముల 17:12, 29 జూలై 2020 (UTC)
నాపై చూపిన అభిమానానికి అర్జున, వెంకటరమణ, ప్రభాకర్ గౌడ్ నోముల గార్లకు కృతజ్ఞతలు. అలాగే ప్రారంభంలో నా నిర్వాహక హోదాను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రోత్సహించిన వైజాసత్య, కాసుబాబు, దేవా గార్లకు కూడా వందనాలు. గత ఏడాది చేసిన ఒక పాలసీకి నిరసనగా అప్పుడే నేను నిర్వాహకుల నోటీసు బోర్డులో రాజీనామా సమర్పించాను. మారిన పరిస్థితుల దృష్ట్యా ఆ అధికారం అధికారులకు లేదని మెటాలో అభ్యర్థన చేయమని ఒక సభ్యుడు సెలవియ్యగా, ఎలాగూ ఆ పాలసీకి అనుగుణంగా దిద్దుబాట్లు చేయననీ, తొలగింపు తప్పనిసరి అని వేచిచూశాను. కాని నెలలు గడిచినా, సంవత్సరం పైగా గడిచినా ఆ పాలసీ అటకెక్కింది కాని పట్టించుకొనే వారే లేరు. అమలు చేయనప్పుడు సభ్యుల సమయం వెచ్చించి పాలసీలెందుకు చేస్తున్నారో అర్థం కాదు కాని చివరికి విసిగిపోయి మాట ప్రకారం నేనే మెటాలో అభ్యర్థన చేసి నిర్వాహక హోదాను ఉపసంహరించుకున్నాను. నిర్వాహక హోదాను ఉపసంహరించుకున్నా నేను తెవికీ నుంచి వెళ్ళిపోయే ప్రశక్తి ఏ మాత్రం లేదు కాబట్టి సభ్యులు బాధపడే/సంతోషపడే అవసరం లేదని తెలియజేస్తున్నాను. ఇదివరకటి కంటే మరింత చురుకుగా తెవికీలో సమీక్ష పనులు నిర్వహించి లోటుపాట్లను, నిర్వాహక తప్పిదాలను ఖచ్చితంగా బహిర్గతం చేసి తెవికీ అభివృద్ధికి తోడ్పడగలను. ప్రస్తుత తెవికీ ఘోరదశలో ఉంది. ఊబిలో దిగజారిన తెవికీని పట్టాలపైకెక్కించడానికి తెవికీ ప్రక్షాళన జరగడం కూడా తప్పనిసరి. తెవికీని చక్కదిద్దడానికి అర్జునరావు మరియు వెంకటరమణ గార్లు ముందుండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:25, 29 జూలై 2020 (UTC)
చంద్రకాంతరావు గారు తెవికీకి చేసిన సేవలు నిస్సందేహంగా ప్రశంసనీయమైనవే. కానీ తెవికీ ఘోరదశలో ఉందనడం నేను అంగీకరించను. ఇది కేవలం ఆయన పేర్కొన్న సభ్యులు తప్ప మిగతా వారిని అవమానించడమే. ఆయనకు ఇది కొత్తకాదు. మొదటి నుంచి సూటిగా మాట్లాడటమనే పేరుతో సభ్యులను నొప్పించడమే అలవాటు. చర్చలు సామరస్య పూర్వక ధోరణిలో జరగడం లేదు. అదీ కాక ఆయన ఎప్పుడూ తప్పులు వేలెత్తి చూపడమే తప్ప జరిగిన మంచిపనులు గురించి ఏదీ ప్రస్తావించింది లేదు. దీని వల్ల తెవికీకి మేలు జరగక పోగా కీడు జరుగుతుంది. - రవిచంద్ర (చర్చ) 05:57, 30 జూలై 2020 (UTC)
రవిచంద్రగారూ, నా సేవలు గుర్తించినందుకు మీకూ నా కృతజ్ఞతలు. తెవికీ ఘోరదశలో ఉందని అన్నందుకు మీరు బాధపడే అవసరం లేదు. అది మీకుగాని మరికొందరు నిర్వాహకులకు గాని ఈ ఘోరదశకు సంబంధం లేదు. నాకు సందేశమిచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి తప్ప పైన నేనెవరి పేర్లు పేర్కోలేదనే విషయం గ్రహించండి. ఘోరదశ ఎందుకనేది దానికి కారకులెవరన్నదీ నా తదుపరి చర్చలే చెబుతాయి. వ్యక్తులను కాకుండా వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని బాగా ఆలోచించి తెవికీ అభివృద్ధి దృష్ట్యా మీ అభిప్రాయాలు ప్రకటించండి. మీకు మంచి తెవికీ భవిష్యత్తు ఉంటుంది. మిమ్ముల్ని ప్రశంసించే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:06, 30 జూలై 2020 (UTC)

 

మీరు బ్రతికి ఉన్నంత కాలం ఇదేపనా

 (మే 2020 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

మీరు బ్రతికి ఉన్నంత కాలం ఇదేపనా అని అనుమానం వాడుకరులకు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి వాడుకరిని అధికారంలో ఉన్న మనిషి, మంచిగానైనా లేదా చెడుగానైనా ఏవిధంగానైనా పాతచర్చలు ఉదహరిస్తూ చిత్రీకరణ చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతేనా అని ఒకసారి ఆలోచించాలి. అమ్మ ఒళ్ళో కూర్చుని పాలు తాగే వయసు నుండి చనిపోయే వరకు మనిషి ఒకేలా వుంటాడా ? తప్పులు ఎంచే మీరు మాత్రం మంచివారు, మీకు నచ్చని వారు చెడ్డవారు అనటం, జీవితకాలం ముద్ర వేయడం ఏమాత్రం సహించరాని విషయం. ఈ పెడ ధోరణి ఇప్పట్లో ఆగేటట్లు లేదు. అందుకే ఇక్కడకు నేను రావడం మానేసాను. ఎవరికీ ఊడేది యేమీలేదు కదా. ఇక్కడ పద్దతులు మారే వరకు, మంచి మనసులు ఉన్నవారు మాత్రం ఇక్కడకు రావద్దు, ఉండొద్దు, పని చేయవద్దు మాటలు అనిపించికోవద్దు, మీ సమయం వృధా చేసుకోవద్దని నా సలహా, సూచన. నా మాటలను అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఇక్కడ నా మనసుకు బావుంది అని అనిపిస్తే పనిచేయమని నేనే పోస్ట్ పెడతాను. నాకు తప్పులు ఇక్కడ అనిపించినవి వ్రాస్తునే ఉంటాను. JVRKPRASAD (చర్చ) 07:46, 30 మే 2020 (UTC) 

ఇటీవలి పరిణామాలు - నిర్వాహకుల పొరపాట్లు

 (మే 2020 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

తెవికీలో ఇటీవలి చర్చలను పరిశీలిస్తే నిర్వాహకులు పలు పొరపాట్లు చేస్తున్నారని గమనించవచ్చు. పలు కారణాల వల్ల నేను తెవికీలో చురుకుగా ఉండటం లేదు. సమయం లభించింది కదాని ఒక చూపుచూశాను. నేను ఎప్పుడో ఒకప్పుడు చూసిననూ వ్యాసాలను కాకుండా సభ్యుల చర్చలను, నిర్వాహకుల చర్యలను మాత్రం బాగా గమనిస్తాను. నేను గమనించిన వాటి ప్రకారం ఇటీవలి కాలంలో నిర్వాహకుల తప్పిదాలు, పొరపాట్లు కొన్ని క్రింద వివరిస్తున్నాను.

1) "...గత చర్చలో రెడ్డి గారికి అత్యంత పటిష్ఠమైన సమర్ధకుడుగా నిలిచిన వాడుకరి..." అంటూ @సభ్యుడు:చదువరి నన్ను ఉద్దేశించి రాశారు. నన్ను సభ్యుడు:రెడ్డికి సమర్థకుడిగా ఎలా ఆపాదించారు? అంత ఖచ్చితంగా ఎలా నిర్థారించారు? ఏ తెవికీ ప్రధాన వాడుకరిలా కాకుండా నేను అందరికీ దూరంగా ఉంటూ, నిష్పక్షపాతంగా ఉండడానికై కనీసం నా సెల్‌ఫోన్ నెంబరు కూడా ఎవరికీ ఇవ్వలేను. ఎవరితోనూ సంప్రదింపులు లేవు, సంబంధాలు లేవు. ఇప్పటివరకు ఏ సమావేశాలకు ప్రత్యక్షంగా హాజరు కాలేను. తెవికీలో నాకు మిత్రులు, శత్రువులంటూ ఎవరూ లేవు. ఆన్‌లైన్ వికీపీడియాలో సేవలకై ఆన్‌లైన్‌లో మాత్రమే నా సేవలందించాను. గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం అప్పుడప్పుడు తెవికీని సందర్శిస్తూ పొరపాట్లను (అది ఎవరిదైనా సరే) నిష్పక్షపాతంగా బయటపెడుతున్నాను. నిష్పక్షపాతంగా నా భావాలను ప్రకటించడానికి ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోలేను. నేను వాడుకరిని కాకుండా వాడుకరి చర్చలపై మాత్రమే దృష్టిపెడతాను. ఒకే వాడుకరికి ఒక సమయంలో పొరపాట్లు బయటపెట్టిననూ మరో సమయంలో ఆయన చర్యలను సమర్థంచిన సంఘటనలూ ఉన్నాయి. నేను చురుకుగా పనిచేసిన కాలంలో మీరు చురుకుగా లేరు కాబట్టి నా గురించి మీకంతగా తెలియదేమో! ఏడేళ్ళ క్రిందట అప్పటి నిర్వాహకులు పొరపాట్లపై పొరపాటు చేస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా చర్చలతో సంబంధం ఉన్న నిర్వాహకులే సదరు సభ్యుడిపై, అతను రాసిన వ్యాసాలపై చర్యలకు ఉపక్రమించి ఎలాంటి హెచ్చరిక లేకుండా నిషేధం విధించడం, నిష్కారణంగా చర్చాపేజీలను కూడా తొలగించడం లాంటి తీవ్రతప్పిదాలు చేస్తుంటే సభ్యుడు దీనస్థితిలో ఉన్న దశలో నేను రంగప్రవేశం చేసి నిర్వాహకుల తప్పులను ఎత్తిచూపానే తప్ప సభ్యుడికి, సభ్యుడి వ్యాసాలకు, సభ్యుడి చర్యలకు ఏ దశలోనూ సమర్థంచలేననే సంగతి చర్చల ద్వారా గమనించవచ్చు. ఆ సభ్యుడు చేసింది సరైనదేనని ఎప్పుడూ చెప్పలేను. ఇదే విషయాన్ని నేను అదే చర్చలో స్పష్టంగా పేర్కొన్నాను కూడా. పొరపాట్లు చేసిన నిర్వాహకులైనా, సభ్యులైనా వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వడానికి మాత్రం నాకు మనసొప్పదు. ఈ సంగతి కూడా నేను ఏనాడో పలికాను. సమర్థకుడనే మాటను మాత్రం నేనొప్పుకోను, దీనికై మీ వివరణ కోరుచున్నాను. (ఇప్పుడు కూడా క్రమపద్దతి లో చర్యలు తీసుకోని నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నాను, మళ్ళీ సమర్థన అంటారేమో!!)

2) ఇప్పుడు సభ్యుడు:వైవీఎస్‌రెడ్డి పై వారం రోజుల నిషేధం విధించడం కూడా నిబంధలకు విరుద్దమే. నిబంధనలు ఉల్లంఘించిన సభ్యులపై చర్యలకు నేను వ్యతిరేకిని కాను, కాని తీసుకొనే చర్యలు మాత్రం నిబంధనల ప్రకారం క్రమపద్దతిలో ఉండాలి కాని ప్రస్తుత చర్యలు ఆ దిశలో సాగలేవు. నిషేధం విధించే ముందు హెచ్చరిక జారీచేయడం కనీస భాధ్యత. ఎప్పుడో ఒకప్పుడు ఒక రోజు నిషేధం ఎదుర్కొన్నాడనీ, దాన్ని అవకాశంగా తీసుకొని ప్రస్తుతం హెచ్చరిక లేకుండా ఒకేసారిగా వారంరోజుల నిషేధం విధించడం తగునా? అప్పటి చర్చలకు ఇది కొనసాగింపు కాదు అంటూనే అప్పటి నిషేధాన్ని కొనసాగింపుగా ఇప్పుడు వారంరోజుల నిషేధాన్ని విధించడం ఏ మాత్రం సరైనది కాదని నేను గట్టిగా చెప్పగలను. కనీసం అప్పుడు విధించిన నిషేధమైనా నిబంధనల ప్రకారం జరిగిందా అంటే అదీ కాదు. అది నిర్వాహకుల తప్పిదమేనని నేను ఆనాడే చెప్పాను. ఏదో కారణాల వల్ల నిబంధనలకు విరుద్ధంగా ఏడేళ్ళ క్రితం విధించిన ఒకరోజు నిషేధాన్ని సాకుగా తీసుకొని, గత చర్చలకు ఈ చర్చలు కొనసాగింపు కాదు అంటూనే గతంలో నిషేధం ఎదుర్కొన్నాడనీ ఇప్పుడు హెచ్చరిక లేకుండా నిషేధం విధించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇలా చేయడం నిర్వాహక తప్పిదం గానూ, నిబంధనలు అతిక్రమించినట్లుగానూ పరిగణిస్తున్నాను.

3) సాక్‌పప్పేట్‌ల గురించి చెబుతూ సభ్యుడు:రవిచంద్ర కేవలం అనుమానంతో ఏకంగా వాడుకరి:JVRKPRASAD పేరు బయటపెట్టేశారు. ఇది చాలా పెద్ద తప్పిదం. విచారణ లేకుండా, ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో ఒకరి పేరును బయటపెట్టడం వివాదాలకు దారితీస్తుంది మరియు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తెవికీకి కూడా ఇలాంటి చర్యలు నష్టం కలిగించవచ్చు. సుమారు 12 సం.ల క్రితం నాటి అనుభవం చెబుతాను. అప్పుడు సభ్యుడు:సాయి నిర్వాహక ఎన్నిక వివాదంలో సాక్‌పప్పెట్‌గా అనుమానంతో అప్పుడు చురుకుగా ఉన్న నిర్వాహకుడు దేవా సభ్యుడు:రంగారావు పేరును వ్రాసి మళ్ళీ దిద్దుబాటును రద్దుచేశారు. కాని అప్పటికే జరగరాని ఘోరం జరిగింది (చూడండి). చివరికి స్టీవార్డులను సంప్రదిస్తే ఒక సాక్‌పప్పెట్‌గా నిర్వాహకుడైన సభ్యుడు:రవిచంద్ర పేరు బయటపడింది. (చూడండి). ఈ వివాదం వల్ల చురుకైన నిర్వాహకుడు దేవా మరియు సభ్యుడు:రంగారావు ఇద్దరూ తెవికీకి దూరమైనారు. ఇప్పడు సాక్‌పప్పెట్ గురించి చెప్పాలంటే ఆ సభ్యుడెవరో పసిగట్టడం పెద్ద పనేమీ కాదు. కాని ఆధారాలు లేకుండా పేరు బయటపెట్టడం మాత్రం సరికాదు. గత దశాబ్దం నుంచి వివిధ మార్పుపేర్లతో (కొన్ని సార్లు ఐపి అడ్రస్‌తో) రాస్తున్న ఆ సభ్యుడు చాలా సార్లు తెవికీలో జరుగుతున్న పొరపాట్లను బయటపెడ్డడం చూస్తున్నాం. నేను రాసిన వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 39#సరదా సరదాగాలో కూడా ఆ సభ్యుడి రెండు వాక్యాలున్నాయి (సభ్యుడిగా మరియు ఐపీ అడ్రస్‌తో). అసలు సభ్యనామంతో చెబితే సంబంధాలు చెడిపోతాయనే ఉద్దేశ్యంతోనే మారుపేరుతో రావడానికి కారణమేమో! ఇదే అభిప్రాయం గతంలో చర్చలలో నమోదైనట్లు గుర్తుంది. మన "మారుకరి" సీనియర్ సభ్యుడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొనియుంటే స్టీవార్డులకు కూడా చిక్కకపోవచ్చు.

4) మరో సభ్యుడు "నిర్వాహకులు లెక్కకు 10 మందికి పైగా ఉన్నారు.అందరికి భాధ్యత ఉంది.కొంత మంది స్తబ్థతగా ఉంటున్నారు.దాని వలన వికీపీడియాకు ఏమి ప్రయోజనమో ఆలోచించాలి" అంటూ రాశారు. ఇది ఎవరెవరిని ఉద్దేశించి చెప్పబడిందో కాని నిర్వాహకులంటే తమ వ్యక్తిగత పనులు మానుకొని తప్పనిసరిగా తెవికీలో పనిచేయాలని ఏమీలేదు. ఎవరి వ్యక్తిగత ఇబ్బందులు వారికుంటాయి. తెవికీలో పని చేసేవారు చేస్తారు, చూసేవారు చూస్తారు, చదివేవారు చదువుతారు, అంతే. తెవికీలో నిర్వాహకుల హోదా ఉన్నవారిని మిగితా నిర్వాహకులెవరూ పెంచిపోషించడం లేదుకదా! ఇది స్వచ్ఛందంగా చేసే ప్రవృత్తి మాత్రమే. ఇప్పుడు చురుకుగా లేని నిర్వాహకులలో అధికమంది ఒకానొక సమయంలో తెవికీని అభివృద్ధి పర్చడానికి భుజాలనెత్తుకున్నవారే. అప్పుడు నిర్వాహకులు తెవికీని ప్రగతిపథంలో పయనింపజేసి ఈ స్థితికి తెచ్చారనే విషయం కూడా మరవొద్దు. చాలా కాలం నుంచి చురుకుగా లేనట్లయితే ఎలాగూ నిర్వాహక హోదా నుంచి తొలగించబడతారు. అసలు చురుకుగా ఉంటూ కూడా నిర్వాహక పనులు చేయని నిర్వాహకులెవరో వారిపై దృష్టిసారించాలి. నిర్వాహకులు అంటే ఎల్లకాలం తెవికీలోనే కృషిచేయాలనీ, ఇదివరకు చేసింది గ్రహించక ఇప్పుడు మేము చేస్తున్నాము కాబట్టి అందరూ చేయాలనే అభిప్రాయంతో ఉండటం ఏ మాత్రం సరైనదికాదు. ఇప్పుడు చురుకుగా ఉన్న ఒక నిర్వాహకుడు మధ్యలో చాలా కాలం పాటు స్తబ్దుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్తబ్దుగా ఉన్నవారు తర్వాతి దశలో చురుకుగా మారవచ్చేమో! లేకుంటే హోదానే కోల్పోతారు, అంతేకాని ఇతరులపై చెప్పడం సరికాదు.

5) ఒక సభ్యుడు చిన్న వ్యాసాలను సిగ్గుపడే వ్యాసాలుగా పేర్కొనడం కూడా జరిగింది. కాని వాస్తవంగా పాఠకులు సిగ్గుపడేది నాణ్యమైన చిన్నవ్యాసాలు కాదు, పెద్దవ్యాసాలలో తాజాకరణలేని అంశాలు, పొరపాట్లు తెవికీలో బోలెడన్ని ఉన్నాయి ("మారుకరి"-మారుపేరుతో వ్రాసే వాడుకరి కూడా ఇటీవల ఇదే విషయాన్ని బయటపెట్టారు). ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వానికి తాజాకరణ అత్యావశక్యం. పెద్దవ్యాసాలు వ్రాసి (కాదుకాదు మక్కికిమక్కిఅనువదించి) పడేస్తున్నారు కాని తాజాకరణకు ఎవరూ పూనుకోవడం లేదు. ఉదా:కు పదేళ్ళ క్రితం మరణించిన వ్యక్తిని కూడా ఇంకనూ దేశాధినేతగానే కీర్తిస్తున్నాం. సిగ్గుపడాల్సింది ఇలాంటి విషయాలలోనే.

6) ప్రతీదానికి ఆంగ్లవికీని ప్రామాణికంగా తీసుకొనే మెజారిటీ నిర్వాహకులు ఈ విషయంలో మాత్రం చిన్న వ్యాసాలపై కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో సరైన కారణాలు లేవు. తెవికీ అనేది ఏ కొందరి నిర్వాహకుల సొత్తు కాదు. ఇక్కడ రచనలు చేయడానికి అందరికీ హక్కు ఉంది (ప్రామాణిక నిబంధనలకు లోబడి). కేవలం పెద్దవ్యాసాలే ఉండాలనడం ఏ మాత్రం సరైనది కాదు (నాణ్యత కల్గిన చిన్న వ్యాసాలకు కొన్ని మినహాయింపులు ఉండాల్సిందే). కేవలం వ్యాసపరిమాణం ఆధారంగా వ్యాసాలు తొలగించడం వికీపీడియా మూలనిబంధనలకు వ్యతిరేకమని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. అదే కారణంతో సభ్యులపై చర్యలు తీసుకోవడం సమస్య తీవ్రతను పెంచుతుంది. దిద్దుబాట్లు చేసే హక్కు, తమ రచనలు వికీలో చూసుకొనే హక్కు విషయంలో ఎవరినీ కాదనలేము. కొన్ని అంశాలపై పెద్ద వ్యాసం వ్రాయడం కూడా కుదరకపోవచ్చు. పెద్దపెద్ద విజ్ఞాన సర్వస్వాలలో కూడా చిన్నచిన్న వ్యాసాలు మస్తుగా ఉన్నాయి. ఈ విషయంలో తెవికీలో దశాబ్దాల నుంచి ఎడతెగని చర్చలు సాగుతూనే ఉన్నాయి. చిన్న వ్యాసాలపై చర్చలు ఇంకనూ ఒక కొలిక్కి రాలేవు. అలాంటప్పుడు సభ్యులపై, వారి రచించే వ్యాసాలపై చర్యలు తీసుకోవడంలో తొందరెందుకు అన్నదే నా ప్రశ్న. ఈ విషయంలో ఇంకనూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇకముందు దీనిపై పాలసీలు ఖచ్చితంగా మారవచ్చు. అలాంటప్పుడు కేవలం పరిమాణం ఆధారంగా వ్యాసాలను తొలగించడం సరైనది కాదు. కేవలం ఒకట్రెండు వాక్యాలున్న అతిచిన్న వ్యాసాలను తొలగించవచ్చేమో కాని సమాచారం లభించని నాణ్యమైన చిన్న వ్యాసాల విషయంలో తొలగింపులు ఏ మాత్రం సరైనది కాదని నేను గతంలో కూడా చెప్పాను. రేపు పాలసీలు మారి నాణ్యమైన చిన్న వ్యాసాలకు మినహాయింపు ఇచ్చినప్పుడు ఇప్పుడు తొలగించిన నాణ్యమైన చిన్న వ్యాసాల సంగతి ఏమిటి? ఈ సభ్యుల దిద్దుబాట్ల హక్కును హరించినట్లుగా ఎందుకు భావించరాదు? చర్చలు కూడా ఒక కొలిక్కి రానప్పుడు, మూలనిబంధనలకు వ్యతిరేకమైన పాలసీలు ఉన్నప్పుడు దాని ప్రకారం తీవ్రచర్యలు తీసుకోవడం సరైనదేనా? సి. చంద్ర కాంత రావు- చర్చ 06:20, 24 మే 2020 (UTC)

 

ఎనిమిది నియమాలు - పద్దెనిమిది అనుమానాలు

 (ఫిబ్రవరి 2019 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

నిర్వాహకత్వానికి గణాంకాలను ఆపాదించడానికి క్రింది కారణాల వల్ల నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.
1) నిర్వాహకులను గణాంకాలతో పోల్చలేము. నిర్వహణ అంటే నిర్వహణే. వారు చేసే పనులకు ఏ గణాంకమూ సాటిరాదు. నిర్వాహకులకు గణాంకాలను ఆపాదించడమంటే నిర్వాహకుల హోదాను దిగజార్చడమే అవుతుంది. అసలు కొన్ని నిర్వాహక పనులు గణాంకాలకు ఏ మాత్రం అందవు. కాని అలాంటి పనులే చాలా ముఖ్యమైనవి.
2) నిర్వాహకత్వానికి గణాంకాలు చూపెట్టడమంటే పరోక్షంగా బలవంతం చేయడంగా భావించవల్సి ఉంటుంది. ఇది స్వచ్ఛంధంగా పని చేయాల్సిన వికీ నియమానికి విరుద్ధం. సభ్యులైనా, నిర్వాహకులైనా ఇక్కడ చేసేది స్వచ్ఛంద పనే అనేది అందరికీ తెలిసిందే. స్వచ్ఛందంగా చేసే పనిలో గణాంకాలను అందుకోవాలనీ, లేనిచో మీ నిర్వాహక హోదా పోతుందనీ చెప్పడం సమంజసమేనా?
3) మెరుగైన నిర్వాహకుడు గణాంకాలను చూపడానికి ఇష్టపడడు. అలాంటివారిని నిర్వాహకులుగా తొలగించడం భావ్యమేనా! ఏ నిర్వాహకుడు ఏ సమయంలో ఉపయోగపడతాడో ఊహించలేము. సెలవులో ఉన్న నిర్వాహకుడు కూడా హఠాత్తుగా తెవికీలో వచ్చి ఒక పెద్ద సమస్యను తన నిర్వాహకత్వంతో పరిష్కరించవచ్చు. ఇవన్నీ గణాంకాలకు అందనివి.
4) గణాంకాల వల్ల పోటీ ఏర్పడవచ్చు. నిర్వాహకుల మధ్యన మనస్పర్థలు, వాదోపవాదాలు జరిగే అవకాశాలూ ఉన్నాయి. ఇదివరకు సాధారణ దిద్దుబాట్ల మధ్యనే పోటీ ఏర్పడిన సంగతి కూడా చూశాము. సాఫీగా నడవాల్సిన ప్రక్రియను మనకు మనమే అవాంతరాలు తెచ్చిపెట్టుకునే ఇలాంటి నిబంధనలు చేయకపోవడమే మంచిది.
5) గణాంకాలను చేరుకోజాలనని భావించిన నిర్వాహకుడు స్వచ్ఛంద ఉపసంహరణ చేసి కొంత కాలానికి మళ్ళీ నిర్వాహకుడు అయ్యే అవకాశముంది. మళ్ళీ మళ్ళీ ఉపసంహరణలు చేయడం, నిర్వాహకునిగా చేరడం వల్ల ఇతర నిర్వాహకులకు చికాకుగా అనిపించవచ్చు. తెవికీ సముదాయానికి ఇలాంటి పని భారంగా మారవచ్చు. స్వచ్ఛంద ఉపసంహరణ చేసిన నిర్వాహకుడు మళ్ళీ ఎంతకాలానికి నిర్వాహకుడు కావాలనే కాలం కూడా నిర్దేశించబడలేదు. ఈ అవకాశంతో గణాంకాలను చేరుకోలేని నిర్వాహకుడు ఉద్దేశ్యపూర్వకంగా స్వచ్ఛంద రాజీనామా చేసి కొంతకాలానికే మళ్ళీ సరాసరిగా నిర్వాహకుడౌతాడు. మరో 6 నెలలకు గణాంకాలు సరిపోనప్పుడు మళ్ళీ ఇదేవిధంగా చేస్తూ ఆయారాం గయారాంల మాదిరిగా తయారయ్యే అవకాశాలున్నాయి. (నిర్వాహకులను శంకించడం కాదు కాని ఈ అవకాశం మాత్రం ఉంది అని భావించండి)
6) నిర్వాహకుల గణాంకాల పని చూడటం తెవికీకి అదనపు భారంగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి తెవికీలో నిర్వహణ చేసే చురుకైన సభ్యుల కొరత ఉంది. అలాంటప్పుడు నిర్వాహక గణాంకాలను చూడడమనేది సభ్యులపై మరింత భారం వేయడమే అవుతుంది. దీనితో ఆ మేరకు ఇతర పనులు కుంటుపడటం ఖాయం.
7) గణాంకాల వల్ల చురుకైన సభ్యుల పని వృధా కావడం జరుగుతుంది. గణాంకాలు పరిశీలించడం, ప్రతిపాదనలు చేయడం, సమీక్షలు చేయడం, అభిప్రాయాలు రాయడం ... ఇదంతా వృధాపని కిందనే పరిగణించవచ్చు. చురుకైన సభ్యుల విలువైన కాలాన్ని వృధాచేయడంగానే భావించవల్సి వస్తుంది.
8) గణాంకాలపై మోజుతో ఉండే సభ్యుల వల్ల తెవికీ నాణ్యత ఎప్పుడో తగ్గిపోయింది. ఇప్పుడు గణాంకాల మోజులో పడే నిర్వాహకుల వల్ల నిర్వహణ నాణ్యత తగ్గిపోదనే నమ్మకం ఏమిటి? నిర్వాహకులందరూ గణాంకాలపై మోజుతో ఉన్నవారనీ దీని అర్థం కాదు, కాని ఈ విధంగా చేయరనే నమ్మకం ఏమిటి?
9) నిర్వాహకులు గణాంకాలు చేరుకోవడానికి ఉరుకులు వేయడం, గణాంకాలను చేరుకోలేని నిర్వాహకులను తొలగింపు ప్రతిపాదనలు చేయడం, ఓటింగులు, నిర్ణయాలు ... ఇవన్నీ గమనించే వారికి తమాషాగా, పూర్తి వినోదాత్మకంగా కనిపించడం ఖాయం. దీనికి అదనంగా ప్రక్రియలో దొర్లే పొరపాట్లపై వాదవివాదాలు షరామామూలే. తమాషా చూసేవారికి తెవికీ ఒక సర్కస్‌గా మారినా ఆశ్చర్యం లేదు. పలు చర్చలలో ఇప్పటికే కొందరు వ్యక్తులు కొత్త సభ్యుల అవతారమెత్తి సీనియర్ సభ్యులను సతాయించి తమాషా చూస్తున్నారు, మనకూ చూపిస్తున్నారు కూడా. తెవికీని బాగా పరిశీలించే వారికి ఇవన్నీ అనుభవమే.
10) నిర్వహణకు సరిపడా దిద్దుబాట్లు లేనప్పుడు నిర్వాహకులే కొత్తసభ్యుల అవతారమెత్తవచ్చు లేదా అనామకులు (ఐపీ అడ్రస్‌తో) వ్రాయవచ్చు కూడా. ఇలా చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేము. నిర్వాహకులను శంకించడం కాదు కాని ఈ అవకాశం కూడా ఉన్నదనే విషయాన్ని మాత్రం గుర్తించాలి. ఒక నియమం లేదా పాలసీ చేసేటప్పుడు ఇప్పటి పరిస్థితే కాకుండా భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కూడా ఊహించాల్సి ఉంటుంది. రేపు కొత్తగా వచ్చే నిర్వాహకులు ఎవరు, ఎలాంటివారు అనేది కూడా ఊహించాల్సి ఉంటుంది. ఎందుకంటే పదేళ్ళ క్రితం ఉన్న సభ్యులకు ఇప్పటి సభ్యులకు చాలా తేడా ఉంది. ఇలాంటి వారు రేపు నిర్వాహకులుగా మారరని గ్యారంటీ ఏమిటి? కొత్త సభ్యుల అవతారమెత్తిననూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే స్టీవార్డులకు చిక్కకుండా ఉండటం పెద్దపనేమీ కాదు. ఈ విషయాలన్నీ మనం ముందస్తుగానే పరిశీలించాలి.
11) పోలీసులే దొంగతనాలు చేయించి, దొంగలను పట్టుకొన్నట్లు చూపించి టార్గెట్లను చేరుకున్నట్టు చూపి ప్రమోషన్లు పొందే కథలను నవలలలో చూస్తుంటాము. అదే ప్రక్రియ ఇక్కడ జరగదని నమ్మడం ఏమిటి? దేనికైనా సరే మనం అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి. అలా జరగదు అని అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీలులేదు.
12) అసలు నిర్వాహక ఎడిట్లను ఖచ్చితంగా విభజించలేము. నిర్వాహక ఎడిట్లకు, నిర్వాహకేతర ఎడిట్లకు మధ్య తేడా చూపడానికి ఎలాంటి సరైన కొలమానం చాలా వాటికి లేదు. అలాంటప్పుడు నిర్వాహక ఎడిట్ల సంఖ్య ఆధారంగా చర్యలు తీసుకోవడం ఇబ్బందికర పరిణామాలకు దారితీయవచ్చు. వికీపీడియా పేరుబడితో (రచ్చబండ మినహా) చేసే మార్పులు, మూసలలో మార్పులు, మొదటిపేజీ నిర్వహణ మార్పులు నిర్వాహకులు కాని ఎవరైనా సభ్యులు చేయవచ్చు. ఆ పని సభ్యులే చేస్తే నిర్వాహకులు ఏమి చేయాలి?
13) నిర్వహణ దిద్దుబాట్ల సంఖ్యకు సరిపడా దిద్దుబాట్లు చేయకున్ననూ ఓటింగ్ ద్వారా సముదాయం కొనసాగించవచ్చనే దానికి అర్థం ఏమిటి? ఒకవైపు గణాంకాలు చేరుకోవాలనీ, మరోవైపు గణాంకాలు చేరుకోలేని నిర్వాహకులను ఓటింగ్ ద్వారా కొనసాగించవచ్చనీ భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అంటే తెవికీ సముదాయానికి "నచ్చిన" నిర్వాహకుడు గణాంకాలను చేరుకోవల్సిన అవసరం లేదన్నమాట ! అలాంటప్పుడు గణాంకాలెందుకు? "నచ్చని" నిర్వాహకులను ఎలాగూ ఓటింగ్ ద్వారా తొలగించే అవకాశం ఇప్పటికే ఉంది (కాకుంటే ప్రస్తుతానికి వారు చేసే పొరపాట్లకై ఎదురుచూడాల్సి ఉంటుంది !)
14) సమీక్ష అనంతరం నోటీసు ఇవ్వాలనీ, నోటీసు తర్వాత స్టీవార్డులను తెల్పి తొలగింపు అమలుచేయాలనీ ఉంది. తొలగింపుకే నిర్ణయం అన్నప్పుడు నోటీసు ఎందుకు? నోటీసు ఇస్తున్నామంటే సదసు సభ్యుడి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. మరి అతనిచ్చే వివరణ ఆధారంగా ఏమైనా మినహాయింపులు ఉన్నాయా ? ఉంటే ఎలాంటి మినహాయింపులు ? వివరణ సంతృప్తికరంగా లేనప్పుడు మాత్రమే తొలగింపుకై స్టీవార్డులను సంప్రదించాలి. కాని అభిప్రాయాలలో ఈ విషయం స్పష్టంగా లేదు. ఒకవేళ మినహాయింపులే లేనప్పుడు నోటీసులు ఎందుకు?
15) ఒక నిర్వాహకుడు గణాంకాలను చేరుకోకున్ననూ ఓటింగులో సభ్యుల "సహకారం"తో గట్టెక్కవచ్చు. మరో నిర్వాహకుడు తొలగింపునకు గురికావచ్చు. అంటే ఇక్కడ గణాంకాలు ముఖ్యమా? ఓటింగ్ ముఖ్యమా? ఓటింగే ముఖ్యమైతే గణాంకాలెందుకు? గణాంకాలే ముఖ్యమైతే ఆ తర్వాత మళ్ళీ ఓటింగ్ ఎందుకు? ఓటింగులో సంఖ్యకు కాకుండా అభిప్రాయాలకు విలువ ఉంటుంది, ఉండాలి కూడా. అలాంటప్పుడు ఏ ఒక్క సభ్యుడైనా బలమైన వాదన వినిపిస్తే మొత్తం ఓటింగుపై ప్రభావం తప్పకుండా పడుతుంది. మరి ఇంత చేసినా సమస్య మొదటికే వచ్చినట్లు కాదా?
16) గణాంకాలు చేరుకోలేని నిర్వాహకునిపై ముందుగా తొలగింపు చర్చ ప్రారంభించాలి, ఆ తర్వాత ఓటింగు, ఓటింగులో ప్రతిపాదన నెగ్గిన పిదప సదరు నిర్వాహకునికి నోటీసు, తర్వాత నోటీసు పరిశీలన .. చిన్న విషయానికి సుధీర్ఘమైన ప్రక్రియ జరిపిననూ చివరికి సాధించేది అనుమానమే. అలాంటప్పుడు ఈ ప్రక్రియ మొత్తం సభ్యులకు పనిభారమే తప్ప తెవికీకి లభించే నికర ప్రయోజనమేమీ ఉండకపోవచ్చు. నిర్వాహకుడు స్వచ్ఛందంగా వదులుకుంటే ఏమీకాదు, కనీసం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 2 సం.లలో దిద్దుబాట్లు ఏమీ చేయకున్ననూ స్వచ్ఛందంగా వదులుకున్నట్లే, కాని కొత్త నిబంధనల ద్వారా బలవంతంగా నిర్వాహకహోదా తొలగిస్తే మాత్రం నియమాలు బాగా తెలిసిన ఆ తొలగింపు నిర్వాహకుడు తెవికీలో జరిగే నిర్వాహణ లోపాలను కడిగిపారేస్తే అప్పుడున్న నిర్వాహకులు నోరెళ్ళబెట్టాల్సి వచ్చే పరిస్థితిని కూడా మనం ముందుగా ఊహించాలి. లేదంటే కోరి కొరవితో తల గోక్కున్నట్లే అవుతుంది.
17) స్వచ్ఛందంగా చేసే పని కాబట్టి సాధారణంగా తీరిక సమయంలోనే నిర్వాహక పనులు చేస్తుంటారు. కొందరు ఉదయం, కొందరు మధ్యాహ్నం, కొందరు సాయంత్రం, కొందరు అర్థరాత్రి సమయంలో తెవికీకి సమయం వెచ్చిస్తుంటారు. కొత్త సభ్యులు సాధారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే దిద్దుబాట్లు చేస్తుంటారు. పొరపాటు చేసేది ఎక్కువగా కొత్త సభ్యులే కనుక ఆ పొరపాట్లను చక్కదిద్దడానికి ఆ సమయంలోనే నిర్వహణ పనులు చేసేవారికి గణాంకాలు అందుతాయి. అర్థరాత్రి సమయంలో తెవికీకి సందర్శించే నిర్వాహకులకు చేయడానికి ఏమీ ఉండకపోవచ్చు. అలాంటివారు నిర్వాహక హోదాలను త్యజించాల్సిందేనా?
18) గణాంకాలను చేరుకోలేని ఒక నిర్వాహకుడిని తొలగించకుండా ఉండేందుకు ఓటింగ్ ద్వారా అవకాశం ఉంది. అంటే నిర్వహణ గణాంకాలు లేకున్ననూ కొనసాగవచ్చన్న మాట (అదీ ఎవరైనా ప్రతిపాదన చేసినప్పుడే, తొలగింపు ప్రతిపాదన చేయనప్పుడు అదీ ఉండదు). మరి ఎవరిని బలి చేయడానికి ఈ నిబంధనలు. ఇదివరకే చెప్పినట్లు రెండేళ్ళవరకు తెవికీలో చురుకుగా లేనివారు ఎలాగూ తొలగింపునకు గురౌతారు. అంతకాలం కూడా ఆగడానికి మనకు ఓపిక లేనట్లయితే ఒక సంవత్సరంగా మార్చుకోవచ్చు. అంతేకాని ఈ గణాంకాల గారడీలెందుకు? గణాంకాలు చూపని నిర్వాహకులు తెవికీకి భారమేమీ కాదు. నిబంధన పెట్టి గణాంకాలు చూపాలన్ననూ అలాంటి నిర్వాహకులు గణాంకాలు చూపెడతారనే నమ్మకమూ ఉండదు. మొత్తానికి ఈ పాలసీ ప్రతిపాదన ఉద్దేశ్యమేమిటి?
గమనిక: చర్చలో ఏ సభ్యుడైనా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించవచ్చు. ఇది ప్రజాస్వామ్య పద్దతి. తెవికీకి కూడా ప్రజాస్వామ్య పద్దతులే పునాది అని గమనించగలరు. పై అభిప్రాయాలను తేలిగ్గా కొట్టిపారేయకుండా బాగా ఆలోచించండి. ఈ అభిప్రాయాలన్నీ తెవికీ సంస్కరణలకేనని భావించండి. వ్యతిరేక అభిప్రాయాలు ఇచ్చానని కాకుండా ఎందుకు ఇచ్చాననే విషయం కూడా ఆలోచించండి. సమర్థన అభిప్రాయాలకన్నా, విమర్శనాభిప్రాయాలే పాలసీల రూపకల్పనకు, భవిష్యత్తులో జరగబోతే విపత్పరిణామాలకు బాగా దోహదపడతాయని గ్రహించండి. కొన్ని అభిప్రాయాలలో నిర్వాహకులను శంకించడం కాదు కాని అలాంటి అవకాశాలూ ఉన్నాయనీ అర్థం చేసుకోండి. తెవికీ ప్రగతే ముఖ్యం కాబట్టి రేపు నిర్వాహకుల మధ్య వాదోపవాదాలు జరగకుండా, నిర్వాహకుల విలువైన సమయం వృధాకాకుండా, నిర్వహణ గణాంకాలపై గందరగోళం తలెత్తకుండా, నిర్వాహకుల మధ్య దిద్దుబాట్ల పోటీలు ఏర్పడకుండా, గణాంకాలను చేరుకోలేని నిర్వాహకులకు బాధ కలుగకుండా ... తదితర కారణాలతో ఈ పాలసీ రూపకల్పనకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:20, 17 ఫిబ్రవరి 2019 (UTC) 

తెవికీ గ్రామవ్యాసాలు - ఒక పరిశీలన

 (ఏప్రిల్ 2019 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

తెవికీలో గ్రామవ్యాసాలనేవి మొత్తం వ్యాసాలలో సుమారు 30% వరకు ఉంటాయి. పదేళ్ళ క్రితం నేను తెవికీలో ప్రవేశించే నాటికి గ్రామవ్యాసాలన్నీ ఏక వాక్య వ్యాసాలే. వాటిని కూడా బాటుద్వారా చేర్చారు. గ్రామవ్యాసాలకు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా నేను వాటిని అభివృద్ధిపర్చాలని ముందుగా మండలాల మూసలు తయారుచేసి వ్యాసాలలో పెట్టే పనిని ప్రారంభించాను. తర్వాత బాటుద్వారా అన్ని గ్రామవ్యాసాలలో చేర్చబడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలోని చాలా గ్రామవ్యాసాలను కొంతవరకు అభివృద్ధి చేశాను. కొంతకాలానికి మరికొందరు సభ్యులు తెవికీలో ప్రవేశించారు. అసలుకథ అప్పుడే మొదలైంది. గ్రామవ్యాసాలలో ఇన్ఫోబాక్సులు, జనగణన తదితర చేర్చాలని నిర్ణయం తీసుకున్నాకా వైజాసత్యగారు బాటుద్వారా వాటిని చేర్చగలనని చెప్పిన పిదప కూడా కొందరు సభ్యులు ఎంత వారించిననూ వినకుండా ఏకపక్షంగా ప్రతిపేజీలో ఖాళీ విభాగాలు చేర్చడం, అసంపూర్తి ఇన్ఫోబాక్సులు చేర్చడం లాంటివి మానవీయ్ంగా పెట్టారు. వారి అత్యుత్సాహం వల్ల ఆ సమయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. అది మొదలు, ఆ తర్వాత గ్రామవ్యాసాలపై దిద్దుబాట్ల దాడి మొదలై అప్రతిహితంగా కొనసాగుతూనే వస్తోంది. అప్పుడు నాణ్యత గురించి చెప్పిన సూచనలు ఎవరూ పట్టించుకోలేరు. సంవత్సరాల తరబడి గ్రామవ్యాసాలపై దిద్దుబాట్ల దాడి జరిగి గ్రామవ్యాసాలనేవి కేవలం వ్యాస పరిమాణం పెరగడానికీ మరియు సభ్యుల దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవడానికే తప్ప ఎలాంటి ఉపయోగం లేనట్లుగా తయారయ్యాయి. వ్యాసాలనేవి పరిమాణంలో కాకుండా నాణ్యతలో మెరుగుపడాలని చేసిన సూచనలన్నీ వృధాప్రయత్నాలుగానే మిలిగిపోయాయి. గ్రామవ్యాసాలలో కొందరు సభ్యులు ఇచ్చిన లింకులు కూడా అనవసర లింకులే. గ్రామవ్యాసాలను నాణ్యమైనవిగా తయారుచేయడానికి నేను స్వయంగా జిల్లాస్థాయి అధికారుల నుంచి సమాచారం తీసుకొని, ప్రతిగ్రామవ్యాసంలో గ్రామస్థానపు చిత్రాన్ని తయారుచేసి కొన్ని మండలాలలో చేర్చినపిదప కూడా గ్రామవ్యాసాలపై అనవసర దిద్దుబాట్ల దాడులవల్ల ప్రక్కకు జరగాల్సి వచ్చింది. ఒకానొకదశలో అర్జునరావుగారు కూడా గ్రామవ్యాసాలను తొలగించాలని చేసిన ప్రతిపాదనను ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక పేజీ ఉండటానికి అభ్యంతరపర్చిన సమయంలో నేను తీవ్రంగా వ్యతిరేకించాను కాని చివరకు గ్రామవ్యాసాలు చూడలేకపోయే ఈ స్థితికి వస్తాయని మాత్రం ఊహించలేకపోయాను. ప్రస్తుత స్థితిలో గ్రామవ్యాసాలు కేవలం పరిమాణంలోనే పెద్దవిగా ఉన్నట్లుగా, పట్టికలలోని సమాచారమే వ్యాసాలలో చేర్చబడినట్లుగా, నాణ్యత లేనట్లుగా అర్జునగారు వెలిబుచ్చిన అభిప్రాయాలకు నేను పూర్తిగా మద్దతు తెల్పుతున్నాను. గ్రామవ్యాసాల లోపాలపై సభ్యుడు:పవన్ సంతోష్ చేసిన సవాలు ఆధారంగా ఆయనే ఇచ్చిన మేడపల్లి (నల్లబెల్లి) వ్యాసాన్నే (23-04-2019 నాటి స్థితి) పరిగణలోకి తీసుకుని సమీక్ష జరిపాను. దాదాపు అన్ని గ్రామ వ్యాసాలు ఇదేరకమైన లేదా ఇంతకంటే అధ్వానస్థితిలో ఉన్నాయన్న సంగతి కూడా గ్రామవ్యాసాలు పరిశీలించినవారికి తెలుస్తుంది. (కొందరికీ ఇలాంటి వ్యాసాలే నచ్చుతుంటే అది వారి అభిప్రాయం) కేవలం ఏదో ఒకటి రెండు వ్యాసాలని కాకుండా వేలాది వ్యాసాలలో అప్రయోజకరమైన మరియు అసమగ్రమైన సమాచారం ఉండుట అనేది ఏ మాత్రం మెచ్చుకోదగిన లేదా సమర్థించుకోగల్గిన పరిస్థితి కాదు.

పట్టికలలో ఉన్న సమాచారమే వాక్యాలుగా పేరాలలో చేర్చబడింది కాని ఈ సమాచారం విజ్ఞానసర్వస్వానికి యోగ్యమైన సమాచారం కాదు. సాధారణంగా ప్రభుత్వం తరఫున ముద్రించే లేదా విడుదల చేసే పట్టికల సమాచారం ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినదై ఉంటుంది. అలాంటి ఏదో ఒక కాలానికి మాత్రమే వర్తించే సమాచారం ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వానికి తగునా అని పరిశీలించడం అత్యావశక్యం. ప్రస్తుత కాలంలో రోజురోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. మారిన పరిస్థితులకనుగుణంగా సమాచారం కూడా మార్చాల్సి ఉంటుంది కాని ఎప్పటిదో పాతబడిన సమాచారం, అదీ అసమగ్రమైన అంటే ఖచ్చితమైన సమాచారం ఇవ్వని వాక్యాలు చేర్చడం ఎంతవరకు అవసరం, ఎంతవరకు సమంజసం అనేది నిర్ణయించుకోవాలి. తెలంగాణ అవరతణ అనంతరం జాతీయ రహదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు తెవికీ గ్రామవ్యాసాలలో 10 కిమీ పైబడి దూరంలో జాతీయ రహదారులున్నాయని చెప్పే గ్రామాలు కూడా జాతీయ రహదారులపైనే ఉన్నాయి. అలాగే విద్యుత్ సరఫరా, పారిశుద్ద్యం, నీటి సరఫరా తదితర విషయాలలో కూడా చాలా మార్పులు జరిగాయి. ఇప్పటి వాస్తవ సమాచారానికి తెవికీ సమాచారానికి గ్రామవ్యాసాలలో విపరీతమైన తేడాలున్నాయి. అయితే ఇప్పుడు కేవలం ఒక్క మేడపల్లి (నల్లబెల్లి) వ్యాస సమాచారం ఆధారంగానే సమీక్ష జరిపాను. కాని ఈ లోపాలు ఇలాంటి పొరపాట్లు ఉన్న వేలాది గ్రామవ్యాసాలకు వర్తిస్తుంది. కేవలం ఏదో ఒకట్రెండు వ్యాసాలలో పొరపాట్లు ఉన్నాయని కాకుండా వేలాది గ్రామవ్యాసాలలో ప్రక్షాళన కోసమే ఈ సమీక్ష. సమీక్షలో తెలిపిన అభ్యంతరకర వాక్యాలు, అస్పష్టమైన మరియు అసమగ్రమైన సమాచారం తొలగిస్తే ఇక మిగిలేది ఎంత అనేది కూడా సభ్యులు గ్రహించాలి. అసలు గ్రామ వ్యాసంలో నాణ్యమైన సమాచారం ఉన్న వాక్యాలెన్ని అనేవి కూడా లెక్కపెట్టండి. అవసరమైతే ఇదే గ్రామవ్యాసం ఎలా ఉండాలో (ఎలా వ్రాయాలో) నేను వ్రాసి చూపించగలను. (గ్రామవ్యాసంలోని అభ్యంతర వాక్యాలు, దానికి ముందు బ్రాకెట్లలో నా అభ్యంతరం కూడా వ్రాశాను. చర్చను కొనసాగించేవారు ఈ చర్చను విడదీయకుండా నా సంతకం క్రిందుగా మాత్రమే వ్రాయండి)

1) గ్రామంలో నాలుగుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. (ఇది ఎప్పటి సమాచారం, ప్రస్తుతానికి ఇది సరైనదేనా? ఏటా పుట్టగొడుగుల్లా గల్లీకొకటి పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల సంఖ్యకు కొలమానం ఏమిటి? అసలు బాలబడులంటే ఏమిటి ? నర్సరీలా, ప్రాథమిక పాఠశాలలా?)
2) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. (గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయా? ప్రాథమికోన్నత అంటే ఏమిటి ? మాధ్యమిక అంటే ఏమిటి ?)
3) ... ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వరంగల్లోనూ ఉన్నాయి. (50 కిమీ దూరం వరకు డిగ్రీ కళాశాల ఇప్పటికీ లేదా? మరి 15 కిమీ దూరంలో ఉన్న నర్సంపేట గ్రామవ్యాసంలో డిగ్రీకళాశాల ఉన్నట్లుగా వ్రాయబడింది కదా! నల్లబెల్లి మండలంలోని శనిగరం (నల్లబెల్లి), ముచింపుల వ్యాసాలలో సమీప డిగ్రీ కళాశాల నర్సంపేట అని కూడా వ్రాయబడింది.)
4) మేడపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. (ఎప్పటికీ 5గురు సిబ్బందే ఉంటారా ? ఇది నమ్మశక్యంగా లేదు)
5) ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. (డాక్టర్లు ఎప్పుడూ ఉండరా? పారామెడికల్ సిబ్బంది ఎప్పుడూ ఒకరే ఉంటారా?)
6) ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు (సర్వకాలం ఒక డాక్టరే, ఒక పారామెడికల్ సిబ్బందే ఉంటారా?)
7) సంచార వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. (సంచార వైద్యశాల అంటేనే స్థిరంగా లేనిది. అది ఒకచోటు నుంచి మరో చోటుకు వెళుతూ సేవలను అందిస్తుంది. మరి ఆ సంచార వైద్యశాల ఈ గ్రామంలోకి ఎందుకు ప్రవేశించదు? ఈ గ్రామంలో ఎందుకు సేవలందించదు? ఈ గ్రామానికి 5 కిమీ లోపు ఎప్పుడూ రాదా? 10 కిమీ దూరం వదిలి వెళ్ళదా?)
8) గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. (ఇది ఎప్పటి సమాచారం ? ఇప్పటికీ మూడే ఉన్నాయా? ముగ్గురికీ ఇప్పటికీ డిగ్రీ లేదా?)
9) రెండు మందుల దుకాణాలు ఉన్నాయి. (ఇదెప్పటి సమాచారం ? చిన్న గ్రామంలో 2 మెడికల్ షాపులున్నాయంటేనే గ్రేట్ ! సాధారణంగా చిన్న గ్రామాలలో ప్రత్యేకంగా మెడికల్ షాపులుండవు, కిరాణా షాపులలోనే కొన్ని ముఖ్యమైన మందులను మాత్రం అమ్ముతారు. లేదా అక్కడి వైద్యులే మందులను కూడా ఉంచుకుంటారు. దీనికి తాజా ఆధారం కావాలంటే ఎలా చూపించాలి?)
10) గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. (వేసవిలో కూడానా? )
11) బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. (పై వాక్యానికి దీనికి తేడా స్వల్పం, చేతిపంపులైనా, పవర్ బోర్లైనా బోరింగులే కాని దీనికి తాజా పరిస్థితి ఆధారం ఎలా చూపించాలి?)
12) గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. (పెద్ద పట్టణాలలోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేనప్పుడు గ్రామాలలో ఉన్నదనుకోవడం అనుమాస్పదమే ! దీనికి తాజా ఆధారం ఎలా అందించాలి?)
13) మేడపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. (పోస్టాఫీసు సౌకర్యం గ్రామంలోనే ఉన్నప్పుడు సబ్-పోస్టాఫీసు దూరం గురించి వ్రాసే అవసరం ఉన్నదా?)
14) పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (పోస్టాఫీసు సౌకర్యం గ్రామంలోనే ఉంది అనే వాక్యం ఉన్న తర్వాత మళ్ళీ 10 కిమీ పైబడి దూరంలో ఎందుకు? ఇక టెలిగ్రాఫ్ విషయానికి వస్తే అసలు భారతదేశంలో ఎక్కడైనా టెలిగ్రాఫ్ సౌకర్యం ఉన్నదా? ఈ ఒక్క పాయింటు చాలు సమాచారం ఎంత పాతదో తెలుసుకోవడానికి !)
15) గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. (ప్రధాన రహదారి అయితే తప్ప అన్ని గ్రామాలకు ఆర్టీసి సౌకర్యం ఉండదు, ఈ గ్రామం గురించి నాకు తెలియదు కాని ఇలాంటి సమాచారమే ఉన్న నాకు తెలిసిన మల్ రెడ్డిపల్లి (తాండూరు మండలం) గ్రామవ్యాసంలోని సమాచారం చూస్తే పూర్తిగా తప్పు అని చెప్పగలను)
16) వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. (ఇలాంటి వాక్యాల తాజాకరణకు ఆధారం లభ్యమౌతుందా? ఎలా నిరూపించాలి ?)
17) రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (10 కిమీ పైబడి అని కాకుండా సమీప రైల్వేస్టేషన్ పేరు ఇస్తే వ్యాసానికి బలం చేకూరుతుంది, కేవలం పట్టికలలోని సమాచారం మాత్రమే వాక్యాలుగా పేరాలలో చేర్చడం వల్ల వ్యాస నాణ్యత దిగజారింది. రైలురవాణా గురించి భూత్పూర్ గ్రామవ్యాసంలో నేను వ్రాశాను చూడండి)
18) గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. (ఇది సాధారణ సమాచారం మాత్రమే, విజ్ఞానసర్వస్వానికి ఇలాంటి సమాచారం తగదు. కనీసం ఏయే రకం రోడ్లు ఎంత పొడవు కలిగిఉన్నాయో వ్రాసినా బాగుండేది.)
19) రోజువారీ మార్కెట్, వారంవారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. (దూరం కాదు అది ఎక్కడనేది ముఖ్యం, అది తెలిస్తేనే సమాచారం చేర్చబడాలి కాని పట్టికలలోని సమాచారం చేర్చడం సరైనది కాదు)
20) ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. (ఒక గ్రామానికి సమీప ఏటీఎం, సమీప బ్యాంకు ఎక్కడనేది ముఖ్యమైన సమాచారమే కాని కేవలం దూరం మాత్రం తెలపడం అనవసరం. 10 కిమీ పైబడి అంటే అది ఖచ్చితమైన దూరం కూడా కాదు. అది ఎక్కడైనా ఉండవచ్చు. ఇలాంటి సమాచారం కూడా సాధారణ సమాచారంగానే పరిగణించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాక్యాలనేవి అనవసర సమాచారం కిందికే వస్తాయి)
21) వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (గ్రామంలో పండిన పంటలను అమ్ముకోవడానికి సమీప వ్యవసాయ మార్కెట్ కమిటి ఎక్కడుంది అనేది ముఖ్యమైన సమాచారమే కాని ఇక్కడ కూడా 10 కిమీ దూరంలో ఉంది అని ఇవ్వడం ఏ మాత్రం ఉపయోగకరమైన సమాచారం కాదు. 10 కిమీ పైబడి దూరంలో ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఇది సాధారణ సమాచారం కిందికే పరిగణించడం జరుగుతుంది)
22) అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. (అసెంబ్లీ పోలింగ్ స్టేషన్ అనేది ఒక కార్యాలయం కాదు. అసెంబ్లీ అయినా, లోక్‌సభ అయినా, గ్రామపంచాయతీ / ఎంపీటీసి/ జడ్పీటీసి ఇలా ఏ ఎన్నికలైనా గ్రామంలో ఉండే ఒక పాఠశాలనో మరేదో అందుబాటులో ఉన్న భవనాన్నో తాత్కాలికంగా పోలింగ్ బూత్‌గా చేస్తారు అంతేకాని శాశ్వతంగా ఏ గ్రామంలోనూ పోలింగ్ స్టేషన్లు ఉండవు. అలాగే జనన మరణాల నమోదు కార్యాలయం కూడా ఎక్కడా ప్రత్యేకంగా ఉండదు. సాధారణంగా ఈ పని గ్రామపంచాయతీలే నిర్వహిస్తాయి)
23) ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. (గ్రామాలలో ఆటలాడటానికి మైదానాలకు కొదువేమీ ఉండదు కాని స్టేడియం అన్నప్పుడు మాత్రం ఎక్కడుందో చెప్పాలి)
24) సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. (10 కిమీ పైబడి ఎలాగూ ఉంటుంది. అది ఎక్కడ అనేదే ముఖ్యం) గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. (ఈ కాలంలో గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉంటే అది ప్రత్యేకత కాదు, ఏదేని గ్రామంలో విద్యుత్ సరఫరా ఇప్పటికీ లేనట్లయితేనే అది ప్రత్యేకత కిందికి వస్తుంది. విద్యుత్ సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది. సమీప విద్యుత్ సబ్‌స్టేషన్ ఎక్కడ లాంటి సమాచారం ఇస్తేనైనా ఉపయోగకరం.)
25) రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. (తెలంగాణలో వ్యసాయానికి, వాణిజ్య అవసరాలకు 24 గంటల సరఫరా ఉంది, తెలంగాణలో ప్రస్తుతం విద్యుత్ కొరత ఏమీ లేదు కాబట్టి ఈ సమాచారం ప్రస్తుతానికి వర్తించదు మరియు తప్పుడు సమాచారంగా పరిగణించవచ్చు)
26) విజ్ఞానసర్వస్వం అందులోనూ ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వం అన్నప్పుడు తాజాకరించిన నాణ్యమైన సమాచారం ఉండాలి కాని అస్పష్టమైన, నిరుపయోగమైన, తాజాకరణ లేని సమాచారం ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
27) తెవికీలోని వ్యాసాలు తాజాకరించిన సమాచారంతో ఆధారం చూపగలిగేలా ఉండాలి కాని గ్రామవ్యాసాలు ఇటు తాజాకరణ లేవు అటు తాజా ఆధారమూ లేదు
28) తెవికీలోని వ్యాసాలలోని వాక్యాలపై అనుమానం ఉంటే ఎవరైనా ఆధారం కోరబడినది మూస పెట్టవచ్చు. కొంతకాలం వరకు సరైన ఆధారం చూపబడినచో ఆ వాక్యాలను తొలగించవచ్చు. అలాంటప్పుడూ గ్రామవ్యాసాలలోని అధికభాగం తొలగింపునకు గురికావడం ఖాయం. అధిక సంఖ్యలో ఇలాంటి వాక్యాలు చేర్చడం సరైనది కాదు.
29) అసలు మేడపల్లి గ్రామచరిత్ర ఏమిటి ? ఆ గ్రామంలోని పురాతన దేవాలయాలు ఏవి ? ఏమైనా ప్రాచీన శాసనాలు లభించాయా ? గ్రామప్రముఖులెవరు ? ఇటీవల జరిగిన సంఘటన ముఖ్యాంశాలు, చెరువులు, కాలువలు, నదులు (ఏవైనా ఉంటే) తదితరాలు చేరిస్తే వ్యాసం నాణ్యత మెరుగుపడుతుంది. అంతేకాని అక్కడి ప్రజలకు కాని పాఠకులకు కాని గ్రామ సమాచారం తెలుసుకోగోరే ఔత్సాహికులకు గానీ ఏ మాత్రం ఉపయోగపడని సమాచారం చేర్చడం వల్ల ప్రయోజనం ఏమిటి? (వ్యాస పరిమాణం పెరగడం తప్ప, వ్యాసాలు రచించేది పాఠకుల కొరకే కాని మన దిద్దుబాట్ల సంఖ్యకోసం కాదు, ఇన్నిబైట్ల సమాచారం చేర్చామని చెప్పుకోవడం కోసం కాదు)
30) పట్టికలలోని సమాచారమే వ్యాసాలలో చేర్చబడింది అనేదానికి మరో మంచి ఉదా: దుగ్గొండి గ్రామవ్యాసంలో ఉన్న "ఇది మండల కేంద్రమైన దుగ్గొండి నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది." అనే వాక్యం. (అంటే అదే గ్రామం అదే గ్రామం నుంచి సున్నా కిమీ దూరంలో ఉంది!! ఇదీ ఒక సమాచారమేనా?)
31) వికీపీడియా లాంటి ఆన్‌లైన్ విజ్ఞానసర్వస్వాలలో సమాచారం లేకుండుట కంటే తప్పుడు లేదా అసమగ్ర సమాచారం ఉండుట పొరపాటు. గ్రామస్థులు కాని ఆ గ్రామ సమాచారం తెలుసుకోగోరే ఔత్సాహికులు కాని ఆశించేది, వారికి మనం అందించేది సమగ్రమైన మరియు వాస్తవ సమాచారమే కాని ఎప్పటిదో పాత సమాచారం కాదు, స్పష్టంగా వివరించని అసమగ్ర సమాచారమూ కాదు. వ్యాసాలలో పాఠకులు చూసేది, ఆశించేది, కోరుకొనేది, మెచ్చుకొనేది సమగ్రమైన సమాచారమే కాని వ్యాస పరిమాణం కానేకాదు. ఇలా ఏ రకంగా చూసిననూ వ్యాసాలకు రాశి కంటే వాసియే ముఖ్యమని ప్రతి ఒక్కరు గ్రహించినప్పుడే తెవికీ బాగుపడుతుంది.
గమనిక: పై పాయింట్లన్నీ అభ్యంతరాలు కావు. అందులో కొన్ని అనుమానాలు, సందేహాలు కూడా ఉన్నాయి. గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:51, 24 ఏప్రిల్ 2019 (UTC)

 

నిర్వాహకత్వానికి గణాంకాలెందుకు ?

 (ఫిబ్రవరి 2019 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

తెవికీలో చురుకైన నిర్వాహకుల కొరత చాలా కాలం నుంచి ఉన్నదే. దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ పనులు చేయకపోవడం ఒకరకమైతే, ఇతర (స్వంత) పనులవల్ల తెవికీ సెలవులో ఉండటం మరొకటి. నిర్వాహణ పనులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం, నిర్వహణకై సభ్యుల నుంచి విమర్శలు, చివాట్లు ఎదుర్కోవడం, నిర్వాహణ చేసిన వారిపైనే తోటి నిర్వాహకులు దాడిచేయడం ముఖ్యమైన మరొక్కరకం. దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం తెవికీలో నిర్వాహకులు పలువులు ఉన్ననూ నేను చురుకైన నిర్వహణ నిర్వహించాను. అదే సమయంలో సభ్యుల నుంచి చీవాట్లు కూడా ఎదుర్కొన్నాను. నిర్వహణ ఇబ్బందులు నిర్వహణ చేసేవారికే తెలుస్తుంది. తోటి నిర్వాహకుల నుంచి ఎలాంటి సరైన సహకారం లేకపోవడం, పైగా పొరపాట్లు చేసిన వారికే మద్దతు తెల్పడం తదితర కారణాలతో నా నుంచి నిర్వహణ పనులు తగ్గిపోయాయి. నేను నిర్వహణ మానివేయుటకు కొంతముందు కూడా సరైన ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్ళి ఒక సభ్యుడిని పలుమార్లు హెచ్చిరించి తన ధోరణి ఎంతకూ మార్చుకోనందున ఒకరోజు, ఆ తర్వాత 3 రోజులు, ఆ తర్వాత వారం రోజులు నిరోధం విధించాను. వారం రోజుల నిరోధం రెండుమూడు రోజుల్లో పూర్తి అవుతుందనగా తోటి నిర్వాహకులే ఆ సభ్యునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ నిరోధం తొలగించాలని ప్రతిపాదించడం నా నిర్వహణ పనులకు అడ్డంకిగా మారింది. ఎవరో ఒక తప్పు చేయగానే నేనేమీ చర్యలు తీసుకోలేను. చాలా కాలం నుంచి మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేస్తూ, ఎంత చెప్పిననూ ధోరణి మార్చుకొనక నిర్వాహణకు ఇబ్బందిగా మారినప్పుడు కూడా తోటి నిర్వాహకులు సహకరించకపోవడం ఇంతగా కాకున్నా కొంతైనా మునుపటి నుంచే కొనసాగుతోంది. రచ్చబండలో, నిర్వాహకుల నోటీసుబోర్డులో వివరించినప్పుడు వ్యాఖ్యానించని నిర్వాహకులు నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు భిన్నంగా వ్యాఖ్యానించడం సమంజసం అనిపించలేదు. ఒకానొకప్పుడు నేను ఒంటిచేత్తో నిర్వాహక పనులు కూడా చేసిన సంగతి అప్పటి సభ్యులకు బాగా తెలుసు. కేవలం నిర్వహణ కోసమే ఎంతో కాలం నా సమయం వెచ్చించాను. తెవికీకి ఒకప్పుడు పాఠకులు బ్రహ్మరథం పట్టారంటే నా వంతు కృషి కూడా ఉందని నమ్ముతున్నాను. వ్యాస నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ తెవికీని నాణ్యమైన విజ్ఞానసర్వస్వంగా మార్చడానికి అహరహం కృషిచేశాను. చివరికి తోటి నిర్వాహకులు అడ్డుతగిలి నన్ను నిర్వహణ పనుల నుంచి దూరం చేశారు. అయిననూ నేనేమీ తెవికీకి శాశ్వతంగా దూరం కాలేను. తోటి నిర్వాహకుల ధోరణి నచ్చనందుకు తాత్కాలికంగా మాత్రమే పక్కకు జరిగాను. తెవికీలో మళ్ళీ చురుకుగా ఉండాలనీ, రోజూ నిర్వహణ పనులు చేయాలనీ, తెవికీని చక్కదిద్దాలనీ, తెవికీకి పూర్వవైభవం తీసుకురావాలనీ నా మనసు ఉబలాటపడుతోంది. కాని ఇప్పుడు నిర్వహణ పనులు చేయడం లేదనీ ఏకంగా నిర్వహకత్వానికే ఎసరు తీసుకురావడం వింతగా తోస్తోంది. అసలు దిద్దుబాట్లు చేస్తూ కూడా నిర్వహణ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారికే ఈ నిబంధన వర్తింపజేస్తే బాగుంటుందేమో ! రెండేళ్ళవరకు దిద్దుబాట్లు చేయనివారిని ఎలాగూ స్టీవార్డులు తొలగిస్తారు (వారు కూడా ఏకపక్షంగా తొలగించరు. చర్చద్వారా, మెయిల్ ద్వారా సంప్రదిస్తారు). మరి ఈ కొత్త నిబంధనల ఉద్దేశ్యం ఎందుకో తెలియడం లేదు. తెవికీలో నిర్వాహకుల కొరత అంటూనే నిర్వాహకులను తొలగించడం ఎందుకో అర్థం కావడం లేదు. నిర్వహణ పనులు చేసే వారికి ఇబ్బంది కల్గజేయకుండా ఉంటే నిర్వాహకులు స్వచ్ఛందంగా మరియు సంతోషంగా పనిచేస్తారు. నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చు. కొంతకాలం క్రితమే ఇలాంటి సంఘటన కూడా జరిగింది. విజ్ఞానసర్వస్వం అంటే ఆషామాషీ కాదు. ఇందులో పనిచేయడం అంటే అనుకున్నంత సులభం కాదు. కాని ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చనే నిబంధనతో ఎవరికి వారు తమ ఇష్టమైనట్లు దిద్దుబాట్లు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేముకదా ! ఆ సమయంలో దానికి తగ్గట్టు బలమైన నిర్వహణ తప్పనిసరి. అదే ఇప్పుడు కొరవడింది. ఒకానొకప్పుడు దిద్దుబాట్ల సంఖ్య ఆధారంగా సభ్యులను అభినందించడం, పతకాలు ప్రధానం చేయడం ఉండేది. తెవికీ ప్రగతికి కావలసింది సంఖ్య కాదు నాణ్యత మాత్రమే అనీ, గణాంకాలకు ప్రాధాన్యత ఇస్తే తెవికీ నాణ్యత కుంటుపడుతుందనీ నేను పదేపదే చెప్పి చివరికి ఆ పద్దతిని మాన్పించాను. ఇప్పుడు నిర్వాహక పనులకు కూడా గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. గణాంకాలు పెంచుకోవడానికి నిర్వాహకుల మధ్య పోటీ ఏర్పడి చివరికి అసలైన నిర్వహణ కుంటుపడుతుంది లేదా సభ్యుల మధ్యన పోటీతో పాటు ఘర్షణ వాతావరణం ఏర్పడి నిర్వాహకుల మధ్య మనస్పర్థలు తలెత్తి చివరికి తెవికీకే నష్టం కలగవచ్చు. గతంలో దిద్దుబాట్లు పెంచుకోవడానికి సభ్యులు ఎలా పోటీపడ్డారో నాకు బాగా తెలుసు. చివరికి ఈ దిద్దుబాట్ల మోజులో పడి సభ్యులు హీనమైన దిద్దుబాట్లు చేసి వ్యాస నాణ్యతను తీవ్రంగా దిగజార్చారు. నిర్వహణ పనులకు కూడా గణాంకాలు వర్తింపజేస్తే నిర్వాహకులు నిర్వాహక పనులు చేయడం కంటే తమ గణాంకాలు చూసుకోవడానికే సమయం సరిపోతుందేమో! ఇప్పుడు చురుకైన నిర్వాహకులే కొద్దిమంది. వారిలో నిర్వహణ పనులు చేసేవారిని లెక్కించడానికి అరచేయి కూడా అవసరం లేదు. ఉన్న నిర్వాహకులను కాపాడుకోవాలి, వారి నిర్వాహక పనులకు సహకారం అందించాలి, అంతేకాని గణాంకాల ప్రకారం మీరు చురుకుగా లేరు కాబట్టి మీ నిర్వాహకత్వం పోతుందంటే ఇన్నేళ్ళు తెవికీకై అహరహం కృషిచేసిన వారిని అవమానపర్చడమే అవుతుంది. అంతేకాదు ఇప్పుడు చురుకైన నిర్వాహకులలో కూడా అభద్రతాభావం ఏర్పడుతుంది. అసలీ ఆలోచన ఎందుకు ? ఏవో కొన్ని వికీలలో ఉన్నంత మాత్రానా అలాంటి నిబంధన మనకెందుకు ? ఈ నిబంధనకు ప్రాతిపాదిక ఏమిటి? తెవికీని చక్కదిద్దడానికి ఉన్న అవకాశాలు వదిలి ఈ నిబంధనపై సభ్యుల దృష్టి మళ్ళించడమెందుకు? పోనీ ఈ నిబంధనే చేశామనుకుందాం, అప్పుడు తెవికీ నిర్వహణ బాగుపడుతుందనే నమ్మకం ఉందా ? నిర్వహణ బాగుపడాలంటే నిర్వహణకు సంబంధించిన నిబంధనలు మెరుగుపర్చాలి. తెవికీని ప్రగతిపథంలో నడిపించడానికి ఇతర వికీలలో మెరుగైన నిబంధనలు గమనించి అలాంటి పద్దతులు పాటించడానికి ప్రయత్నిస్తే నైనా తెవికీ బాగుపడవచ్చు. నిర్వాహకుడిగా కొనసాగాలంటే ఆ గణాంకాలను ఒక్క రోజులో సాధించవచ్చేమో కాని అది పిల్లచేష్టలా ఉంటుంది. అలాంటి అవసరం ఉండరాదు. నిర్వాహకత్వం అనేది హుందాగా కొనసాగాలి. అది స్వచ్ఛందంగా చేయాల్సిన ఒక విధినే కాని బాధ్యతగా మారరాదు. నిర్వాహకత్వం అనేది ఉత్సాహంగా చేసేటట్లుగా ఉండాలి కాని గణాంకాలను చేరుకోవడానికి ఆయాసపడేటట్లుగా కారాదు. నిర్వాహకత్వం అనేది శాశ్వతం కాదు, కాని ఏదో కొంతకాలం చురుకుగా ఉండనంత మాత్రాన (గణాంకాలు చూపనంతమాత్రాన) దూరం చేయడం భావ్యమూకాదు. ఇప్పుడు చురుకుగా ఉన్న సభ్యులు ఏవైనా నిబంధనలు రూపొందించుకోవచ్చు. పాలసీలు తయారుచేయడం కష్టమేమీ కాదు. కాని ఆ నిబంధనలు ఒకప్పుడు తెవికీ ప్రగతికి తోడ్పడినవారికి బాధ కలిగించకుండా ఉంటేచాలు. నిర్వాహకుల సంఖ్యకు పరిమితి ఉండి, ఆ పరిమితి వల్ల కొత్తగా నిర్వాహకులను తీసుకోవడం ఇబ్బందిగా ఉండి, ఇప్పుడున్న నిర్వాహకులు తెవికీకీ భారం అయితే చురుకుగా లేని నిర్వాహకులను తప్పకుండా తొలగించవచ్చు. కాని ఇప్పుడు తెవికీలో ఈ సమస్య ఏ మాత్రంలేదు. కాదుకాదు, ఇవేమీ కాదు, గణాంకాలే ముఖ్యం, నిర్వహణకు గణాంకాలే ప్రాతిపదిక, వ్యక్తిగతంగా ఎన్ని పనులున్నా సరే తెవికీలో నిర్వహణ గణాంకాలు చూపాల్సిందే అంటే మాత్రం మొదటగా నన్నే తొలగించండి. ఎందుకంటే నేను గణాంకాలను పూర్తి వ్యతిరేకిని. ఒకవేళ గణాంకాలకే మొగ్గుచూపుతూ నిబంధన చేస్తే నిర్వాహకత్వానికి రాజీనామా చేసేవారిలో నేనే ముందుంటాను. నిర్వాహణ అనేది సాధారణంగా సభ్యులు పొరపాట్లు చేసినప్పుడే తలెత్తుతుంది. సభ్యులు పొరపాట్లు చేయనప్పుడు నిర్వాహకులు తమ నిర్వాహణ గణాంకాలకై తామే కొత్త సభ్యుల లేదా అనామకుల (ఐపి అడ్రస్) అవతారమెత్తి పొరపాట్లు సృష్టించే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. అలాచేసే అవకాశాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేము. తెవికీ అనేది ఇంకనూ చిన్న వికీనే. రోజూవారీ దిద్దుబాట్ల సంఖ్య చూసిననూ పరిమితమే. అందులో నిర్వహణ గణాంకాలకు సరిపడా పొరపాట్లు ఉండాయనుకోవడం అనుమాస్పదమే. నిర్వహణ దిద్దుబాట్ల సంఖ్యకై నిర్వాహకులు అతిగా ప్రవర్తిస్తే చివరికి కొత్త సభ్యుల పాలిట శాపంగామారి తెవికీ ప్రగతి మరింత కుంటుపడవచ్చు. నిర్వాహకులు కేవలం గణాంకాలపైనే దృష్టిపెడితే తెవికీ శుద్ధి, వ్యాసనాణ్యత తదితర గణాంకేతర నిర్వహణ పనులు కుంటుపడటం ఖాయం. అసలే చురుకైన నిర్వహకుల కొరత ఉన్న తరుణంలో కొత్తగా నిర్వాహకుల గణాంకాలు చూడటానికి ఒకరిద్దరిని కేటాయిస్తే అది వృధాప్రయాసగానే మారేపరిస్థితి తలెత్తవచ్చు. మొదటిపేజీ నిర్వహణ అనేది చాలా ముఖ్యమైన కార్యము. దీన్ని నిర్వహణ గణాంకాలలో చేర్చినప్పుడు పలువులు నిర్వాహకుల మధ్య ఈ శీర్షిక నిర్వహణకు పోటీ పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. దేనికైనా సరే పోటీ ముఖ్యమే కాని అది స్నేహపూర్వకంగా ఉండాలి కాని ఘర్షణ లేదా ఉద్రిక్తతగా ఉండరాదు. మొత్తంగా చూస్తే ఈ నిబంధనలు సభ్యులు పొరపాట్లు చేయాలని ప్రోత్సహించేటట్లుగా ఉన్నాయి. సభ్యులు చేసే పొరపాట్లకై నిర్వాహకులు ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితి తెచ్చుకోవడం శోచనీయమైన విషయం. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:18, 9 ఫిబ్రవరి 2019 (UTC) 

అరుణిమ సిన్హా సంక్షిప్త వ్యాసం - ఒక పరిశీలన

 (జూలై 2018 నాటి చర్చ తెలుగు వికీపీడియా నుంచి కాపి)

తెవికీ అనగానే సామాన్య పాఠకుల దృష్టిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని కాపీపేస్టుల రూపంలో అతికించినదేననే భావన విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. అసలు ఉన్న సమాచారాన్నే మనం ఇక్కడ చేర్చాలనేది నిజమే, లేని సమాచారాన్ని మనం చేర్చడానికి అవకాశమే లేదు. అయినా తెవికీ వ్యాసాలనేవి "కాపీపేస్టు"ల రూపంలో కాకుండా లభ్యమయ్యే సమాచారాన్ని విశ్లేషించి క్రమరూపంలో వాక్యాలను చేరుస్తూ ఆధారాలు జతచేస్తూ ఉంటే బాగుంటుంది. సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం ఈ విధంగానే వ్యాసాలు చూడముచ్చటగా (చదవముచ్చటగా) తయారయ్యేవి. అప్పుడు తెవికీకి పాఠకులు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అప్పట్లో సమాచారాన్ని చేర్చే సభ్యులు కూడా కేవలం పాఠకుల దృష్టితో ఆలోచించి చదవముచ్చటైన వ్యాసాలు తయారుచేసేవారు. సభ్యులలో ప్రతిఒక్కరికీ అన్ని విషయాలలో విషయపరిజ్ఞానం ఉండకపోవచ్చు కాబట్టి ఒకరు రచించిన వ్యాసాలను విషయపరిజ్ఞానమున్న సభ్యులు మార్పులుచేర్పులు చేసి తెవికీ ప్రమాణాలకనుగుణంగా తయారుచేసేవారు. క్రమక్రమంగా సభ్యులలో మార్పువచ్చి (ముఖ్యంగా కొత్త సభ్యులు) తాము రచించిన వ్యాసాలలో ఇతర సభ్యుల మార్పులను సహించని స్థాయికి రావడం, పొరపాట్లు లేవదీసిన సభ్యులను పట్టించకపోవడం, సూచనలు చేసే సభ్యులను ఖాతరుచేయకపోవడం, తామురాసిందే వేదంగా భావించి నిర్వాహకులు సూచించే నిబంధనలే కాకుండా తెవికీ మూలనిబంధనలకే ఉల్లంఘనలు జరపడం, చివరికి తెవికీ నాణ్యత దారుణంగా పడిపోవడం, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చే సభ్యులు తెవికీకి దూరంకావడం జరిగింది. మొదటిపేజీలో ప్రదర్శనకు ఉంచిన వ్యాసాలు, మీకుతెలుసా? విషయాలలోనే పలు తప్పులున్నట్లు అప్పుడప్పుడు చూసిననూ చేయలేని మరియు చెప్పలేని పరిస్థితి రావడం బాధాకరం. నేను ఇప్పుడే చూసిన మొదటిపేజీ ప్రదర్శనలోని అరుణిమసిన్హా సంక్షిప్త వ్యాసం చదివిన తర్వాత అందులోని 12 వాక్యాలలో 6 పొరపాట్లు ఉండటం బాధకలిగించింది.
1) సంక్షిప్త వ్యాసం 3వ వాక్యంలో "మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగా కీర్తి పతాకాన్ని ఎగురవేశారు" అని ఉంది (వ్యాసంలో ఈ వాక్యానికి ఆధారం కూడా జతచేశారు - నేను ఇప్పుడే సరిచేశాను). కాని ఈమె ఎవరెస్టును అధిరోహించిన మొదటి భారతీయ వ్యక్తి కాదు (ఈ ఘనత బచేంద్రీపాల్‌కు దక్కింది). అంతేకాకుండా వ్యాసం 1వ వాక్యానికి, 3వ వాక్యం భిన్నంగా ఉంది.
2) "ఇరవై ఐదు సంవత్సరాల సిన్హా ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు చేరుకున్నారు" అని బదులు 25 సం.ల వయసులో అని రావాలి. (ఎందుకంటే వ్యాసంలోని ఇన్ఫోబాక్సులో ఈమె వయసు ఇప్పటికే 30 అని సూచిస్తోంది). ఆ వాక్యం ఐదేళ్ల క్రితం పత్రికలో వచ్చింది కాని తెవికీలో ఇప్పటికీ అలానే ఉండటం (ఉంచేయడం) బాగుండదు.
3) "గత ఏడాదిలో ఉత్తరకాశీలోని టాటా స్టీల్‌ అడ్వంచెర్‌ ఫౌండేషన్‌ (టీఎస్‌ఏఎఫ్ ) లో అరుణిమా సిన్హా చేరారు" అని ఉంది. గతఏడాది అంటే? సాధారణంగా పత్రికలు, మేగజైన్లు ఇలా వ్రాస్తాయి కాని శాశ్వత ప్రాతిపదికన ఉండే తెవికీలో ఈ విధానం బాగుండదు. ఖచ్చితంగా సం. సూచించాలి.
4) "నా కలలు ఇక ఎప్పుడూ నెరవేరవు అని ఆమె గురువారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు" వాక్యంలో గురువారం అంటే ఏ గురువారం? అసలు ఇలాంటి వాక్యాలు తెవికీలో చేర్చకపోవడం ఉత్తమం.
5) మొదటినుంచి రెండో వాక్యంలో కుడికాలు పోగొట్టుకున్నట్లు, చివరి నుంచి రెండో వాక్యంలో ఎడమకాలు దెబ్బతిన్నట్లుగా ఉంది. అసలు ఏ కాలు పోయిందో పాఠకులకు తికమక కలిగించేదిగా ఉంది.
6) "ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటున్నారు" వాక్యం మరీ బాధాకరంగా ఉంది. నాలుగేళ్ల క్రితమే ఆమె కోలుకొని పర్వతాలు అధిరోహించి చరిత్ర సృష్టించింది. కాని మనం ఆమెను ఇంకా ఆసుపత్రిలోనే ఉంచేశాం!!
ప్రధాన వ్యాసాన్ని పరిశీలిస్తే మరో 3 పొరపాట్లు కూడా ఉన్నట్లు గమనించాను (కొన్నింటిని నేనిప్పుడే సవరించాను). చిన్న వ్యాసంలోనే ఇన్ని పొరపాట్లు ఉన్నాయంటే పెద్ద వ్యాసాలలో ఎన్ని పొరపాట్లు ఉండాలి ? గతంలో ఒక దేశానికి చెందిన అనువాద వ్యాసంలో వంద తప్పులు తీశాను (అక్షరదోషాలు లాంటివి కావు, ఖచ్చితమైన తప్పులే). ఒంటిచేతితో మొదటిపేజీ శీర్షికను నిర్వహిస్తున్న నిర్వాహకుడిని తప్పుపట్టడం నా ఉద్దేశ్యం కాదు కాని తెవికీ వ్యాసాలలో తప్పులు దొర్లకుండా చురుకుగా ఉన్న నిర్వాహకులు కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:34, 21 జూలై 2018 (UTC)

చంద్రకాంతరావు గారూ మీరు ప్రస్తావిస్తున్న తెవికీ స్వర్ణయుగం (మీ వర్ణనను బట్టి అలా పిలవవచ్చునేమో అని సాహసించాను) కాలంలో నేను లేనందుకు కించిత్ బాధగా ఉన్నా, మరో స్వర్ణయుగాన్ని సృష్టించుకోగలమన్న నమ్మకం దృఢతరమవుతూండగా నా ఉత్సాహంలో పడి ఆ బాధ కొట్టుకుపోతోంది. అటువంటి స్వర్ణయుగాన్ని సృష్టించుకోవాలంటే అందుకు తగ్గ సంస్కృతిని నిర్మించాలన్నది నిర్వివాదాంశం. దిద్దుబాట్ల సంఖ్యకు బదులు ఎన్ని వ్యాసాలను మంచి వ్యాసాలుగా అభివృద్ధి చేయగలిగామన్న మెట్రిక్ ఉండడం తొలి మెట్టు అని భావించి, మంచి వ్యాసం ప్రమాణాలు అభివృద్ధి చేస్తున్నాం. ప్రయోగాత్మకంగా మంచుమనిషి వ్యాసాన్ని వ్యాసకర్త చదువరి ప్రతిపాదించగా, నేను సమీక్షక బాధ్యత స్వీకరించి ఈ సమీక్ష చేస్తున్నాను. (రెండవ అభిప్రాయం కోరుతున్నందున ఆసక్తి కల సభ్యులు తమ అభిప్రాయం రాయవచ్చు) ఇది పూర్తైతే, నాణ్యతపై దృష్టి ఉన్నవారందరం ఇంతవరకూ రాసిన వ్యాసాల్లో ఉత్తమమైనవి ఎంచుకుని, తగు మార్పుచేర్పులు చేసి ప్రతిపాదించి కనీసం ఓ పది మంచి వ్యాసాల సమీక్ష పూర్తిచేసుకోవచ్చనీ, తర్వాత సభ్యులందరినీ క్రమేపీ ఈ ప్రయత్నం వైపుకు ప్రోత్సహించడం, వారికి నేర్పించడం చేయాలనీ ఆశిస్తున్నాం. --పవన్ సంతోష్ (చర్చ) 07:03, 22 జూలై 2018 (UTC)
చంద్రకాంత రావు గారు చెప్పినవి మనమందరం దృష్టిలో పెట్టుకోవాలి. నిర్వహకులు అందరూ దీనిని గమనిస్తూ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. సాధ్యమైనంతలో ఇలాంటి విషయాలు సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను. రవిచంద్ర (చర్చ) 13:25, 23 జూలై 2018 (UTC)

 

తప్పుడు సమాచారం లేదా ఊహాత్మక సమాచారం చేర్చుట

 (జనవరి 2017లో తెలుగు వికీపీడియాలో జరిగిన చర్చ నుంచి కాపి)

చాలా రోజుల నుంచి సెలవులో ఉండుట వల్ల నిర్వహణ కార్యక్రమాలు చేయుటకు వీలుకావడం లేదు. ఇప్పుడే పరిశీలించిన నేటి దిద్దుబాట్ల ప్రకారం చెప్పాలంటే Nrgullapalli గారు వేలాది గ్రామవ్యాసాలలో తప్పుడు లేదా ఊహాత్మక సమాచారం చేర్చుతున్నట్లుగా గమనించాను. అలాగే మండలం లేదా మండల కేంద్రం కాని గ్రామవ్యాసాలలో కూడా ఆయా జిల్లాలలోని మండలాల వర్గంను చేరుస్తున్నారు. ఈ విషయం సదరు సభ్యుడికి కొన్ని మాసాల క్రితమే సూచించిననూ మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేయడంలో నిమగ్నమైయున్నారు. ఉదా:కు వర్గం:చిత్తూరు జిల్లా మండలాలు వర్గంలో ఇది వ్రాసే సమయానికి 326 పేజీలు వచ్చిచేరాయి. గుంటూరు జిల్లాలో 140, ప్రకాశం జిల్లాలో 130 మండలాలు ఉన్నట్లుగా ఆయా వర్గాలు సూచిస్తున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం గత రెండు రోజుల దిద్దుబాట్లు పరిశీలించిననూ ఈ సభ్యుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రమైననూ, ఏ జిల్లా అయిననూ, ఏ మండలం అయిననూ చేతికందిన ప్రతిగ్రామ వ్యాసంలో "గ్రామంలో ప్రధానపంటలు" అనే విభాగం పెట్టి అందులో "[[వరి]], అపరాలు, కాయగూరలు అని చేరుస్తున్నారు. నా వద్ద ఉన్న ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం మండలం మొత్తం మీద ఒక్క హెక్టారు కూడా అపరాలు సాగులేని మండలాలలో కూడా ఆ మండలపు అన్ని గ్రామాలలో అపరాలు సాగు చేస్తున్నట్లు చూపించడం మరియు ఏ ప్రాంతపు గ్రామమైనా ఒకేరకపు పంటలు పండిస్తున్నట్లు చూపించడం తప్పుడు లేదా ఊహాత్మక సమాచారంగా చెప్పబడుతుంది. ఆ సమాచారం ఎలా లభ్యమైందీ అనే విషయంపై అనుమానాలున్నప్పుడు ఆయా వాక్యాల చివరన మూసలుపెట్టడం తోటిసభ్యుల విధి. (ఇప్పుడే నేను కొన్ని గ్రామవ్యాసాలలో "ఆధారం కోరబడినది" అనే మూసపెట్టాను) దానికి సరైన వివరణ ఇవ్వడం మరియు సరైన ఆధారం చూపించడం సమాచారం చేర్చిన సభ్యుడి బాధ్యత. వివరణ ఇవ్వకుండా అభ్యంతరపర్చిన సమాచారాన్నే మళ్ళీ చేర్చడం వికీనిబంధనలకు విరుద్ధముగా పరిగణించబడుతుంది. తోటి సభ్యులు కూడా ఈ విషయంపై దృష్టిపెట్టగలరని మనవి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:21, 19 జనవరి 2017 (UTC)

అవును ఈ మధ్య కొంత చెత్త చేరుతున్నది Palagiri (చర్చ) 08:25, 22 జనవరి 2017 (UTC)
Palagiri గారు చెత్త అనే పదానికి నిర్వచనం ఇస్తే సభ్యులు సంతోషిస్తారు --Nrgullapalli (చర్చ) 01:25, 23 జనవరి 2017 (UTC)
ఇక్కడ సంధర్బాన్ని బట్టి అనవసర సమాచారం చెత్తగా Palagiri గారు అభిప్రాయపడి ఉండవచ్చు. అన్నిపేజీల్లో ఒకే మాదిరి కాక ఊరి లేదా ఆయా ప్రాంతాలలో పండించే పంటల వివరాలను మూలాధారంగా ఉదహరించడం వరకూ పర్వాలేదు కాని లేనివి చేర్చడం అనవసరం..--Viswanadh (చర్చ) 14:53, 25 జనవరి 2017 (UTC)
Nrgullapalli గారూ, "చెత్త" అనే మాటను మీరు అభ్యంతరపెట్టడం కాకుండా, పాలగిరి లాంటి పెద్దవారు అలా ఎందుకన్నారో ఆలోచించి, సరైన స్ఫూర్తితో తీసుకుని ఉండాల్సింది. చంద్రకాంతరావు గారు వెలికితీసిన విషయాల గురించి మీరు వివరణ ఇచ్చి ఉండాల్సింది. చిత్తూరు జిల్లా మండలాలు వర్గంలో 326 పేజీలు ఎందుకున్నాయో, ఈ సంఖ్య ఇంతలా ఎందుకు పెరిగిందో, అందులో మీ బాధ్యత ఎంతవరకూ ఉందో పరిశీలించి ఉండాల్సింది. ఒక్కో జిల్లాలో అన్నేసి మండలాలు ఉండడంలో అసంబద్ధత ఉందని ఎవరైనా అంటారు. నాకు గుర్తున్నంతలో చంద్రకాంతరావు గారు ఈ విషయమై మీకు గతంలో చెప్పి ఉన్నారు. అయినా అవి కొనసాగాయి. గతంలో వివిధ వాడుకరులు వివిధ సందర్భాల్లో ఎన్నోసార్లు మీరు చేస్తున్న మార్పు చేర్పుల గురించి మీకు చెప్పి ఉన్నారు.. మీరు చేరుస్తున్న ఖాళీ విభాగాల గురించి, మీరు తయారు చేస్తున్న కొత్త పేజీల గురించి, మీరు ఇస్తున్న లింకుల గురించీ.. మీకు చెప్పి ఉన్నారు. ఆయా లోపాలను గమనించానని మీరు చెప్పినప్పటికీ, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన దాఖలాల్లేవు -ఎందుకంటే అవే తప్పులు పునరావృతమౌతున్నై. కె.వెంకటరమణ గారు ఎన్నోసార్లు మీకు చెప్పి, రచ్చబండలో కూడా చెప్పి, ఎన్నో కొత్త పేజీలను తొలగించడం నాకు తెలుసు. నాబోటి వాడుకరులకు మార్గదర్శకులు కావాల్సినంత అనుభవం ఉంది మీకు. కానీ, దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు. వీటిని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. సరైన స్ఫూర్తితో తీసుకుంటారనే ఆశతో- చదువరి (చర్చరచనలు) 16:03, 25 జనవరి 2017 (UTC)
కూరగాయలు పండించని గ్రామం లేదు. కనీసం రైతులు వారి ఇళ్ళముందు తప్పనిసరిగా పండిస్తున్నారు. ఇది నిజం వ్యూహాత్మకంకారు. ఇది కూడా చెర్చవద్దంటీ మానేస్తాను. చెత్త అనే పదం అభ్యంతరకరం దీన్ని సమర్దించుకొనే అవకాశంలేదు --Nrgullapalli (చర్చ) 01:01, 26 జనవరి 2017 (UTC)
ముందుగా చర్చకు స్పందించిన పాలగిరి, విశ్వనాథ్, చదువరి గార్లకు కృతజ్ఞతలు. చర్చ ప్రారంభమై వారం రోజులు గడిచిననూ సదరు సభ్యుడి నుంచి ఎలాంటి సరైన ప్రతిస్పందన లేదు. తప్పుడు / ఊహాజనిత దిద్దుబాట్లుగా అభ్యంతరపర్చిన దిద్దుబాట్లు మాత్రం చాలావరకు ఆగిపోయాయి. (కొన్ని జరిగాయిలెండి). అభ్యంతరపర్చిన వాక్యాల చివరన ఉన్న ఆధారం కోరబడిన మూసలు మాత్రం అలాగే ఉన్నాయి. అంటే నేను అభ్యంతరపర్చిన ఆ దిద్దుబాట్లు తప్పుడు దిద్దుబాట్లుగా రూఢి అయ్యాయన్నమాట! అయితే ఇది పదో, పాతికో కాదు. వేలల్లో ఇలాంటి తప్పుడు దిద్దుబాట్లు చేస్తున్ననూ మనం అభ్యంతరపర్చకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. వికీలో ఏదేని సమాచారం చేర్చాలంటే ఆధారం తప్పనిసరి అనేది మూలనియమమే. అలాంటి మూలనియమాల ఉల్లంఘన అప్రతిహతంగా జరుగుతున్ననూ చెప్పడానికి సాహసించలేకపోతున్నాము! లేదా సీనియర్ సభ్యులకు దిద్దుబాట్లు చేయడంలో ఏదైనా అనధికార మినహాయింపు ఇస్తున్నామా! ఒక కొత్త సభ్యుడు చిన్న తప్పుచేస్తే నిరోధం విధిస్తున్నాము, మరి వేలాది అనవసర దిద్దుబాట్లు చేస్తున్న సీనియర్ సభ్యుల దిద్దుబాట్లను మాత్రం చూస్తూ ఊరకుండిపోతున్నాము! ఈ సభ్యుడి దిద్దుబాట్లు చెత్తదిద్దుబాట్లుగా పరిగణించడానికి కారణం అతని దిద్దుబాట్లు తెవికీకి ఏ కోశాన ఉపయోగపడకపోవడమే! అంతేకాకుండా ఆ దిద్దుబాట్లు తెవికీకి నష్టాన్ని, తోటి సభ్యులకు చికాకును, పాఠకులకు అసహనాన్ని, నిర్వహణ చేసేవారికి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక్కడ మనం రచనలు చేయడం ఎంత ముఖ్యమో ఉన్న వ్యాసాలను, వ్యాస నాణ్యతను కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. సభ్యుడి దిద్దుబాట్ల వల్ల వ్యాసనాణ్యత ముఖ్యంగా గ్రామవ్యాసాలలో ఘోరంగా దెబ్బతింటోంది. అసలు ఏ ఉద్దేశ్యంతో సదరు సభ్యుడు దిద్దుబాట్లు చేస్తున్నాడో అర్థంకావడం లేదు. సభ్యునికి తెవికీ నియమాలపై అవగాహన ఉన్నట్లు, చర్చలను పట్టించుకున్నట్లు, చెప్పిననూ అర్థం చేసుకోగల స్థోమత ఉన్నట్లు, విషయ పరిజ్ఞానం ఉన్నట్లుగా పరిణతి చూపించడం లేదు. సరే ఏవీ లేకున్ననూ దిద్దుబాట్లు చేయరాదనే నియమం లేదు కదా! ఎవరైనా, ఏమైనా దిద్దుబాట్లు చేయవచ్చనుకుందాం. కాని ఆ దిద్దుబాట్ల వల్ల తెవికీకి నష్టం కలుగకుండా మరియు తోటి సభ్యులకు చికాకు కల్పించకుండా ఉంటే చాలు. కాని సభ్యుడి దిద్దుబాట్లు వల్ల తెవికీ నిర్వహణ చేసేవారికి ఇబ్బందిగా మారింది. ఇటీవలి దిద్దుబాట్లు గమనించిననూ మనం ఒక విషయం గమనించాలి. వ్యాసాలలో లింకులు బాటు లేదా AWB ద్వారా అతి సునాయాసంగా చేయడానికి వీలున్ననూ మనం ఎందుకు చేయడం లేదో పరిశీలిద్దాం. అసలు లింకులివ్వడం అంటే పదాలను బ్రాకెట్లలో ఇరికించడం మాత్రమే కాదు. దీనికి చాలా కసరత్తు ఉంది. బాటు లేదా AWB ద్వారా చేయడంలో ఇబ్బందులుంటాయనే అలా చేయడం లేదు. మరి ఈ సభ్యుడు చేస్తున్నదేమిటి? కేవలం బాటు చేసే పనులే కదా! సభ్యుడిచ్చిన చాలా లింకులు దారిమార్పులకు లేదా ఎర్రలింకులకే దారితీస్తున్నాయి. అంతేకాకుండా ఒక పదానికి కాకుండా పదసముదాయానికి ఇచ్చే లింకులు చాలానే ఉంటాయి. ఖచ్చితంగా పదాలు లేనప్పుడు వాక్యనిర్మాణం చెడిపోకుండా పైపులు ఉపయోగిస్తూ లింకులు ఇవ్వాల్సి ఉంటుంది. లింకులివ్వడంలో పైపుల ఉపయోగం ఎనలేనిది. కాని సదరు సభ్యుడు ఎక్కడా పైపులు ఉపయోగించిన దాఖలాలు నా దృష్టికి రాలేదు. మానవ ప్రయత్నం ద్వారా చేస్తూ కూడా కేవలం బాటు లేదా AWB చేసే పనులే చేయడం సరైనది కాకపోవడమే కాకుండా తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు. ఉన్న సరైన పదాలు కూడా మార్చి లింకులకోసం తప్పుడు పదాలు చేర్చిన విషయం అతని దిద్దుబాట్లు తెలుపుతాయి. చాలా లింకులు అయోమయ నివృత్తి పేజీలకు, వ్యాసానికి సంబంధం లేని పేజీలకు దారితీస్తున్నాయి. ఇది పాఠకులకు తీవ్ర అసహనానికి గురిచేసే అవకాశం ఉంది. చాలా గ్రామవ్యాసాలలో కవులకు సంబంధించిన వర్గాలు, కథారచయితలకు సంబంధించిన వర్గాలు, ప్రాజెక్టులకు సంబంధించిన వర్గాలు, వికీపీడియన్ల వర్గాలు చేర్చే ఉద్దేశ్యం ఏమిటో అస్సలు తెలియడం లేదు. మండలం కాని గ్రామ వ్యాసాలలో కూడా వందలసంఖ్యలో వర్గాలు చేర్చి మండలాలుగా చేసిన (!) సంగతి ఇదివరకే తెలియజేశాను. ఏది చెప్పిననూ రెండు రోజులు ఆపి మళ్ళీ అదేపని ప్రారంభించిన సంగతి చాలా సార్లు గమనించాను. ఖాళీ విభాగాలు చేర్చడం, తప్పుడు ఇన్ఫోబాక్సులు చేర్చడం, గ్రామవ్యాసాలలో అతిసాధారణ సమాచారం చేర్చడం లాంటి గురించి ఇదివరకే చర్చలు జరిగిననూ సభ్యుడు చేర్చడం మాత్రం ఆపడంలేదు. నిర్వాహకులు, తోటి నైపుణ్య సభ్యులు కూడా ఈ సభ్యుడికి చెప్పీ చెప్పీ విసిగిపోయి తెవికీకి దూరమయ్యే సూచనలున్నాయి. పైగా అతని దిద్దుబాట్లను సమర్థించుకుంటూ మాట్లాడటం జరుగుతోంది. కూరగాయలు పండించే గ్రామం లేదా అని ప్రశ్నించడం వల్ల ఒక విజ్ఞానసర్వస్వంలో చేర్చాల్సిన సమాచార స్థాయిపై అతనికి తగిన నైపుణ్యం లేదనే తెలుస్తోంది. ఏదేని వ్యాసంలో మనం అతిసాధారణ విషయాలు చేర్చరాదు. ఒక వ్యక్తి వ్యాసంలో అతనికి రెండు చేతులున్నాయి, రెండు కాళ్ళున్నాయి, ముక్కుతోనే గాలిపీలుస్తాడు, నోటితోనే తింటాడు ... అని వ్రాయడంలో ఎంత అసంబద్ధత కనిపిస్తుందో గ్రామ వ్యాసంలో ఈ సభ్యుడు వ్రాసే విషయాలు అలాగే ఉంటున్నాయి. ఈ సమాచారం తప్పు కాకున్ననూ వ్యాసంలో ఉండాల్సిన విషయాలు మాత్రం కావు. కొద్దిగానైనా ప్రత్యేకత ఉండే విషయాలు మాత్రమే వ్యాసాలలో చేర్చాలి. ఉదా:కు కాళ్ళు లేకున్ననూ, కళ్ళు లేకున్ననూ తమ నైపుణ్యాన్ని చూపించిన వారి వ్యాసంలో మాత్రం ఆ విషయాలు వ్రాయవచ్చు. ఇదివరకు ఒక కొత్తసభ్యుడు (?) కూడా ఈ సభ్యుడి దిద్దుబాట్లను వెక్కిరిస్తూ, హేళనపరుస్తూ వందలాది గ్రామవ్యాసాలలో సాధారణ సమాచారం చేర్చిన సంగతి మనకు తెలుసు (ఉదాహరణకు ఇది చూడండి). చేర్చవద్దంటే మానేస్తాను అనడం చూస్తే ఈ సభ్యుడికి సరాసరిగా పాఠశాలలో చిన్నపిల్లలకు చెప్పినట్లుగా వద్దు అనేవరకు తప్పుడు మరియు అతిసాధారణ విషయాలు చేర్చే దిద్దుబాట్లు ఆపేటట్లుగా లేరని తెలుస్తోంది. అసలు చర్చ ఎందుకు తీశారో అర్థం చేసుకోవడం లేదు. విజ్ఞానసర్వస్వంలో పనిచేస్తున్నామంటే మనం ఆ స్థాయిలో సమాచారం చేర్చాలి కాని ఏదో చెత్తసమాచారం చేర్చడం కాదు, చెత్త దిద్దుబాట్లు చేయడం అంతకన్నా కాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:35, 27 జనవరి 2017 (UTC)
సదరు వ్యక్తులు ఎడిట్ కౌంట్ కోసమే ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. తెవికీలో ఎడిట్ల సంఖ్యను బట్టి కాకుండా, బైట్ల సంఖ్యను బట్టి గ్రేడింగ్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:36, 29 జనవరి 2017 (UTC)
ఆయన ఇప్పటివరకు సృష్టిచిన సుమారు 500 మొలక గ్రామవ్యాసాలలో సగం వ్యాసాలు యిదివరకు ఉన్నవే తిరిగి సృష్టించడం వలన తొలగించాను. అనేక సార్లు వారి చర్చాపేజీలలో, రచ్చబండలో తెలియజేసినప్పటికీ ఆయన ధోరణిలో మార్పులేదు. ఉన్న వ్యాసాలనే అక్షర బేధాలతో సృష్టించడం, సునాయాస దిద్దుబాట్లు చేయడం, ఖాళీ విభాగాలు చేర్చడం, వ్యాసాలలో రాసిన వాక్యాలకు మూలాలు యివ్వకపోవడం మరియు సమాచారం లేని వ్యాసాలను సృష్టించడం నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఆయన మార్పులను సరిదిద్దడానికి నిర్వాహకులకు తలకు మించిన భారంగా పరిణమిస్తుంది. ఎవరైనా తెలిసినవాళ్ళు చెప్పినా ఆయన ధోరణిని మార్చుకోకపోవడం శోచనీయం. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:19, 30 జనవరి 2017 (UTC)
స్పందించిన ప్రణయ్‌రాజ్, కె.వెంకటరమణ గార్లకు కూడా కృతజ్ఞతలు. సదరు సభ్యుడిపై తగు చర్య నిమిత్తము ప్రక్రియ ప్రారంభించాను. పలు నియమ-నిబంధనల ఉల్లంఘన మరియు రచ్చబండ చర్చలను పట్టించుకోకపోవడం, తెవికీ నాణ్యత దెబ్బతినడం, తోటిసభ్యులకు ఇబ్బంది మరియు విలువైన కాలం వృధాకావడం, నిర్వహణ ఇబ్బందులు తదితర కారణాల వల్ల ముందుగా దిద్దుబాట్లు ఆపవలసిందిగా సభ్యుడి చర్చాపేజీలో తెలియజేశాను. సభ్యుడి వైఖరిలో మార్పులేనప్పుడు మరో అవకాశం కూడా ఇచ్చి సభ్యునిపై నిరోధం విధించే అవకాశం ఉంది. సీనియర్ సభ్యులు, నిర్వాహకులు గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:00, 31 జనవరి 2017 (UTC)

 

ఆనంద్ మార్పులు - తెవికీకి గుణపాఠాలు

 (22 జూలై 2016 నాటి చర్చ కాపి)

ఆనంద్ కొత్త సభ్యుడా, పాత సభ్యుడా అనే విషయం ప్రక్కన పెడితే ఆ సభ్యుడి దిద్దుబాట్లు ముఖ్యంగా రెండు విషయాలను తెలుపుతాయి. గ్రామవ్యాసాలలో ఇద్దరు సభ్యుల దిద్దుబాట్ల అసహనత మరియు తెవికీకే ఆశ కల్పించి డబ్బు ఆశించడం. పరిశీలించిన దిద్దుబాట్ల ఆధారంగా చెప్పాలంటే గ్రామవ్యాసాలలో చేర్చుతున్న సమాచారం చాలా ఘోరంగా ఉంది. సమాచారం లభ్యమౌతుంది కదాని తప్పులతడక వెబ్‌సైట్ల నుంచి అధికమొత్తంలో తప్పుడు సమాచారం కాపీ చేయడం నిబంధనలను అతిక్రమించడమే. సంవత్సరాల క్రితమే ఈ తప్పులతడక వెబ్‌సైట్ సమాచారం ఏ మాత్రం ప్రామాణికం కాదని చర్చలలో వ్యక్తమైంది. అప్పుడు తాత్కాలికంగా ఆపివేయబడిననూ చాలాకాలంగా అప్పటి చురుకైన సభ్యులు ఇప్పుడు చురుకుగా లేరని మళ్ళీ త.త.వెబ్‌సైట్ నుంచి గంపగుత్త సమాచారం చేర్చడం, ఇప్పుడు చురుకైన సభ్యులు, చురుకుగా ఉన్న నిర్వాహకులు కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రామవ్యాసాలలో సమాచారం చేర్చాలంటే ప్రామాణిక వెబ్‌సైట్ల సమాచారం అంతర్జాలంలో లభ్యమౌతున్ననూ అప్రామాణికమైన, వ్యాపారధోరణితో నడిచే త.త.వెబ్‌సైట్ నుంచి సమాచారం తెవికీలో చేర్చే ఉద్దేశ్యం స్పష్టంగానే కనిపిస్తోంది. నేను పరిశీలించిన కొన్ని మండలాల గ్రామాలు ముఖ్యంగా నా స్వంతమండలం తాండూరు మండలానికి చెందిన గ్రామాలలో చేర్చిన సమాచారం ఆధారంగా చెప్పాలంటే తాండూరు సమీపంలోని గ్రామాలకు కూడా సమీప రైల్వేస్టేషన్ తాండూరు కాకుండా దూరాన ఉన్న రైల్వేస్టేషన్ పేర్లు ఇవ్వబడ్డాయి. సమీప గ్రామాలు అని చెబుతూ ఎక్కడో 100 కిమీ పైబడి దూరాన ఉన్న పట్టణాల పేర్లు ఇవ్వబడ్డాయి. తాండూరు పట్టణంలో భాగంగా ఉన్న ప్రాంతాలు కూడా కొత్తగా గ్రామవ్యాసాలుగా సృష్టించబడ్డాయి. ఈ ప్రాంతాలకు బస్సులు కూడా తిరుగుతున్నాయని తప్పుడు సమాచారం చేర్చబడింది. ఉదా:కు పురపాలక సంఘంలో తొలివార్డు అయిన మాల్ రెడ్డిపల్లి(తాండూరు) ప్రాంతానికి అసలు బస్సులే లేవు. పాత తాండూర్ వ్యాసంకూడా కొత్తగా సృష్టించి సమీప మండలాలు అని విభాగం పెట్టి పట్టణంలోని ప్రాంతాలనే చేర్చారు. సమీప రైల్వేస్టేషన్ అంటూ దూరాన ఉన్న నవాండ్గి, ఆ తర్వాత తాండూరు ఉంచారు. అసలు తాండూరు రైల్వేస్టేషన్ ఉన్నదే పాతతాండురు ప్రాంతంలో. బస్సులే నడవని ఈ ప్రాంతానికి కూడా బస్సులు కూడా నడుస్తున్నాయి అని వ్రాయబడింది. చిన్న వ్యాసాలలో కూడా ఇన్ని తప్పులు ఉండడానికి కారణం సభ్యులు త.త.వెబ్‌సైట్ పైనే ఆధారపడి సమాచారం చేర్చడం. ఇలాంటి తప్పుడు సమాచారం చదివిన పాఠకులు తెవికీని ఎలా ఆదరిస్తారు, అభిమానిస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుమస్తా నగర్ గ్రామవ్యాసం కూడా తాండూరు పట్టణంలోని ఒక ప్రాంత వ్యాసమే. ఇందులో జనాభా విభాగం పెట్టి ఏవో గణాంకాలు రాశారు కాని అవి ఏ మాత్రం సరైనవి కావు, అసలు అవి ఎక్కడ లభ్యమైనాయి ? పట్టణంలో భాగంగా ఉన్న ఖాన్ కాలని వ్యాసాన్ని ఒక గ్రామవ్యాసంగా సృష్టించి "ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషనులు నావాంద్గి, మంతట్టి రైల్వే స్టేషనులు" అనీ, "బస్సులు కూడ నడుస్తున్నవి" అనీ వ్రాశారు కాని తాండూరు పట్టణంలోని ఒక ప్రాంతానికి తాండూరు రైల్వేస్టేషన్ మాత్రం దగ్గర కాదట! బస్సులు నడవని ప్రాంతానికి తప్పు సమాచారం చేర్చబడింది. మార్వాడి బజార్ వ్యాసం సమాచారం కూడా తప్పులతడకే. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇక రెండో విషయానికి వస్తే ఏడెనిమిది సంవత్సరాల క్రితం తెవికీలో అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తూ కష్టాన్ని, నష్టాన్ని భరిస్తూ తెవికీకి తోడ్పడేవాళ్ళము. సమాచారం చేర్చే కష్టమే కాదు స్వయంగా పలుప్రాంతాలను స్వంతఖర్చుతో భరిస్తూ ఫోటోలు తీస్తూ తెవికీలో ఇష్టాపూర్వకంగా చేర్చేవాళ్లము. దీన్ని కష్టం, నష్టంగా భావించకుండా పాఠకుల ప్రయోజనాలకోసం సంతోషంగా పనిచేసేవాళ్ళము. క్రమక్రమంగా పరిస్థితులు మారి వికీలలో డబ్బు పాత్ర పెరుగుతూ సభ్యులమధ్య వాదోపవాదాలు కూడా జరిగాయని చర్చాపేజీల ద్వారా తెలుస్తోంది. ఎప్పుడైతే డబ్బు రంగప్రవేశం చేసిందో అప్పుడే తెవికీ దిగజారడం మొదలైంది. స్వచ్ఛందంగా పనిచేసేవారు దాదాపు అందరూ దూరమయ్యారు. ఇప్పుడు సభ్యులు మరింతగా ముందుకు వెళ్ళి ఏవో కొన్ని ఫోటోలు అప్‌లోడ్ చేసి, తెవికీకి ఆశకల్పించి, కారు ఖర్చులిస్తే ఇలాంటివి మరిన్ని అప్‌లోడ్ చేస్తామనడం ఆశ్చర్యానికి గురిచేసే విషయమే ! తెవికీ అనేది ఎవరి నుంచి ఏమీ ఆశించదు, కేవలం స్వచ్ఛందంగా పనిచేసేవారే తెవికీకి సంపద లాంటివారు. అలాంటి తెవికీకే ఆశకల్పించడం, కొందరు సభ్యులు కూడా మద్దతు పలకడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ ప్రశ్నలకు బదులేది?

1) మండలంలోని అన్ని గ్రామాలు ఒకే ఎత్తులో ఉంటాయా ? ఒక మండలం సరిహద్దు పూర్తికాగానే ఆ గ్రామానికి, సరిహద్దు మండలంలోని మరో గ్రామానికి ఒకేసారి 30 నుంచి 200 మీటర్ల ఎత్తు తగ్గితే అమాంతం పడిపోవాల్సిందేనా ? (ఉదా: నారాయణఖేడ్, కంగ్టి మండల గ్రామాలన్నీ 600 మీటర్ల ఎత్తులో ఉంటే దానికి సరిహద్దు మండలంలోని కల్హేర్ మండల గ్రామాలన్నీ 375 మీటర్ల ఎత్తులో ఉన్నాయట !)
2) మండలం ఒక జిల్లా సరిహద్దులో ఉన్నంత మాత్రానా మండలంలోని అన్ని గ్రామాలు జిల్లా సరిహద్దులో ఉన్నట్లేనా ?
3) మండలంలోని ఒక గ్రామానికి కాని, కొన్ని గ్రామాలకు కాని, ఒక పట్టణం నుంచి రవాణా సౌకర్యం ఉన్నంత మాత్రానా మండలంలోని అన్ని గ్రామాలకు ఫలానా పట్టణం నుంచి రవాణా సౌకర్యం ఉన్నట్లేనా ?
4) సమీప గ్రామాలు అని విభాగం పేరుపెట్టి అందులో ఎక్కడెక్కడో సుదూరాన ఉన్న పట్టణాల పేర్లు ఉంఛడం భావ్యమేనా ?
5) మండల వ్యాసంలో సరిహద్దు మండలాలు పెట్టవచ్చు కాని గ్రామ వ్యాసాలలో కూడా సరిహద్దు మండలాలు పెట్టే అవసరం ఉన్నదా ?
6) భారతదేశంలో ఒకే టైం జోన్ అమలులో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రతి గ్రామవ్యాసంలో Time zone: IST (UTC+5:30) వ్రాసే అవసరం ఉన్నదా ?
7) కేవలం వాణిజ్య ప్రయోజనాలకై నిర్వహిస్తున్న తప్పులతడక వెబ్‌సైట్ నుంచి పెద్దమొత్తంలో తప్పుడు సమాచారం తీసుకొని తెవికీలో చేర్చడం న్యాయమేనా ?
8) సీనియర్ సభ్యులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు మిగితా నిర్వాహకులు, సభ్యులు చురుకుగా ఉండి కూడా పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి ?
9) కేవలం యాంత్రికంగా మాత్రమే లెక్కవేసి దూరాలు తెలిపే తప్పులతడక వెబ్‌సైట్ నుంచి సమాచారం తీసుకోవడం ఎంతవరకు ప్రామాణికం ?
10) ప్రామాణిక గ్రంథాలు, వెబ్‌సైట్ల నుంచి కాపీహక్కుల నిబంధనలను అనుసరిస్తూ కొన్ని కొన్ని పాయింట్లు మాత్రమే తీసుకుంటూ వ్యాసాలు తయారుచేయాలనే స్పష్టమైన మూలనిబంధనలున్న వికీలలో అప్రామాణికమైన వెబ్‌సైటు నుంచి, తప్పుల తడక వెబ్‌సైట్ నుంచి అధికమొత్తంలో సమాచారం తీసుకుంటూ తెవికిని తప్పుదారిపట్టించడం ఎంతవరకు సమంజసం ?
11) గ్రామవ్యాసాలలో సమాచారం పూర్తిచేయడానికి పలు ప్రామాణిక వెబ్‌సైట్లు అంతర్జాలంలో అందుబాటులో ఉన్ననూ, వాటిని విస్మరించి కేవలం సునాయాస దిద్దుబాట్లు చేయవచ్చనే లక్ష్యంతో తప్పుల తడక వెబ్‌సైటుపై ఆధారపడటం నిబంధనలను అతిక్రమించడం కాదా ?
12) కేవలం "లేవు" అనే పదం పెట్టడానికి ఒక విభాగం సృష్టించే అవసరం ఉన్నదా ?
13) పట్టణంలో భాగంగా ఉన్న ప్రాంతాలను కూడా గ్రామాలుగా కొత్త వ్యాసాలు సృష్టించడమే తప్పు అయితే అందులో మరింత తప్పు సమాచారం చేర్చి పాఠకులను తప్పుదోవ పట్టించడం న్యాయమేనా ?
14) మండలంలోని అన్ని గ్రామవ్యాసాలలో ఒకే సమాచారాన్ని కాపీచేస్తున్నట్లుగా ఎవరైనా గమనించవచ్చు. అక్షరదోషాలు కూడా మండలం మొత్తం వ్యాపిస్తున్నాయనేందుకు నారాయణ్‌ఖేడ్ మండలపు అన్ని గ్రామాలలోని "బీదర్ నుండి తోడ్డురవాణా సౌకర్యం కలదు" వాక్యమే ఉదాహరణ.
15) సభ్యులు సభ్యులు కలిసి ఊర్లు పంచుకొని తప్పులతడక వెబ్‌సైట్ నుంచి తప్పు సమాచారం పెడుతూ తెవికీని తప్పుడ్వికీగా మార్చడం ఏ మాత్రం సమంజసం ?
16) సభ్యులు తమకు ఇష్టమైన రంగాలలో పని చేసుకోవచ్చు అంటే ఇష్టమైనట్టు పని చేసుకోవచ్చు అనికాని, ఇష్టమైన విధంగా పనిచేసుకోవచ్చు అని అర్థం చేసుకోవచ్చా? నిబంధనలను త్రుంగలోతుక్కి ప్రవర్తించడం తగునా ?
17) ఏదో ఆధారం దొరికిందనీ, మూలం చేర్చుతున్నాం కదా అనీ ఇక్కడ సమాచారం చేర్చడమే ప్రధానమా? సమాచారం ప్రామాణికమా, కాదా అని విశ్లేషించకుండా పెద్ద ఎత్తున సమాచారం చేర్చడం సమంజసమేనా ?
(చర్చను విడదీయకండి) సి. చంద్ర కాంత రావు- చర్చ 19:37, 22 జూలై 2016 (UTC)

Saturday, 4 October 2014

సెప్టెంబరు 2014 మాసంలో తెవికీలో తెలంగాణ ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ

  • సెప్టెంబరు 2014 మాసంలో తెలంగాణ ప్రాజెక్టు పరిధిలో కొత్తగా 10 వ్యాసాలు సృష్టించబడ్డాయి. ఇందులో 4 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి కాగా 2 వ్యాసాలు అభయారణ్యాలకు చెందినవి. 
  • జిల్లాల వారీగా పరిశీలిస్తే మహబూబ్‌నగర్ జిల్లా, వరంగల్ జిల్లాకు చెందిన చెరో 3 వ్యాసాలు, మెదక్, నిజామాబాదు, హైదరాబాదుకు చెందిన ఒక్కో వ్యాసము, మరో ఇతర వ్యాసం సృష్టించబడ్డాయి.
  • సభ్యుల వారీగా చూస్తే R.Karthika Raju చే 4 వ్యాసాలు, Naidugari Jayanna మరియు వైజాసత్య లచే చెరో 3 వ్యాసాలు సృష్టించబడ్డాయి. 
  • మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన వందలాది గ్రామ వ్యాసాలలో ఖాళీవిభాగాలు తొలగించడం, వ్యాసాలను శుద్ధిచేయడం, సమాచారం చేర్చడం జరిగింది.
తెలంగాణకు సంబంధించిన మరిన్ని వ్యాసాలు సృష్టించబడడానికి, ఉన్న వ్యాసాలలో సమాచారం వృద్ధిచేయడానికి ఆసక్తి ఉన్నవారు తెలుగు వికీపీడియాలో చేరి రచనలు ప్రారంభించండి.